ఎన్నాళ్లు!

11 Aug, 2015 01:46 IST|Sakshi
ఎన్నాళ్లు!

పడకేసిన పారిశ్రామిక ప్రగతి
అడుగు ముందుకు పడని వ్యాగన్ వర్క్‌షాప్
{పారంభంకాని ఐటీ      ఇంక్యూబేషన్ కేంద్రం
నివేదికల దశలో మగ్గుతున్న టెక్స్‌టైల్ పార్క్
కారుచీకట్లో వరంగల్ పారిశ్రామిక కారిడార్

 
హన్మకొండ : జిల్లాలో పారిశ్రామిక ప్రగతి పడకేసింది. ఏళ్లు గడుస్తున్నా కొత్త పరిశ్రమలు రాక జిల్లాలోని యువతకు ఉపాధి కరువైంది. వ్యాగన్ వర్క్‌షాప్, టెక్స్‌టైల్స్ పార్క్, ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్ అంటూ నాయకులు పేర్లు వల్లించడం మినహా పురోగతి కనిపించడం లేదు.కొత్త పరిశ్రమలు కరువై హైదరాబాద్-వరంగల్ ఇండస్ట్రీయల్ కారిడార్ కారు చీకట్లో మగ్గుతోంది.
 
ముందుపడని వర్‌‌కషాప్

 కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపడుతున్న వ్యాగన్ వర్క్‌షాప్ ఒక్క అడుగూ ముందుకు పడటం లేదు. మడికొండ సమీపంలోని అయోధ్యపురంలో మెట్టురామలింగేశ్వరస్వామి దేవస్థానానికి  చెందిన 54 ఎకరాల భూమిని పరిశ్రమ స్థాపనకు అనువైనదిగా ఎంపిక చేశారు. ఈ స్థలాన్ని దేవాదాయశాఖ నుంచి రవాణాశాఖకు బదలాయించడానికే నాలుగేళ్లు పట్టింది.

ఆర్నెళ్ల కిందట భూసేరణకు నిధులు మంజూరయ్యాయి. ఇక సర్వం సిద్ధం వ్యాగన్ పరిశ్రమ నెలకొల్పడమే ఆలస్యం అన్నట్లుగా ప్రభుత్వాధినేతలు, రెవెన్యూ యంత్రాంగం హడావుడి చేసింది. వ్యాగన్ పరిశ్రమకు కేటాయించిన స్థలంలో ఉన్న ఇళ్లను కూల్చివేశారు. సంబంధింత పొలాల్లో కౌలు చేస్తున్న రైతులను వ్యవసాయానికి దూరం పెట్టారు. ఆర్నెళ్లు గడిచినా పురోగతి లేదు. ప్రాజెక్టు పనులు త్వరిగతగిన చేపట్టేందుకు అవసరమైన చర్యలు తీసుకోవడంలో జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చొరవ చూపించడం లేదు. అనూహ్యంగా మారిన రాజకీయ సమీకరణాల వల్ల వరంగల్ నుంచి పార్లమెంటులో ప్రాతినిధ్యం లేకుండా పోయింది. దీనితో రైల్వేశాఖపై ఒత్తిడి లేదు.
 
కానరాని కమిటీ
 వస్త్ర పరిశ్రమకు వరంగల్‌ను హాబ్‌గా తయారు చేస్తామంటూ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వయంగా 2015 జనవరిలో హామీ ఇచ్చారు. టెక్స్‌టైల్ పార్క్, అనుబంధ పరిశ్రమలు వీటికి సంబంధించిన టౌన్‌షిప్ తదితర నిర్మాణాల కోసం ఒకే చోట 2 వేల ఎకరాల స్థలం అన్వేషించాల్సిందిగా జిల్లా యంత్రాంగాన్ని ఆదేశించారు. అంతేకాకుండా దేశంలో వస్త్ర పరిశ్రమకు కేంద్రాలుగా విరాజిల్లుతున్న సోలాపూర్, సూరత్, తిర్పూర్‌లలో పర్యటించేందుకు ప్రస్తుత డిప్యూటీ సీఎం, అప్పటి ఎంపీ కడియం శ్రీహరి నేతృత్వంలో స్థ్థానిక ప్రజాప్రతినిధులను చేర్చి కమిటీ వేశారు. వస్త్ర పరిశ్రమ తీరుతెన్నులూ, వరంగల్‌లో నెలకొల్పబోయే పరిశ్రమలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచిస్తూ 2015 జనవరి 30లోగా ఈ కమిటీ నివేదికను సమర్పించాల్సి ఉంది. ఆర్నెళ్లు గడుస్తున్నా నివేదిక సమర్పించ లేదు. మరోవైపు 2వేల ఎకరాల స్థలసేకరణ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లుగా మారింది.
 
పురుడుపోసుకోని ఇంక్యూబేషన్
 వరంగల్ నగరంలో ఐటీ పరిశ్రమలకు ఊతం ఇచ్చేందుకు 2013 మేలో రూ. 5.60 కోట్ల వ్యయంతో ఇంక్యూబేషన్ సెంటర్ నిర్మాణం ప్రారంభించారు. నేటి యువతలో క్రేజ్ ఉన్న ఐటీ పరిశ్రమ వరంగల్ నగరంలో వేళ్లూనుకునేందుకు ఈ ఇంక్యుబేషన్ సెంటర్ ఎంతగానో ఉపయోగపడుతుందంటూ అప్పట్లో ఢంకా భజాయించారు. ప్రస్తుతం మడికొండలోని పారిశ్రామిక వాడలో ఇంక్యుబేషన్ సెంటర్ భవన నిర్మాణం దాదాపు పూర్తయ్యింది. 1500 అడగుల వర్కింగ్ ప్లేస్ ఇక్కడ అందుబాటులో ఉంది. నిరంతరం విద్యుత్, ఇంటర్నెట్ కనెక్షన్ పనులు పూర్తయ్యాయి. కానీ వరంగల్‌లో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి ఉన్న ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఆకర్షించేందుకు ఇప్పటి వరకు ఎటువంటి ప్రయత్నం జరగ లేదు. అడిగేవారు కరువైపోవడంలో నిర్మాణం మొత్తం పూర్తైనా అరకొరగా మిగిలిన విద్యుత్ వైరింగ్ పనులను నెలలతరబడి చేసుకుంటూ పోతున్నారు. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం నూతన పారిశ్రామిక విధానం ప్రకటించినందున .. వరంగల్‌లో ఐటీ పరిశ్రమలు వచ్చేలా జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు చొరవ చూపించాల్సిన అవసరం ఉంది.
 

మరిన్ని వార్తలు