‘ఓటు’ కోసం కోటి ప్రయత్నాలు

11 Apr, 2019 10:35 IST|Sakshi

సాక్షి, జనగామ: లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల నాటి నుంచి ప్రచార పర్వం ముగిసే వరకు అంతా సప్పగా సాగిపోయింది. ఒకటి రెండు సార్లు ర్యాలీ లు... తూతూ మంత్రంగా ఇంటింటి ప్రచారాలతో మమ అనిపించేశారు. మంగళవారం సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగియడంతో.. జనగామ నియోజకవర్గంలో అంతా గప్‌చుప్‌గా మారిపోయింది. గుట్టుగా ఇంటింటికి వెళ్తూ.. ఓటు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. అసెంబ్లీ...పంచాయతీ ఎన్నికల్లో ఏరులై పారిన మద్యం.. నగదుతో హుషారెత్తిన గ్రామాలు.. ఎంపీ ఎలక్షన్లు వచ్చే సరికి సైలెంట్‌గా మారిపోయింది.

ఆయా రాజకీయ పార్టీలు బూత్‌ల వారీగా కష్టపడే వారికి రోజు వారి ఖర్చులు మినహా... ఓటర్లకు ఎలాంటి నజరాన లేకపోవడంతో ప్రచారంలో మజా లేకుండా పోయింది. దీంతో గ్రామ స్థాయిలో పలుకుబడిన నాయకులు.. సొంత ఖర్చులతో ఖుషీచేసే ప్రయత్నాలు చేశారు.  భయ్యా.. గెలిచిన తర్వాత.. మస్తు దావత్‌ ఉంటది.. ఏమనుకోకు.. అంటూ బుజ్జగించారు. మందు తక్కువైతేనేమీ.. డబ్బులు ఇవ్వండి.. అంటూ మెలికి పెట్టడంతో... ఒక్కపైసా రావడం లేదు.. సొంత ఖర్చులతో దావత్‌ ఇచ్చాను అంటూ బతిమిలాడుకునే పరిస్థితి ఎదురవుతోంది.  

తమ్మి... (కార్యకర్త) ఓటర్లను బాగా చూసుకోండి.. పల్లెత్తు మాట అనొద్దు.. నేడు ఓట్ల పండగ పూర్తయి.. గెలుపొందగానే మస్తు పార్టీ చేసుకోండి... పైసలు నేనిస్తా అంటూ అధిష్టానం నుంచి సంకేతాలు వచ్చినా... నమ్మడం లేదనే ప్రచారం జరుగుతుంది.  

డబ్బు పంచకున్నా...
లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో నగదు.. మద్యం పంపిణీ పెద్దగా లేకున్నా.. ఈసీ మాత్రం గట్టి నిఘా వేసింది. జిల్లా వ్యాప్తంగా జనగామ, స్టేషన్‌ఘన్‌పూర్, పాలకుర్తి నియోజకవర్గాల్లో మూడో కన్నుతో పర్యవేక్షించారు. జిల్లాలో ఇప్పటి వరకు రూ.45.28లక్షలు పట్టుబడగా..రూ.8.50లక్షల విలువ చేసే 1378.430 లీటర్ల మద్యం, 2017.50 లీటర్ల గుడుంబాను స్వాదీనం చేసుకున్నారు.     

మరిన్ని వార్తలు