విసిగి.. వేసారి.. వీఆర్‌ఏ ఆత్మహత్య

26 Jul, 2019 07:02 IST|Sakshi

ఉద్యోగం కోసం ఎనిమిదేళ్లు..

వేతనం కోసం మూడేళ్లు.. 

మంథని: వారసత్వం కింద రావాల్సిన ఉద్యోగం కోసం ఎనిమిదేళ్లు.. వేతనం కోసం మూడేళ్లు తిరిగినా ఫలితం లేకపోవడంతో మనస్తాపం చెందిన ఓ వీఆర్‌ఏ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ సంఘటన గురువారం పెద్దపల్లి జిల్లా మంథని మండలం ఎక్లాస్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఎక్లాస్‌పూర్‌ గ్రామానికి చెందిన గువ్వల రామక్క వారసత్వంగా వీఆర్‌ఏ ఉద్యోగాన్ని ఆమె మనువడు గువ్వల మహేందర్‌ (27)కు కేటాయిస్తూ మూడేళ్ల క్రితం అప్పటి తహసీల్దార్‌ ప్రొసీడింగ్‌ జారీ చేశారు. అప్పటి నుంచి మహేందర్‌ మంథ ని తహసీల్దార్‌ కార్యాలయం పరిధిలో పనిచేస్తున్నాడు. ఈ ఉద్యోగం కోసం అతను ఎనిమిదేళ్లు కాళ్లరిగేలా తిరిగి సాధించాడు. వేతనం కోసం మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా ఇవ్వకపోవడంతో ఓసారి పురుగుల మందు డబ్బాతో కార్యాలయం ఎదుట ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. జీవనం కోసం అప్పులు చేశాడు. మూడేళ్లుగా అధికారులు ఎటూ తేల్చకపోవడం.. రుణదాతల ఒత్తిడి ఎక్కువై ఆత్మహత్య చేసుకున్నాడు. 

మరిన్ని వార్తలు