దరఖాస్తుల వెల్లువ

25 Jan, 2019 08:44 IST|Sakshi

ఆదిలాబాద్‌అర్బన్‌: రాబోయే సార్వత్రిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు జిల్లాలో చేపట్టిన ఓటరు నమోదు కార్యక్రమం శుక్రవారంతో ముగియనుంది. గత నెల రోజుల నుంచి కొనసాగుతున్న ఈ సవరణ ప్రక్రియకు భారీగా స్పందన లభించింది. గతేడాదిలో మూడు సార్లు ఓటరు నమోదు చేపట్టినా రానంతగా స్పందన ఈసారి వచ్చింది. అయినా గ్రామాల్లో పూర్తి స్థాయిలో అర్హులైన యువత నమోదుకు ముందుకు రాలేదని తెలుస్తోంది. ఓటు నమోదుపై అవగాహనలు, చైతన్య ర్యాలీలు, ప్రత్యేక నమోదులు, సదస్సులు పట్టణంలో మినహా గ్రామాల్లో కన్పించకపోవడంతో అర్హత గల వారు ఓటుకు దూరంగా ఉన్నారని సమాచారం. అలాంటి వారికి నమోదు గురించి తెలియపరిస్తే ఏ కొంత లక్ష్యాన్ని అయినా అందుకోవచ్చు. ఇదిలా ఉండగా, జిల్లాలో డిసెంబర్‌ 26 నుంచి ఓటరు నమోదు ప్రక్రియను చేపట్టగా ఇప్పటి వరకు 32,167 దరఖాస్తులు వచ్చాయి. ఈసీ షెడ్యూల్‌ ప్రకారం వచ్చిన దరఖాస్తులను ఫిబ్రవరి 11లోగా పరిశీలన చేసి తుది జాబితాను రూపొందిస్తారు. అనంతరం ఫిబ్రవరి 22న జాబితాను విడుదల చేస్తారు.
 
జిల్లాలో 32,167 దరఖాస్తులు 
జిల్లాలో నెల రోజులుగా కొనసాగుతున్న ఓటరు నమోదు కార్యక్రమంలో భాగంగా అధికారులు అభ్యంతరాలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. ఈసారి చేపట్టిన నమోదుకు ఏకంగా 32,167 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 13,706 దరఖాస్తులు రాగా, బోథ్‌ అసెంబ్లీ పరిధి నుంచి 18,461 దరఖాస్తులు వచ్చాయి. జిల్లా వ్యాప్తంగా వచ్చిన దరఖాస్తులను ఓసారి పరిశీలిస్తే.. జాబితాలో కొత్తగా ఓటు నమోదుకు 19,506 దరఖాస్తులు రాగా, జాబితా నుంచి పేర్లు తొలగించేందుకు 828 వచ్చాయి. ప్రస్తుతం ఉన్న ఓటరు కార్డులో సవరణ చేసుకునేందుకు 452 దరఖాస్తులు రాగా, ప్రస్తుతమున్న పోలింగ్‌ కేంద్రాల మార్పులు, చేర్పులకు, చిరునామాల మార్పులకు 11,381 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులను శనివారం నుంచి పరిశీలన ప్రారంభించి వచ్చే నెల 11లోగా పూర్తి చేయనున్నారు.

నమోదుకు భారీగా స్పందన 
ఈసారి చేపట్టిన ఓటరు నమోదుకు జాబితాలో పేర్లు లేని వారు, యువత బాగా స్పందించారు. 2019 జనవరి ఒకటో తేదీ నాటికి పద్దెనిమిదేళ్లు నిండిన వారందరూ నమోదుకు అర్హులు కావడంతో జిల్లాలో ప్రక్రియ ఊపందుకుంది. కళాశాలల్లో నమోదు, పట్టణంలోని వార్డుల్లో, గ్రామాల్లో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాలు చేపట్టడంతో అర్హత గల వారు జాబితాలో పేర్లు నమోదు చేసుకున్నారు. ఒక్క అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో తప్పా.. పంచాయతీ ఎన్నికల జరుగుతున్నందున యంత్రాంగం ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టడం తప్పా ఓటు నమోదు గురించి అవగాహనలు చేపట్టిన సంఘటనలు కన్పించలేదు.

పోలింగ్‌ కేంద్రాల వారీగా నమోదుకు దరఖాస్తులు స్వీకరించడం, ఆర్డీవో, తహసీల్దార్, మున్సిపల్‌ కార్యాలయాల్లో ఫారాలు అందుబాటులో ఉండడం, ఆన్‌లైన్‌ ద్వారా వెసులుబాటు కల్పించడంతో చాలామంది నమోదుకు అభ్యర్థించడంతో ఈసారి నమోదుకు కలిసివచ్చిందని చెప్పవచ్చు. డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో భారీగా ఓట్లు గల్లంతైన విషయం తెలిసిందే. అర్హత ఉండి గల్లంతైన వారిని నమోదు చేయడంతోపాటు కలెక్టర్‌ ప్రత్యేక చొరవ తీసుకోవడం కూడా భారీ స్పందనకు కారణమైంది.

మరిన్ని వార్తలు