రైలుకు 'ర్యాట్‌' సిగ్నల్‌

5 Dec, 2019 05:07 IST|Sakshi

రైలు పట్టాల కింద ఎలుకల సంచారం

చుట్టూ బొరియలు ఏర్పడటంతో పట్టాలు దిగబడే ప్రమాదం

పట్టాల దిగువన కాంక్రీట్‌ బెడ్ల నిర్మాణం చేయాలని యోచన

సాక్షి, హైదరాబాద్‌: ఎలుక... ఇప్పుడు రైల్వే శాఖను గడగడలాడిస్తోంది. సిగ్నల్‌ లేకుండా రైలు ముందుకు కదిలితే ప్రమాదం ఎలా పొంచి ఉందో, ఎలుకల గుంపుతోనూ అలాంటి ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు. దీంతో రైల్వే యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలుకల రూపంలో ఎదురయ్యే ప్రమాదానికి అడ్డుకట్ట వేయడానికి కసరత్తు ప్రారంభించింది. ఆ కసరత్తు ఖరీదు ఎంతో తెలుసా...  

ఏకంగా రూ. 228 కోట్లు.  
రైలు పట్టాల కింద పందికొక్కుల సైజులో ఉండే ఎలుకలు అటూఇటూ పరుగులు పెడుతుంటాయి. ప్రయాణికులు పట్టాలపైకి విసిరేసే మిగిలిపోయిన చిరుతిండి, కప్పుల్లో మిగిలిపోయిన టీ, కాఫీ చుక్కల కోసం అవి కలియబడుతుంటాయి. ఒకటి కాదు రెండు కాదు, ఒక్కో ప్లాట్‌ఫామ్‌ వద్ద అవి వందల్లో కనిపిస్తాయి. పట్టాలకు అటూఇటూ పెద్దపెద్ద బొరియలు చేసుకుని వాటిల్లోనే ఉంటాయి. ఇప్పుడు ఆ బొరియలే రైళ్లకు చిక్కులు తెస్తున్నాయి. బొరియల కారణంగా పట్టాల దిగువన నేల గుల్లబారి భూమి దిగబడే పరిస్థితి నెలకొంది. దీనివల్ల రైలు ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. కేంద్ర ప్రభుత్వం స్వచ్ఛభారత్‌లో భాగంగా స్వచ్ఛ రైల్వే కార్యక్రమాన్ని కూడా ముమ్మరంగా చేపట్టిన విషయం తెలిసిందే. ఈ పరిశుభ్ర కార్యక్రమాలు చేపట్టే క్రమంలో ఎలుకల వల్ల ముప్పు పొంచి ఉన్న విషయాన్ని అధికారులు గుర్తించారు. అందుకు పరిష్కారంగా భారీ కాంక్రీట్‌ బెడ్‌లు నిర్మించాలని రైల్వే అధికారులు నిర్ణయించి పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. రైళ్ల గమనాన్ని మార్చి మరీ పనులు చేస్తున్నారు. 

ఒక్కో ప్లాట్‌ఫామ్‌కోసం రూ. 3 కోట్ల ఖర్చు 
గతంలో పట్టాల కింద స్లీపర్స్‌... వాటి కింద మామూలు నేలనే ఉండేది. ఒక దశాబ్దం క్రితం నుంచి సిమెంటు పూత వేయటం ప్రారంభించారు. అయితే ఆ సిమెంట్‌పూత ఎలుకల తాకిడికి తట్టుకోలేకపోతోంది. తాజాగా వాటి స్థానంలో భారీ కాంక్రీట్‌ బెడ్‌ నిర్మిస్తున్నారు. ప్లాట్‌ఫామ్‌కు 500 మీటర్ల మేర వీటిని నిర్మిస్తున్నారు. చాలా మందంగా ఈ బెడ్‌ వేసిన తర్వాత దానిపై ట్రాక్‌ను బిగిస్తున్నారు. ట్రాక్‌ ప్రాంతాన్ని శుభ్రం చేసిన తర్వాత ఆ నీళ్లు వెళ్లేందుకు ఓ పక్కన ప్రత్యేక డ్రెయిన్‌ నిర్మిస్తున్నారు. ఈ బెడ్‌ నిర్మాణానికి మీటరుకు రూ.60 వేల నుంచి రూ.65 వేల వరకు ఖర్చవుతోంది. వెరసి ఒక ప్లాట్‌ఫామ్‌ వద్ద బెడ్‌ నిర్మాణానికి దాదాపు రూ.3 కోట్లు ఖర్చవుతోంది. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో 34 స్టేషన్‌లలో 76 ప్లాట్‌ఫామ్స్‌ వద్ద పనులు పూర్తవుతున్నాయి. 

పరిశుభ్రతే లక్ష్యం 
స్వచ్ఛ రైల్వేలో భాగంగా అన్ని స్టేషన్లు పరిశుభ్రంగా ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గతంలో రైల్వే అధికారులను గట్టిగా ఆదేశించారు. దీంతో అధికారులు ఆ పనులకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఎలుకలు ఎక్కువగా ఉండి, మట్టి తోడి చిందరవందర చేయటంతో పరిశుభ్రత పనులు సాధ్యం కావటం లేదు. నీటితో శుభ్రం చేసినా మళ్లీ ఎలుకలు చిందరవందర చేస్తున్నాయి. కడిగిన నీళ్లు బొరియల్లోకి చేరిపోతున్నాయి. అలా కాకుండా ఆ నీళ్లు సాఫీగా ముందుకు వెళ్లాలంటే డ్రెయిన్‌లు ఉండాలి. ఇలా అన్నింటికి కలిసి వచ్చేలా ఈ పనులు చేపట్టారు.

మరిన్ని వార్తలు