మంత్రి నిరంజన్‌రెడ్డి ఇంటి ముట్టడి

12 Nov, 2019 11:28 IST|Sakshi
మంత్రి నిరంజన్‌రెడ్డి ఇంటి ఎదుట కూర్చొని నినాదాలు చేస్తున్న ఆర్టీసీ కార్మికులు

పోలీసులు, ఆర్టీసీ కార్మికులకు మధ్య స్వల్ప తోపులాట  

పాల్గొన్న అఖిలపక్షాలు, సంఘాల నాయకులు  

మంత్రి పీఏకు వినతి అందజేత

సాక్షి, వనపర్తి: తమ డిమాండ్లు పరిష్కరించాలని కోరుతూ ఆర్టీసీ కార్మికులు సోమవారం అఖిలపక్షం రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు సంయుక్తంగా రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి ఇంటిని ముట్టడించారు. ప్రజాప్రతినిధుల ఇళ్ల ముట్టడి కార్యక్రమంలో భాగంగా ఆర్టీసీ కార్మికులు సమ్మె శిబిరం నుంచి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ, ర్యాలీగా వెళ్లారు. అప్పటికే మంత్రి ఇంటికి చేరుకునే రోడ్డును పోలీసులు ఇనుప బోర్డులతో మూసివేశారు. దీంతో కార్మికులు, అఖిలపక్షం నాయకులు పెద్దఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి ఇంటిని ముట్టడించేందుకు యత్నించడంతో పోలీసులకు, కార్మికుల మధ్య స్వల్పంగా తోపు లాట చోటుచేసుకుంది. ఈ క్రమంలోనే అడ్డంగా ఉంచిన ఇనుప బోర్డులు కిందపడ్డాయి. దీంతో కార్మికులు కేకలు, వేస్తూ, పరుగులు తీస్తూ మంత్రి ఇంటిని ముట్టడించారు. ముట్టడికి అనుమతిలేదని పోలీసులు వారించారు.

ఆర్టీసీ కార్మికుల సమస్యలను మంత్రి నిరంజన్‌రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ప్రభుత్వం దిగొచ్చేంత వరకు పోరాటం ఆగదని తెలిపారు. కార్మికుల పొట్టగొట్టే ఆలోచనలతో కాకుండా.. వారి భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్‌ ఆర్‌.గోపిగౌడ్‌ కోరారు. మంత్రి నిరంజన్‌రెడ్డి స్థానికంగా లేకపోవడంతో పలు డిమాండ్‌లతో కూడిన వినతి పత్రాన్ని జేఏసీ కన్వీనర్‌ గోపిగౌడ్‌ చదివి కార్మికులకు వినిపించారు. అనంతరం మంత్రి పీఏ ఆసీఫ్‌కు అందజేశారు. ఈ సందర్భంగా ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా సీఐ సూర్యనాయక్‌ నేతృత్వంలో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జబ్బార్, పట్టణ కార్యదర్శి గోపాలక్రిష్ణ, డి.కురుమయ్య, నందిమల్ల రాములు, టీడీపీ అశోక్, ఎన్‌.రమేష్, కాంగ్రెస్‌ సతీష్, న్యాయవాది మోహన్‌కుమార్, సీపీఐ డి.చంద్రయ్య సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ అరుణ్‌కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు