-

ఓటర్లు ప్రలోభాలకు గురికావొద్దు  

20 Nov, 2018 17:01 IST|Sakshi
కాశీంనగర్‌ ఓటరు సంతకాల సేకరణలో కలెక్టర్‌ శ్వేతామహంతి  

నిజాయితీగా ఓటు హక్కు  వినియోగించుకోవాలి  

సంతకాల సేకరణలో కలెక్టర్‌ శ్వేతామహంతి  

సాక్షి,వనపర్తి క్రైం: ఓటర్లు ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా, నిజాయితీగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కలెక్టర్‌ శ్వేతామహంతి అన్నారు. ఓటరు అవగాహన కార్యక్రమంలో భాగంగా సోమవారం వనపర్తి మండలం కాశీంనగర్‌ గ్రామంలో నిర్వహించిన సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆమె ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. డిసెంబర్‌ 7న జరిగే పోలింగ్‌లో జిల్లాలోని ఓటర్లందరూ స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలిపారు. డబ్బు, మద్యానికి ఓటును అమ్మకోకుండా నిజాయితీగా వేయాలని చెప్పారు.
ఓటు వేసే ముందు విజ్ఞతతో ఆలోచించి గ్రామాభివృద్ధికి, తద్వారా రాష్ట్ర, దేశాభివృద్ధికి పాటుపడేవారికి ఓటు వేయాలని అన్నారు.  ఈ ఎన్నికల్లో దివ్యాంగ ఓటర్లకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. వారిని తీసుకెళ్లేందుకు రవాణా సదుపాయం, పోలింగ్‌ కేంద్రాల వద్ద మూడు చక్రాల సైకిల్, సహాయకులు ఉంటారని, తాగునీరు ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. దివ్యాంగులు, గర్భిణులు, వృద్ధులు, బాలింతలు తదితరుల కోసం ప్రత్యేకించి క్యూ లైన్లు ఏర్పాటు చేస్తామని, ప్రతిఒక్కరూ ఓటు హక్కును సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం తెలంగాణ సాంస్కృతిక సారథి కళాబృందం తమ ప్రదర్శన ద్వారా ఓటు విలువ తెలుసుకో..ఓటు హక్కు వినియోగించుకో అనే నృత్య రూపాన్ని ప్రదర్శించారు. కార్యక్రమంలో డీపీఆర్‌ఓ వెంకటేశ్వర్లు, ఎంపీడీఓ అప్జల్, డిప్యూటీ తహసీల్దార్‌ కొండన్న తదితరులు ఉన్నారు.

మరిన్ని వార్తలు