పదవులు వస్తాయో రావో..!

4 Sep, 2015 00:09 IST|Sakshi
పదవులు వస్తాయో రావో..!

- మార్కెట్ కమిటీ పదవుల్లో రిజర్వేషన్లతో టీఆర్‌ఎస్ ద్వితీయ శ్రేణి కార్యకర్తల్లో ఆందోళన
- జిల్లాలో 18 మార్కెట్ కమిటీలు
జోగిపేట:
మార్కెట్ కమిటీ పదవులపై ఆశలు పెట్టుకున్న  టీఆర్‌ఎస్ కార్యకర్తలకు రాష్ట్ర మంత్రి వర్గం తీసుకున్న నిర్ణయం శరాఘాతమైంది. మార్కెట్ కమిటీ పాలకవర్గాలకు రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వారి ఆందోళనక కారణమైంది.  ద్వితీయ శ్రేణి కార్యకర్తలు ఆశించేవి నియోజకవర్గ పరిధిలోకి వచ్చే మార్కెట్ కమిటీ చెర్మైన్, డెరైక్టర్ పదవులే.

ఆ పదవులకు రిజర్వేషన్ పద్ధతిలో నియామకాలు చేపడతామని సీఎం బుధవారం ప్రకటించడంతో ఆశావహుల్లో ఆందోళనకు కారణమైంది. ప్రస్తుతం తామే నియోజకవర్గంలో సీనియర్‌గా ఉన్నామని, అయితే రిజర్వేషన్ అనుకూలిస్తుందో లేదోనంటూ పలువురు కార్యకర్తలు బెంబేలెత్తుతున్నారు. గతంలో స్థానిక ఎమ్మెల్యే ఆశీస్సులుంటే మార్కెట్ పదవులు దక్కేవి. ప్రస్తుతం ఎమ్మెల్యే ఆశీస్సులు ఉన్నా రిజర్వేషన్లు అనుకూలించకపోతే ఎమ్మెల్యేలు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఉంటుందని స్థానిక నాయకులు అంటున్నారు.
 
జిల్లాలో 18 కమిటీలు

ప్రస్తుతం జిల్లాలో 18 మార్కెట్ కమిటీలున్నాయి. అయితే వీటిని లాటరీ పద్ధతిన ఎంపిక చేసే అవకాశం ఉంది.  మార్కెట్ చెర్మైన్ పదవులపై ఆశలు పెట్టుకున్న నాయకులు తమకు రిజర్వేషన్లు అనుకూలించేలా ఏం చేయాలో అనే ఆలోచనలో పడ్డారు. పదవీ కాలపరిమితిపై కేబినెట్ చర్చించలేదు. చెర్మైన్‌లకు ఏడాది పదవీకాలం పరిమితి ఉంచే అవకాశం ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. ఈ విషయమై కేబినెట్‌లో చర్చించలేదని సమాచారం. ఈ ఒక్క పదవి లేకుంటే వచ్చే నాలుగేళ్ల వరకు ఎలాంటి ఎన్నికలు లేవు కాబట్టి ఆశలన్నీ నామినేట్ పదవులపైనే పెట్టుకున్నారు.

ఇప్పటికే నియోజకవర్గాల్లో పదవులపై ఆశలు ఉన్న నాయకులంతా ఎమ్మెల్యేలను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో ఉన్నారు. అందోలు అసెంబ్లీ నియోజకవర్గంలో జోగిపేట, వట్‌పల్లి, రాయికోడ్ మార్కెట్ కమిటీలున్నాయి. ఇప్పటికే పలువురు పార్టీ నాయకులు ఈ పదవులపై ఆశలు పెట్టున్నారు. రిజర్వేషన్ల వల్ల ఎమ్మెల్యేలకు కొంత ఇబ్బందులు తప్పే అవకాశం ఉంటుంది. జోగిపేట మార్కెట్ కమిటీ పదవిని బీసీ, ఓసీ కులానికి చెందిన నాయకులు ఆశిస్తుండగా, వట్‌పల్లి మార్కెట్‌కు మైనార్టీ, ఓసీ కులానికి చెందిన నాయకులు ఆశిస్తున్నారు.

మరిన్ని వార్తలు