కూలీలకు నిలిచిన వేతనాలు

15 Nov, 2014 03:56 IST|Sakshi

మంచిర్యాల రూరల్ : జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పని చేస్తున్న కూలీలకు నాలుగు నెలలుగా వేతనాలు అందడం లేదు. కోత లేకుండా చెల్లించేందుకు యాక్సిస్ బ్యాంక్ ద్వారా సీఎస్పీ వ్యవస్థను ఈ ఏడాది జనవరిలో ప్రవేశపెట్టగా వీరు గ్రామాల్లోనే ప్రతీనెల వేతనాలు చెల్లించేలా కూలీల వేలిముద్రలు, ఐరిస్‌లు సేకరించారు. ఈజీఎస్ నుంచి యాక్సిస్ బ్యాంక్‌కు కూలీల వేతనాల డబ్బులు జమచేసినా నెలల తరబడి బ్యాంక్ అధికారులు గానీ, సీఎస్పీలు గానీ చెల్లించకుండా తాత్సారం చేస్తూ వచ్చారు.

 కుంటి సాకులతో జాప్యం..
 బయోమెట్రిక్ విధానం ద్వారా చేపట్టే చెల్లింపుల్లో వేలిముద్రలు సరిగా లేవని, ఆధార్‌తో అనుసంధానం కాలేదని ఇలా రకరకాల కారణాలతో చెల్లింపుల్లో జాప్యం చేస్తూ వచ్చారు. 14 రోజులకోసారి చేపట్టాల్సిన చెల్లింపులు నెలల తరబడి పెండింగ్‌లో ఉండడంతో డ్వామా పీడీ గణేశ్‌జాదవ్ గ్రామీణాభివృద్ధి శాఖకు వేతనాల చెల్లింపులో యాక్సిస్ బ్యాంక్ విఫలమైనట్లు లేఖ రాశారు. కూలీలు చాలా ఇబ్బందులు పడుతున్నారని, పనులు నిలిచిపోతున్నాయని వెంటనే తగు చర్యలు తీసుకోవాలని ఆయన లేఖ రాయడంతో గత నెలలో యాక్సిస్ బ్యాంక్ ద్వారా ఈజీఎస్ చెల్లింపులను ప్రభుత్వం రద్దు చేసింది.

అప్పటికే యాక్సిస్ బ్యాంక్‌కు జమచేసిన కూలీల వేతనాలను బ్యాంక్ వారు తిరిగి గ్రామీణాభివృద్ధి శాఖకు అప్పగించారు. నగదు చెల్లింపులను నేరుగా చెల్లించే వీలు లేకపోవడంతో, కూలీల ఖాతాల్లోకి వారి వేతనాలను ఆన్‌లైన్ ద్వారా జమ చేయాలని కూలీల వ్యక్తిగత బ్యాంక్ ఖాతాలు సేకరిస్తున్నారు. అయితే చాలా మంది కూలీలకు బ్యాంక్ ఖాతాలు లేకపోవడంతో, ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన జన్ ధన్ యోజన పథకం ద్వారా జీరో బ్యాలెన్స్ ఖాతాలను కూలీలతో తెరిపిస్తున్నారు. కూలీల ఖాతాలు తెరిచి, వాటిని ఆన్‌లైన్ ద్వారా నమోదు పూర్తి చేస్తేనే కూలీలకు వేతనాలు అందే అవకాశం ఉంది. ఈ ప్రక్రియ పూర్తయ్యేందుకు మరో పదిహేను రోజుల సమయం పట్టనుండడంతో ఈ నెలలోనైనా వేతనాలు అందుతాయో లేదోనని కూలీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

 ఇక బయోమెట్రిక్ చెల్లింపులు లేనట్లే..
 ఉపాధిహామీ కూలీలకు చెల్లించే వేతనాల్లో ఎలాంటి అవినీతి ఉండొద్దని, ఈ ఏడాది జనవరి నుంచి జిల్లాలోని 18 మండలాల్లో యాక్సిస్ బ్యాంక్, 34 మండలాల్లో పోస్టాఫీసు ల ద్వారా చెల్లింపులు చేస్తున్నారు. వీరు గ్రామాల్లోని కూలీలకు వేతనాలు చెల్లించేందుకు సీఎస్పీలను నియమించి బయోమెట్రిక్ ద్వారా వేతనాలు కూలీలకు నేరుగా వేతనాలను అందించేవారు. పోస్టాఫీస్ ద్వారా 34 మండలాల్లో అందిస్తున్న వేతనాల్లో ఇబ్బందులు లేకున్నా, యాక్సిస్ బ్యాంక్ నుంచి ప్రతీ నెలా కూలీలకు వేతనాలు అందడంలో తీవ్ర జాప్యం జరుగుతూ వచ్చింది.

ప్రతీరోజు చెల్లింపుల వివరాలను డ్వామా అధికారులకు అందించకపోవడంతో, ఎంత మంది కూలీలకు వేతనాలు అందాయో? ఎన్ని పెండింగులో ఉన్నాయనే విషయంలో అధికారులకు స్పష్టత లేకుండా పోయింది. నిత్యం ఈజీఎస్ కార్యాలయాలకు కూలీలు చేరుకుని ధర్నా చేయడం, ఆందోళనతో సిబ్బందిని నిర్భందించడం లాంటి ఆందోళనలు చేపట్టారు. 18 మండలాల్లో యాక్సిస్ బ్యాంక్‌తో ఉన్న ఒప్పందాన్ని డ్వామా అధికారులు రద్దు చేసుకున్నారు.

 దీంతో 2.26 లక్షల మంది కూలీలు రూ. 4.34 కోట్ల రూపాయల వేతనాల కోసం ఎదురుచూస్తున్నారు. కూలీల వేతనాలను నేరుగా వారి బ్యాంక్ ఖాతాలో జమచేసేందుకు, కూలీల వ్యక్తిగత బ్యాంకు ఖాతాల నంబర్లను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు. దీంతో ఇన్నాళ్లు కూలీలను ఇబ్బందులకు గురిచేసిన బయోమెట్రిక్ ద్వారా కూలీల చెల్లింపులు నిలిచిపోవడంతో వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

>
మరిన్ని వార్తలు