మిస్టరీ తేల్చిన ‘పోస్టర్’

19 May, 2016 16:46 IST|Sakshi

వర్గల్: హతురాలి ఆచూకీ కోసం పోలీసులు అంటించిన వాల్‌పోస్టర్లు ఓ మిస్టరీని ఛేదించాయి. అడవిలో కనిపించిన మహిళ మృతదేహం ఎవరన్నదీ తేలిపోయింది. వివరాలివీ... మెదక్ జిల్లా వర్గల్ మండలం మీనాజీపేట అడవిలో ఈ నెల 6 న గుర్తు తెలియని మహిళ మృతదేహం స్థానికులకు కనిపించింది. గుర్తుపట్టలేనంతగా మారిపోయిన మృతదేహం పూసల దండ, ముక్కుపుడక, ధరించిన దుస్తులు మాత్రమే పోలీసుల దర్యాప్తుకు ఆధారంగా మిగిలాయి. దీంతో ఆ మహిళ ఎవరు అన్నది మిస్టరీగా మారింది. మిస్సింగ్ కేసుల ఆధారంగా గౌరారం పోలీసులు సాగించిన శోధన ఫలించలేదు. దీంతో వారు ఫొటోతో కూడిన వాల్‌పోస్టర్లను వర్గల్, తూప్రాన్, ములుగు, మేడ్చల్ తదితర మండలాల్లో అంటించారు. కేసు నమోదైన తరువాత 12 రోజులకు బుధవారం తూప్రాన్ మండలం పాలాటలో మృతురాలి బంధువులు పోస్టర్ చూసి మృతదేహాన్ని గుర్తుపట్టారు. మృతురాలు పాలాటకు చెందిన ఓలెం బాలమణి(45)గా నిర్ధారించారు.

మృతురాలి వివరాలివీ..
తూప్రాన్ మండలం పాలాటకు చెందిన ఓలెం బాలమణి భర్త నర్సాపూర్‌కు చెందిన ముద్దగోలోల్ల రాములు గతంలోనే మృతి చెందాడు. ఆ తరువాత రోడ్డు ప్రమాదంలో కొడుకు కూడా చనిపోయాడు. దీంతో ఆమె తూప్రాన్‌లో ఓ అద్దె గదిలో ఉంటూ అక్కడి అభిరుచి హోటల్‌లో దినసరి వేతనంపై పనిచేస్తోంది. ఈ నెల 3న సాయంత్రం వరకు హోటల్‌లో పనిచేసిన ఆమె తరువాత రోజు నుంచి అదృశ్యమైంది. పని చేసిన రోజే వేతనం కావడంతో ఆమె ఎందుకు రాలేదో యజమాని పట్టించుకోలేదు. ఆమె అదృశ్యమైన విషయం బంధువులకు కూడా తెలియకపోవడంతో మీనాజీపేట అడవిలో బాలమణి శవం మిస్టరీగా మిగిలిపోయింది.

అడవిలో ఏం జరిగింది..?
ఆమె శవంగా ఎందుకు మారిందో ప్రశ్నార్థకంగా నిలిచింది. అడవిలో ఏం జరిగింది, ఎవరైనా అఘాయిత్యానికి ఒడిగట్టారా, అక్కడే అంతమొందించారా, లేదా ఎక్కడైనా హతమార్చి ఇక్కడకు తీసుకొచ్చి పడేశారా.. ఇలాంటి అనేక కోణాల్లో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. రెండు, మూడు రోజుల్లోనే ఈ కేసును ఛేదిస్తామని గౌరారం ఎస్సై మధుసూదన్‌రెడ్డి అంటున్నారు.
 

మరిన్ని వార్తలు