వీఆర్వో కాలర్‌ పట్టుకున్న మహిళ, మెట్లపై నుంచి..

30 Aug, 2019 14:28 IST|Sakshi

భూ మార్పిడి విషయంలో ఇరువురి మధ్య ఘర్షణ

స్పృహ తప్పి పడిపోయిన మహిళ

సాక్షి, సంగారెడ్డి: భూ పట్టా మార్పిడి విషయంలో ఓ మహిళ వీఆర్వో చొక్కా కాలర్‌ పట్టుకోవడంతో ఇరువురి మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ గొడవలో సదరు మహిళ తలకు గాయమై స్పృహ తప్పి పడిపోయిన ఘటన సంగారెడి జిల్లాలోని వట్‌పల్లి తహసీల్దార్‌ కార్యాలయం వద్ద గురువారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని మేడికుందా గ్రామానికి చెందిన ఖాదిరాబాద్‌ బీర్‌గొండ అనే రైతుకు సంబంధించిన రెండెకరాల 34 గుంటల భూమిని వారి ముగ్గురు కుమారులు తమ పేర్ల మీద పట్టా చేయించుకున్నారు.

దీంతో బీర్‌గొండ మూడో భార్య అయిన పోచమ్మ తన భర్తకు సంబంధించిన భూమిని తనకు తెలియకుండా కుమారుల పేరుపై పట్టా ఎలా చేస్తారంటూ వీఆర్వో రామలింగాన్ని ప్రశ్నించింది. తన పేర కొంత భూమిని పట్టా చేయాలని కొన్ని రోజులుగా ఆయనను కోరుతోంది. ఈ క్రమంలో పోచమ్మ గురువారం తహసీల్దారు కార్యాలయం వద్దకు చేరుకొని నువ్వు అడిగినన్ని డబ్బులు ముట్టజెప్పి కాళ్లరిగేలా తిరిగుతున్నా నన్ను పట్టించుకోవా అంటూ వీఆర్వోను నిలదీసింది. వీఆర్వో చొక్కా కాలర్‌ పట్టుకొని కార్యాలయం వరకు లాక్కొని వచ్చింది. ఈ ఘర్షణలో కార్యాలయం మెట్లపై నుంచి మహిళ కింద పడటంతో తలకు గాయమై స్పృహ తప్పి పడిపోయింది.

మరిన్ని వార్తలు