తప్పు చేశావు బాబూ!

26 Jul, 2017 08:23 IST|Sakshi
తప్పు చేశావు బాబూ!

►నంద్యాలలో ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా వాల్‌ రైటింగ్స్‌
►హడావుడిగా తుడిచేసిన అధికారపార్టీ నేతలు
►ప్రజల్లో బాబుపై వ్యతిరేకతే కారణమంటున్న స్థానికులు


నంద్యాల : కర్నూలు జిల్లా నంద్యాల ఉప ఎన్నిక నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు వ్యవహరిస్తున్న తీరుపై నియోజకవర్గ ప్రజల్లో ఏహ్యభావం వ్యక్తమవుతోందా? తనకు ఓటేయకుంటే.. తానిచ్చిన పింఛన్లు ఎలా తీసుకుంటారని, తానేసిన రోడ్లపై ఎలా నడుస్తారంటూ ప్రశ్నించడం పట్ల వారిలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందా? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వస్తోంది. ‘తప్పు చేశావు బాబూ’ అంటూ నంద్యాల పట్టణంలో వాల్‌రైటింగ్స్‌ వెలియడం ఇందుకు ప్రత్యక్ష నిదర్శనం. నంద్యాల పట్టణంలోని రైల్వే క్వార్టర్స్‌ సమీపాన ఈ వాల్‌ రైటింగ్స్‌ వెలిశాయి. మిగిలిన ప్రాంతాల్లో సైతం ఇవి బయటపడ్డాయి. దీంతో కంగారుపడిన అధికారపార్టీ నేతలు హడావుడిగా వాటిని తుడిచేసేందుకు ప్రయత్నించారు.

నంద్యాల ఉప ఎన్నికలో ఎలాగైనా గెలవాలనే భావనతో నియోజకవర్గంలో సగానికిపైగా కేబినెట్‌ను రంగంలోకి దించడం, ఎక్కడికక్కడ నేతల్ని లోబర్చుకునేందుకు యత్నించడంతోపాటు బెదిరింపులకు దిగడం తెలిసిందే. అంతేగాక కులం, మతం ప్రాతిపదికన తాయిలాలు ప్రకటిస్తూ ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నారు. కేవలం నెల రోజుల వ్యవధిలోనే సీఎం నంద్యాల నియోజకవర్గంలో రెండుసార్లు పర్యటించడం.. ఈ పర్యటనల్లోనూ రాత్రిపూట అక్కడే బస చేయడం విదితమే.

అదే సమయంలో సమస్యలు విన్నవించిన ప్రజలపైన ఆయన శివాలెత్తడం తెలిసిందే. ఈ మొత్తం వ్యవహారంలో సీఎం చంద్రబాబు వ్యవహరించిన తీరు నంద్యాల ప్రజల్లో ఆయన పట్ల తీవ్ర వ్యతిరేకతను కలిగించినట్టు తెలుస్తోంది. దీన్ని ప్రతిబింబిస్తూ.. ‘తప్పు చేశావు బాబూ’ అంటూ ఈ వాల్‌ రైటింగ్స్‌ వెలిసినట్టు తెలుస్తోంది. చంద్రబాబుపై నంద్యాల నియోజకవర్గ ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు ఈ వాల్‌రైటింగ్స్‌ అద్దం పడుతున్నాయని స్థానికులు వ్యాఖ్యానిస్తున్నారు.

మరిన్ని వార్తలు