ఈవీఎంలొచ్చాయ్‌!

16 Nov, 2018 13:16 IST|Sakshi

మొదటిసారి ఈవీఎంల ర్యాండమైజేషన్‌ పూర్తి 

రెండోసారి నియోజకవర్గాల్లో.. మూడోసారి పంపిణీ సెంటర్లో.. 

ఆ తర్వాత పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లనున్న సిబ్బంది 

జిల్లాకు అదనంగా 20 శాతం యంత్రాల కేటాయింపు 

ఆదిలాబాద్‌అర్బన్‌: డిసెంబర్‌లో జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేందుకు వినియోగించే యం త్రాలు సిద్ధమయ్యాయి. ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ యం త్రాలు(ఈవీఎం), ఓటర్‌ వెరిఫైడ్‌ పేపర్‌ ఆడిట్‌ ట్రయల్‌ (వీవీ ప్యాట్‌) యంత్రాలు నెలన్నర క్రితమే జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే. జిల్లా కేంద్రంలోని టీటీడీసీ స్ట్రాంగ్‌ రూములలో భద్రపర్చారు. కాగా, ఈవీఎంలపై రాజకీయ నాయకులకు ఇప్పటికీ అనుమానాలున్నా విషయం విదితమే. ఆ అనుమానాలను నివృత్తి చేసేందుకు యంత్రాల ర్యాండమైజేషన్‌(మిక్సింగ్‌) చేపడుతారు. ఇందులో భాగంగానే జిల్లాస్థాయిలో మొద టి ర్యాండమైజేషన్‌ పూర్తయింది.

ప్రస్తుతం వీటికి సీల్‌ వేసి జిల్లా కేంద్రంలోని స్ట్రాంగ్‌ రూమ్‌లలో ఉన్న వీటిని అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా సరఫరా చేయనున్నారు. కాగా, జిల్లాకు వచ్చిన బేల్‌ కంపెనీకి చెందిన ఈవీఎంలు, బ్యాలెట్‌ యూని ట్లు, కంట్రోల్‌ యూనిట్లు, వీవీ ప్యాట్‌లను గోదా ముల్లోనే ఉంచి రాజకీయ పార్టీల సమక్షంలో పరి శీలన చేశారు. కాగా, ఎవరైనా గోదాములోకి వెళ్లాలనుకున్నా.. ఈవీఎంలను పరిశీలించాలనుకున్నా.. తప్పకుండా గుర్తింపు కార్డుతో పాస్‌ తీసుకొని గోదాముల్లోకి వెళ్లేలా కలెక్టర్‌ దివ్యదేవరాజన్‌ ఆదేశాలు జారీ చేశారు. ఈవీఎంలను గట్టి బందోబస్తుతో భద్రపర్చారు. 

ర్యాండమైజేషన్‌ ఇలా.. 
ఓటింగ్‌ యంత్రాలగు సంబంధించి ఆన్‌లైన్‌లో నంబర్లను అన్నింటికీ ర్యాండమైజేషన్‌ చేశారు. ఒక బ్యాలెట్‌ యూనిట్, కంట్రోల్‌ యూనిట్‌కు ఆన్‌లైన్‌ ద్వారా నంబర్లు కేటాయించి మిక్సింగ్‌ చేశారు. ఇలా ర్యాండమైజేషన్‌ చేయడం ద్వారా ఒక బాక్సులో మనం చూసిన బ్యాలెట్‌ లేదా కంట్రోల్‌ యూనిట్‌ వేరే బాక్సులు మార్చుతారు. ఎవరైనా బ్యాలెట్‌ యూనిట్, కంట్రోల్‌ యూనిట్‌ గుర్తుంచుకున్నా.. ర్యాండమైజేషన్‌ తర్వాత అది ఏ బాక్సులో ఉందో గుర్తు పట్టకుండా ఉంటుంది. ర్యాండమైజేషన్‌ ద్వారా సీయూ, బీయూలను వేరే బాక్సులోకి మార్చారు. ఒక్కో బాక్సులో పది ఓటింగ్‌ యంత్రాలు ఉంటాయి.. అందులో ఏ నియోజకవర్గానికి సంబంధించిన యంత్రం ఉం దో ఎవరికీ తెలియదు. ఆ విధంగా జిల్లా స్థాయిలో మొదటి ర్యాండమైజేషన్‌ను పూర్తి చేశారు. ఆయా బాక్సులో ఉన్న వాటికి బార్‌కోడ్‌ ఆధారంగా ఆయా నియోజకవర్గాలకు కేటాయిస్తారు. అనంతరం ఆయా అసెంబ్లీ సెగ్మెంట్లలోని స్ట్రాంగ్‌రూముల్లో భద్రపరుస్తారు. నియోజకవర్గ స్థాయిలో అక్కడ కూడా ర్యాండమైజేషన్‌ చేయాల్సి ఉంటుంది.

అక్కడ రెండో విడత ర్యాండమైజేషన్‌ చేస్తారు. దీంతో పోలింగ్‌ సిబ్బంది ఏ యంత్రం వస్తుందో తెలియదు. ఆ విధంగా అధి కారులు ఆన్‌లైన్‌ బార్‌కోడ్‌ ఆధారంగా రాజకీయ పార్టీల ముందే మిక్సింగ్‌ చేస్తారు. పోలింగ్‌కు ఒక్క రోజు ముందు పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్లేందుకు అందుబాటులో ఉన్న పంపిణీ కేంద్రాల్లో మూడో విడత ర్యాండమైజేషన్‌ చేసి ఏ పోలింగ్‌ బూత్‌కు ఏ ఈవీఎం, బ్యాలెట్, కంట్రోల్, వీవీప్యాట్‌ యంత్రం వెళ్లాల్సి ఉందో ఆయా పోలింగ్‌ బూత్‌లకు కేటాయించిన ప్రిసైడింగ్, సహాయ ప్రిసైడింగ్, పోలింగ్‌ అధికారులకు అందజేస్తారు. అక్కడి నుంచి నేరుగా ఎన్నికల విధులలో భాగంగా పోలింగ్‌ కేంద్రాలకు తీసుకెళ్తారు. 

ఆదిలాబాద్‌కు 295,బోథ్‌కు 296 యంత్రాలు.. 
జిల్లా స్థాయిలో జరిగిన ఈవీఎంల మొదటి ర్యాండమైజేషన్‌ తర్వాత నియోజకవర్గాల వారీగా ఓటింగ్‌ యంత్రాలను సిద్ధం చేశారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో 261 పోలింగ్‌ కేంద్రాలు 295 కంట్రోల్‌ యూనిట్లు, 295 బ్యాలెట్‌ యూనిట్లు, 295 వీవీ ప్యాట్లను కేటాయించారు. బోథ్‌ నియోజకవర్గంలో 257 పోలింగ్‌ కేంద్రాలు ఉండగా, 296 బ్యాలెట్‌ యూనిట్లు, 296 కంట్రోల్‌ యూ నిట్లు, 296 వీవీ ప్యాంట్‌ యంత్రాలను కేటాయిం చారు. కాగా, జిల్లాలో గ్రామీణ ప్రాంతాల్లోనే ఎక్కువగా పోలింగ్‌ కేంద్రాలు ఉండడంతో రిజర్వులో కొన్ని ఓటింగ్‌ యంత్రాలను ఉంచినట్లు అధికారులు పేర్కొంటున్నారు. 

20 శాతం అదనం.. 
జిల్లాలో 518 పోలింగ్‌ కేంద్రాలు ఉన్నాయి. వీటన్నింటీకి సరిపోను జిల్లాకు మరో 20 శాతం ఓటింగ్‌ యంత్రాలు అదనంగా వచ్చాయని జిల్లా ఎన్నికల విభాగం అధికారులు పేర్కొంటున్నారు. పోలింగ్‌ బూత్‌లను బట్టి రిజర్వులో ఉంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వీటిని ఆ యా రిటర్నింగ్‌ అధికారి కార్యాలయాల్లో అందుబాటులో ఉంచనున్నారు. పోలింగ్‌ సమయంలో ఎక్కడైనా సాంకేతిక లోపం తలెత్తి ఓటింగ్‌కు అంతరాయం ఏర్పడితే వీటిని వినియోగించనున్నారు.     

మరిన్ని వార్తలు