విచిత్రం: ‘ఆత్మ’లకు ఓటు!

10 Feb, 2020 12:46 IST|Sakshi
పాపిరెడ్డిగూడలో మృతి చెందిన తన తండ్రి రామకృష్ణారెడ్డి ఫొటోను చూపిస్తున్న కొడుకు

సాక్షి, షాద్‌నగర్‌ : సహకార సంఘాల ఓటరు జాబితాలో అధికారులు మృతిచెందిన వారికి కూడా చోటు కల్పించారు. సంఘంలో సభ్యులై ఉండి చనిపోయిన రైతుల పేర్లను జాబితాలో నుంచి తొలగించలేదు. షాద్‌నగర్‌ నియోజకవర్గం పరిధిలో మేకగూడ, నందిగామ, చేగూరు, కొత్తపేట, షాద్‌నగర్, కొందుర్గులో వ్యవసాయ సహకార సంఘాలు ఉన్నాయి. ఈ సంఘాల్లో మొత్తం 16740 మంది ఓటర్లు ఉన్నారు.

అధికారులు ఈసారి ఫొటోలతో కూడిన ఓటరు జాబితాలను తయారు చేశారు. ఈ జాబితాలో చాలా మంది ఫొటోలు కనిపించడం లేదు. అదేవిధంగా చనిపోయిన ఓటర్ల పేర్లు కూడా జాబితాలో ఉన్నాయి. ఒక్కో వార్డులో సుమారు పది నుంచి ఇరవై మంది మృతుల పేర్లు జాబితాలో కనిపిస్తున్నాయి. అయితే, ఓటరు జాబితాలో ఉన్న మృతులకు సంబంధించిన రుణాలను వారి కుటుంబ సభ్యులు చెల్లిస్తే జాబితాలో నుంచి పేర్లు తొలిగిపోతాయని, ప్రభుత్వం రుణమాఫీ చేస్తుందనే ఆశతో రుణాలు చెల్లించకుండా ఉండటంతో ఈ పరిస్థితులు ఎదురవుతున్నాయని అధికారులు చెబుతున్నారు.


                      చనిపోయిన వారికి ఓటు హక్కు ఉన్న దృశ్యం

ముందస్తు చర్యలేవీ.. 
ముందుగా ఓటర్ల జాబితాను రూపొందించి సహకార సంఘం కార్యాలయంలో ప్రదర్శించి అభ్యంతరాలను స్వీకరించాల్సి ఉంటుంది. అభ్యంతరాలను పరిష్కరించి తుది జాబితాను తయారు చేయాల్సి ఉంటుంది. అలా చేయకుండానే ఎన్నికలు నిర్వహిస్తుండటంతో పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తప్పుల తడకగా ఉన్న ఓటర్ల జాబితాతో ఎన్నికలు ఎలా నిర్వహిస్తారని పలువురు ప్రశ్నిస్తున్నారు.

కొందరి ఓటర్ల ఫొటోలు లేకపోవడంతో ఓటర్లను గుర్తించడం ఇబ్బందిగా మారిందని నాయకులు అంటున్నారు. గ్రామాల్లో తిరిగి విచారణ చేశాం. సహకార ఎన్నికలకు సంబంధించిన ఓటరు జాబితా తయారు చేసేటప్పుడు గ్రామాల్లో పర్యటించి ఓటర్లను గుర్తించాం. చనిపోయిన వారి వివరాలు మాకు తెలియలేదు. దీంతో ఓటరు జాబితాలో పేర్లు తొలగించలేకపోయాం.    
– మహ్మద్‌ షరీఫ్, సీఈఓ, కొందుర్గు సహకార సంఘం  

మరిన్ని వార్తలు