వారంలో 41,960

18 Sep, 2018 07:51 IST|Sakshi

ఓటర్ల జాబితాలో నమోదు,సవరణలకు అనూహ్య స్పందన  

ఆన్‌లైన్‌లో 26,979.. ఆఫ్‌లైన్‌లో 14,981 దరఖాస్తులు  

అత్యధికంగా కార్వాన్‌లో 4,811  

ఉదయం 6 నుంచి రాత్రి 10గంటల వరకు అందుబాటులో టోల్‌ఫ్రీ(1800 599 2999) నెంబర్‌

సాక్షి, సిటీబ్యూరో: ఓటర్ల జాబితాలో పేర్ల నమోదు, చిరునామా మార్పు, పొరపాట్ల సవరణ తదితర అంశాలకు సంబంధించి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది. కేవలం వారం రోజుల్లోనే 41,960 దరఖాస్తులు వచ్చాయి. ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఓటర్ల జాబితా స్పెషల్‌ రివిజన్‌ షెడ్యూల్‌కు అనుగుణంగా ఈ నెల 10–25 వరకు నమోదు, అభ్యంతరాలకు గడువు విధించారు. 2018 జనవరి ఒకటో తేదీ నాటికి 18ఏళ్లు నిండిన వారు కొత్త ఓటరుగా, అలాగే జాబితాలో పేర్లు  గల్లంతైన వారూ నమోదు చేసుకునేందుకు, సవరణలకు అవకాశం కల్పించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్‌ జిల్లా పరిధిలోని 15 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి సోమవారం వరకు మొత్తం 41,960 దరఖాస్తులు అందాయి. వీటిలో ఆన్‌లైన్‌ ద్వారా 26,979.. ఆఫ్‌లైన్‌లో 14,981 దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఆయా అంశాల వారీగా వేరు చేస్తున్నారు. ఓటర్‌ నమోదు కోసం, జాబితాలో పేరు గల్లంతైన వారు, చిరునామాలో మార్పుల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఎక్కువ మంది ఉన్నట్లు తెలుస్తోంది.

ఓటర్‌ జాబితాలో పొరపాట్ల సవరణకు గతంలో నిర్వహించిన ఇంటింటీ సర్వే సందర్భంగా అధికారులు చాలా వరకు ప్రజల ఇళ్లకు వెళ్లకుండానే ఇష్టానుసారంగా ఓట్లు తొలగించారనే ఆరోపణలున్నాయి. మరోవైపు ఓటరు జాబితాలో నమోదు కోసం దరఖాస్తు చేసుకున్న వారికి త్వరితంగా ఆ ప్రక్రియ పూర్తి కాకపోవడంతో... మరోసారి దరఖాస్తు చేసుకోగా, రెండుసార్లు జాబితాలో పేర్లున్న వారు సైతం ఉన్నారు. ఇలాంటి పొరపాట్లను సరిదిద్దేందుకు ఓటరు జాబితాలను క్షుణ్ణంగా పరిశీలించేందుకు జీహెచ్‌ఎంసీతో పాటు రెవెన్యూ అధికారులు, సిబ్బంది సేవల్ని కూడా వినియోగించుకుంటున్నారు. ఫిర్యాదులు, అభ్యంతరాలను వచ్చే నెల 4లోగా పరిష్కరించాల్సి ఉండడంతో... అధికారులు ఆ దిశగా తగిన చర్యలు చేపట్టారు. ప్రజలు కార్యాలయాలకు వచ్చి అందజేసిన దరఖాస్తులకు సంబంధించి 1,326 క్షేత్రస్థాయిలో పరిశీలించారు. మిగతావి పరిశీలించాల్సి ఉంది. అలాగే ఆన్‌లైన్‌లో అందిన దరఖాస్తులకు సంబంధించి క్షేత్రస్థాయి పరిశీలన జరగాల్సి ఉంది. 

ఉదయం 6గంటల నుంచే...  
ప్రజల నుంచి వస్తున్న అనూహ్య స్పందనతో ఉదయం 6గంటల నుంచి రాత్రి 10గంటల వరకు టోల్‌ఫ్రీ (1800 599 2999) నెంబర్‌ సదుపాయం అందుబాటులో ఉంటుందని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఎం.దానకిశోర్‌ తెలిపారు. ఇందుకోసం 30 లైన్లు అందుబాటులో ఉంచినట్లు పేర్కొన్నారు. దీన్ని ప్రారంభించినప్పటి నుంచి మూడు రోజుల్లో ఇప్పటి వరకు 2,500 మందికి పైగా ఈ సదుపాయాన్ని వినియోగించుకున్నారని చెప్పారు. ఓటరు జాబితాలో పేరు నమోదు, చిరునామా మార్పు, తొలగింపు, సవరణలు తదితర  అంశాల్లో సందేహాల నివృత్తికి టోల్‌ఫ్రీ నెంబర్‌లో సంప్రదించాలని సూచించారు.

మరిన్ని వార్తలు