వాక్‌ఇన్‌ వైన్స్‌

4 Oct, 2019 12:32 IST|Sakshi

ఎక్సైజ్‌ కొత్త పాలసీలో గ్రీన్‌ సిగ్నల్‌  

సూపర్‌ మార్కెట్‌ తరహాలో ఏర్పాటు  

సాక్షి, సిటీబ్యూరో: మహానగరంలోని మద్యం ప్రియులకు ఇక సూపర్‌ కిక్‌ ఎక్కనుంది. నవంబర్‌ నుంచి సూపర్‌ మార్కెట్‌ తరహాలో వాక్‌ఇన్‌ లిక్కర్‌ షాపులు ఏర్పాటు చేసుకునేందుకు అనుమతులిస్తూ ప్రభుత్వం గురువారం విడుదల చేసిన ఎక్సైజ్‌ నోటిఫికేషన్‌లో పేర్కొంది. ఈ మేరకు ఎక్కువ విస్తీర్ణంలో ఏర్పాటయ్యే వాక్‌ఇన్‌ వైన్‌ షాపులలోకి మద్యం ప్రియులు వెళ్లి స్టోరంతా కలియ తిరిగి వారికి ఇష్టమైనబ్రాండ్లను ఎంపిక చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని ఒక్క స్పెన్సర్స్‌ మాల్‌లోనే ఈ తరహా షాపు ఉంది. కొత్త ఎక్సైజ్‌ పాలసీతో షాపింగ్‌ మాల్స్, ఇతర ప్రాంతాల్లోనూ వాక్‌ఇన్‌ వైన్స్‌ ఏర్పాటుకు చాన్స్‌ ఉంది. ఈ దుకాణాలను ఏర్పాటు చేయాలంటే లైసెన్సు ఫీజుతో పాటు స్పెషల్‌ ఎక్సైజ్‌ పన్నుకు అదనంగా మరో రూ.5 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అంటే వాక్‌ఇన్‌ దుకాణాలు ఏర్పాటు చేయాలనుకునేవారు మొత్తంగా రూ.2.30 కోట్లు ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. నగరంలో ఇప్పటికే రికార్డు స్థాయిలో మద్యం అమ్మకాలు కొనసాగుతుండగా కొత్త ఎక్సైజ్‌ పాలసీ సిటీలోని మద్యం ప్రియులకు మరింత మత్తెక్కించేలా ఉంది. 

పాత షాపులే...  
హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్‌–మల్కాజిగిరి జిల్లాల్లో ప్రస్తుతమున్న షాపులన్నింటికీ మళ్లీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. సిటీలో షాపులు తగ్గించి శివార్లలో పెంచుతారని భావించినా పాత సంఖ్యనే ఖరారు చేశారు. దీంతో పాటు మద్యం షాపుల టెండర్‌లో పాల్గొనేందుకు దరఖాస్తు రుసుమును రూ.లక్ష నుంచి రూ.2 లక్షలకు పెంచారు. ఈ నెల 9 నుంచి దరఖాస్తులు విక్రయించి 18న లాటరీ తీయనున్నారు. 

మరిన్ని వార్తలు