చలో ఆంధ్రా..

8 Apr, 2019 01:08 IST|Sakshi

హైదరాబాద్‌ నుంచి ఏపీకి ఓటర్ల పయనం 

సొంతూళ్లకు రమ్మంటూ పార్టీల ఆత్మీయ సందేశాలు 

సోషల్‌ మీడియా గ్రూపుల్లో విపరీత ప్రచారం 

ఉచిత రవాణా, ఓటుకు నోటు, భోజనం అదనం 

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో స్థిరపడ్డ ఏపీకి చెందిన వారిని ప్రసన్నం చేసుకునేందుకు పార్టీలన్నీ పోటీపడుతున్నాయి. తెలంగాణలో సెటిలైన చాలా మందికి ఏపీలోని సొంతూళ్లలోనూ ఓట్లున్నాయి. అంటే ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో వీరు ఓటు హక్కు కలిగి ఉన్నారన్నమాట. దీంతో వీరికి ఎక్కడ లేని డిమాండ్‌ పెరిగింది. వీళ్లను తమవైపు తిప్పుకునేందుకు పార్టీలు విశ్వప్రయత్నాలు చేస్తున్నాయి. ఈ నెల 11న పోలింగ్‌ ఉండటంతోపాటు శుక్రవారం సెలవు పెట్టుకుంటే, శని, ఆది సెలవు దినాలు కలసి వస్తున్నాయి. అలాగే ఏప్రిల్‌ 12 నుంచి పాఠశాలలకు కూడా సెలవులు ఇస్తున్నారు. దీంతో సెటిలర్లను సొంతూళ్లకు రప్పించేందుకు ఏపీలోని పార్టీల నాయకులు ప్రయత్నాలు చేస్తున్నారు. వారి ఫోన్లకు సందేశాలు పంపుతూ అప్రమత్తం చేస్తున్నారు. కొందరైతే స్వయంగా కలసి ఓటేసేందుకు ఊరికి రావాలని విజ్ఞప్తి చేస్తున్నారు. 

ఉచిత రవాణా, భోజనం... 
సెలవుల కారణంగా కొందరు మాత్రమే ఊరెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. మిగిలిన వారిని పార్టీలు రకరకాల తాయిలాలు ఆశజూపి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. దీని కోసం తమ ప్రాంత ఓటర్లు అధికంగా ఉండే చోట సామాజిక వర్గాలు, ఊళ్ల వారీగా వాట్సాప్‌ గ్రూపుల్లో సందేశాలు పంపుతున్నారు. ఏప్రిల్‌ 9 నుంచే ఉచితంగా తీసుకెళ్లేందుకు బస్సులు ఏర్పాటు చేశారు. ఓటేశాక తిరిగి తీసుకొచ్చే బాధ్యత కూడా వీరిదే. మరునాడే రాలేనివారికి చార్జీలు పొందే సదుపాయం అదనం. దారిలో టిఫిన్లు, భోజనం కూడా ఏర్పాటు చేస్తున్నారు. మందుబాబులకు ప్రత్యేక సదుపాయం కూడా కల్పి స్తున్నారు. ఇక అన్నింటికీ మించి ఓటుకు రూ.2000 నుంచి రూ.3000 వరకు చేతిలో పెడుతున్నారు. ఇన్ని సదుపాయాలు కల్పిస్తుండటంతో చాలామంది సొంతూళ్లకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. 

‘డబుల్‌’ఎలా వీలవుతుంది?... 
దశాబ్దాలుగా ఏపీలో, తెలంగాణలో వేర్వేరు దశల్లో పోలింగ్‌ జరుగుతూ వస్తోంది. రెండు దశల మధ్య తగినంత సమయం ఉండటంతో చాలా మంది ‘‘ఆడా ఉంటాం.. ఈడా ఉంటాం..’’అన్న ధోరణిలో ఓట్లేసేవారు. రాష్ట్ర విభజన తరువాత కూడా వీరు రెండు ప్రాంతాల్లో ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. 2014 ఎన్నికల్లోనూ ఇదే సంప్రదాయం కొనసాగించారు. పోలింగ్‌కు తగినంత సమయం ఉండటంతో ఇది సాధ్యమైంది. ఈ దఫా కూడా మరోసారి అసెంబ్లీ ఎన్నికల్లో పాల్గొనే అరుదైన అవకాశం ఉండటంతో వీరికి డిమాండ్‌ పెరిగింది.

18.5 లక్షల డబుల్‌ ఓట్లు.. 
రెండు రాష్ట్రాల్లో కలిపి దాదావు 18.5 లక్షల డబుల్‌ ఓట్లున్నాయి. అంటే ఏపీలో, తెలంగాణలో రెండు చోట్ల ఓటరు లిస్టులో వీరి పేరుంది. వీటిని బోగస్‌ ఓట్లుగా గుర్తించి కొట్టేయాలని హైకోర్టులో వ్యాజ్యం నమోదైంది. దీనికి ఏపీ ఎన్నికల సంఘం నిరాకరించింది. అవి బోగస్‌ ఓట్లు కావని, రెండు చోట్ల ఉన్నవి కాబట్టి, వాటిని డబుల్‌ ఓట్ల కింద పరిగణిస్తామని కోర్టుకు సమాధానమిచ్చింది. దీం తో వారి ఓట్ల తొలగింపు సాధ్యం కాలేదు. ఈసారి తెలంగాణలో డిసెంబర్‌లోనే శాసన సభ ఎన్నికలు ముగిశాయి. దీంతో వీరందరికి ఏపీలో రెండోసారి ఓటు వేసేందుకు అవకాశం వచ్చిందన్నమాట. 

మరిన్ని వార్తలు