జనవరి 15 వరకు ఓటర్ల నమోదు 

14 Nov, 2019 03:33 IST|Sakshi

ఓటర్ల జాబితా సవరణకు కొత్త షెడ్యూల్‌ జారీ

డిసెంబర్‌ 16న ముసాయిదా జాబితా ప్రకటన

2020 ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితా ప్రచురణ

సాక్షి, హైదరాబాద్‌: ఓటర్ల జాబితా సవరణకు కేంద్ర ఎన్నికల సంఘం కొత్త షెడ్యూల్‌ జారీ చేసింది. 2020 జనవరి 15 వరకు ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరించనుంది. ఓటర్ల నమోదుతోపాటు ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాల స్వీకరణ కోసం కొత్త తేదీలను ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమం–2020 జరుగుతోంది. 2020 జనవరి 1 నాటికి 18 ఏళ్ల వయసుకు చేరే యువతీయువకులతో పాటు ఓటర్ల జాబితాలో పేరు లేని వ్యక్తుల నుంచి ఓటరు నమోదు దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఈ నెల 30 వరకు ఓటర్ల జాబితాల పరిశీలన, పోలింగ్‌ కేంద్రాల హేతుబద్ధీకరణ చేపట్టనున్నారు. డిసెంబర్‌ 16న ముసాయిదా ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారు.

ముసాయిదా జాబితాలో పేర్లు లేని వారి నుంచి ఓటర్ల నమోదు దరఖాస్తులను స్వీకరణ, ముసాయిదా జాబితాపై అభ్యంతరాలను 2020 జనవరి 15 వరకు స్వీకరించనున్నారు. ఫిబ్రవరి 7న తుది ఓటర్ల జాబితాను ప్రకటించనున్నారని సీఈఓ రజత్‌కుమార్‌ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు.  ఓటర్ల పరిశీలన కార్యక్రమంలో భాగంగా బూత్‌ స్థాయి అధికారులు (బీఎల్‌ఓ) ఇంటింటా తిరిగి ఓటర్ల జాబితాలో పేర్లు, ఇతర వివరాలను నిర్ధారించుకుంటారన్నారు.

ఓటరు జాబితాలో పేర్ల ధ్రువీకరణ కోసం పాస్‌పోర్టు, డ్రైవింగ్‌ లైసెన్స్, ఆధార్, రేషన్‌కార్డు, ప్రభుత్వ గుర్తింపు కార్డులు, బ్యాంకు పాసుపుస్తకాలు, రైతు గుర్తింపు కార్డు, పాన్‌కార్డు, రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం జారీ చేసిన స్మార్ట్‌కార్డు, తాజాగా తీసుకున్న నల్లా, టెలిఫోన్, గ్యాస్‌ కనెక్షన్‌ బిల్లుల్లో ఏదో ఒక పత్రాన్ని బీఎల్‌ఓలకు అందజేయాలని సూచించారు. ఓటర్లు www.nvsp.in లేదా www.ceotelangana.nic.in లలో తమ రుజువులకు సంబంధించిన పత్రాలను అప్‌లోడ్‌ చేసి ఓటు హక్కును నిర్ధారించుకోవచ్చన్నారు.  

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా