ఓటింగ్‌ శాతం ‘పెరిగేనా’..! 

4 Apr, 2019 14:34 IST|Sakshi

వలస ఓటర్లపై దృష్టి పెట్టని పార్టీలు 

ఓటింగ్‌పై వరుస సెలవుల ప్రభావం పడనుందా       

సాక్షి, అడ్డాకుల: ఈసారి గ్రామాల్లో పెద్దగా ఎన్నికల సందడి కనిపించడం లేదు. గత శాసనసభ, సర్పంచ్‌ ఎన్నికల్లో పదిహేను రోజుల పాటు గ్రామాల్లో హడావుడి కనిపించింది. పార్లమెంట్‌ ఎన్నికల వేళ గ్రామాల్లో సందడి కరువైంది. వేసవికాలం ఎండల ప్రభావమో...వరుస ఎన్నికల ప్రభావమో కాని గ్రామాల్లో స్తబ్ధత కనిపిస్తోంది. పోలింగ్‌కు ఇంకా వారం రోజులే ఉంది. నియోజకవర్గంలో ఇంకా పార్టీల నేతలు ఇంటింటి ప్రచారం మొదలు పెట్టలేదు. ఒకటి రెండు గ్రామాల్లో మినహా ఎక్కడ డోర్‌ టూ డోర్‌ ప్రచారం మొదలైంది లేదు. పార్లమెంట్‌ ఎన్నికలపై గ్రామాల్లో నేతలు పెద్ద ఆసక్తి కనబర్చడం లేదని తెలుస్తోంది.  

జిల్లాలో దేవరకద్రనే టాప్‌..! 
నియోజకవర్గంలో 2018 డిసెంబర్‌ 7న జరిగిన శాసనసభ ఎన్నికల్లో అనూహ్యంగా ఓటింగ్‌ శాతం భారీగా పెరిగింది. 2014 శాసనసభ ఎన్నికలతో పోలిస్తే 13శాతం ఎక్కువ ఓటింగ్‌ నమోదైంది. 2014లో 71.67శాతం పోలింగ్‌ నమోదైతే 2018లో 84.6శాతం పోలింగ్‌ నమోదైంది. ఎమ్మెల్యే ఎన్నికలప్పుడు ప్రధాన పార్టీలు ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్లపై ప్రత్యేక దృష్టి పెట్టాయి. హైదరాబాద్‌లో ఒకటి, రెండు సార్లు అక్కడున్న ఓటర్లతో ‘ఆత్మీయ’ సమావేశాలు ఏర్పాటు చేశాయి. వలస ఓటర్లు ఊర్లకు వచ్చి ఓటు వేసి వెళ్లేలా నేతలు ఏర్పాట్లు చేశారు. ఈక్రమంలోనే ఇతర ప్రాంతాల్లో ఉండే ఓటర్లు భారీగా తరలివచ్చి ఓటింగ్‌లో పాల్గొనడంతో జిల్లాలోనే రికార్డు స్థాయిలో దేవరకద్ర నియోజకవర్గంలో పోలింగ్‌ నమోదైంది. 

శాసనసభ ఎన్నికలు ముగిసిన తర్వాత 2019 జనవరి 30న సర్పంచ్‌ ఎన్నికలను నిర్వహించారు. అప్పుడు కూడా పోలింగ్‌ శాతం పెరిగింది. అడ్డాకుల మండలంలో 88శాతం పోలింగ్‌ నమోదైంది. శాసనసభ ఎన్నికల కంటే కొంత ఎక్కువ శాతం పోలింగ్‌ నమోదైంది. సర్పంచ్‌ అభ్యర్థులు శక్తి మేర ప్రయత్నం చేసి ఓటింగ్‌ శాతం పెంచారు. 

పార్లమెంట్‌ ఎన్నికలు ఈనెల 11న జరుగనున్నాయి. దీంతో 11న సెలవు రోజైతే 12వ తేదీ మినహా 13న రెండో శనివారం, 14న ఆదివారం కావడంతో వరుస సెలవులు వచ్చాయి. అందులోనూ పాఠశాలలకు వేసవి సెలవులు తోడు కావడంతో వలస ఓటర్లే కాకుండా గ్రామాల్లో ఉండే ఓటర్లు కూడా ఓటింగ్‌లో పాల్గొంటారా లేదా అన్నది పార్టీల నేతలను కలవర పెడుతోంది. ఎంపీ ఎన్నికల తర్వాత ఎంపీపీ, జెడ్పీటీసీ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో వలస ఓటర్లను అప్పుడు గ్రామాలకు రప్పించుకోవచ్చన్న అభిప్రాయాన్ని నేతలు వ్యక్తం చేస్తున్నారు.     

మరిన్ని వార్తలు