వనపర్తి రాష్ట్రంలోనే ఫస్ట్‌ప్లేస్‌..

6 Mar, 2019 19:35 IST|Sakshi

సాక్షి, వనపర్తి:  ఆస్తిపన్ను వసూలులో జిల్లా రాష్ట్రంలోనే మొదటిస్థానంలో నిలిచింది. పంచాయతీ ఎన్నికల పుణ్యమా అని జిల్లా వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో టాక్సీలు, ఇతర పన్నుల వసూళ్లు జోరందుకున్నాయి. యేటా మార్చినెలకు ముందు గ్రామాల్లో ఆస్తిపన్ను, ఇతర పన్ను వసూలు చేస్తారు. ఈ సారి ఆనవాయితీ ప్రకారం జిల్లాకు రూ.2.39 కోట్ల టాక్సీ, నాన్‌టాక్సీ టార్గెట్‌ ఇచ్చారు.

జనవరి మాసంలోనే పంచాయతీ ఎన్నికలు రావటంతో ఆయా గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసేవారు. వారిని ప్రతిపాదించే వారికీ ఇంటిటాక్సీ, పంచాయతీ చెల్లించాల్సిన ఇతర చెల్లింపుల బాకాయి ఉండొద్దని ఎన్నికల అధికారులు నిబంధనలు విధించటంతో గత కొన్నేళ్లుగా పెండింగ్‌లో ఉన్న టాక్సీ, నాన్‌టాక్సీల మొత్తం చాలా వరకు వసూలయ్యాయి. ఇటీవల నిర్వహించిన పంచాయతీ ఎన్నికల్లో వనపర్తి జిల్లాలో అత్యధికంగా సర్పంచ్, వార్డుసభ్యుల పదవి కోసం అభ్యర్థులు పోటీపడ్డారు. దీంతో జిల్లాకు ఆదాయం టాక్సీ, నాన్‌టాక్సీలు అంతేస్థాయిలో వసూలయ్యాయి. అర్ధరాత్రి ఒంటిగంట వరకు టాక్సీలు చెల్లించేందుకు నామినేషన్లు స్వీకరించే స్థలంలో క్యూలైన్‌లు కట్టిన సంఘటనలు జిల్లాలో ఉన్నాయి.  

రూ.1.91 కోట్ల వసూలు  
జిల్లా టాక్సీ, నాన్‌టాక్సీల వసూలు టార్గెట్‌ రూ.2.39 కోట్లు కాగా ఇప్పటి వరకు 14మండలాల పరిధిలోని 255 పంచాయతీలలో రూ.1.91 కోట్లు వసూలు చేసినట్లు అధికారులు వెల్లడించారు. రాష్ట్రంలోని 32 జిల్లాలో వనపర్తి జిల్లా టాక్సీలు, నాన్‌టాక్సీల వసూలులో మొదటి స్థానంలో ఉన్నట్లు జిల్లా పంచాయతీ అధికారులు వెల్లడిస్తున్నారు. గ్రామాల వారీగా టాక్సీ, నాన్‌టాక్సీ డబ్బులు వసూలు చేసిన పంచాయతీ కార్యదర్శులు ఆయా పంచాయతీ ఖాతాలో ట్రెజరీ ద్వారా జమచేయాల్సి ఉంది. ఈ నెలాఖరులోపు బ్యాలెన్స్‌ ఉన్న రూ.48లక్షలు వసూలు చేస్తామని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.  

పంచాయతీలోఅభివృద్ధి కోసమే నిధులు  
గ్రామ పంచాయతీల వారీగా వసూలు చేసిన టాక్సీ, నాన్‌టాక్సీల మొత్తాన్ని ఆయా జీపీల ఖాతాలో ట్రెజరీ ద్వారా జమ చేస్తారు. పంచాయతీల పాలకవర్గం తీర్మానం మేరకు, ఆ నిధులను గ్రామంలో ఆయా అభివృద్ధి పనులకు ఉపయోగించాల్సి ఉంటుంది. ముఖ్యంగా తాగునీరు, పారిశుద్ధ్యం, ప్రజారోగ్యానికి మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది.  

మరిన్ని వార్తలు