డంపింగ్‌ యార్డులు నిర్మించాలి

13 Apr, 2018 13:27 IST|Sakshi
సమావేశంలో మాట్లాడుతున్న జెడ్పీ చైర్మన్‌ బాలునాయక్‌

జెడ్పీ స్థాయీ సంఘం సమావేశంలో సభ్యుల డిమాండ్‌

సమావేశాలకు   గైర్హాజరైనఅధికారులపై చర్యలు

జెడ్పీ చైర్మన్‌ బాలునాయక్‌

గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్య శాఖలపై సమీక్ష

నల్లగొండ : గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు నిర్మించాలని జెడ్పీ స్థాయీ సంఘం కమిటీ సభ్యులు కోరారు. గురువారం నల్లగొండలోని జెడ్పీ కార్యాలయంలో గ్రామీణాభివృద్ధి, విద్య, వైద్యం స్థాయి సంఘం కమిటీల సమావేశం జరిగింది. జెడ్పీ చైర్మన్‌ నేనావత్‌ బాలూనాయక్‌ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశానికి ఆయా కమిటీల సభ్యులు, ఉమ్మడి జిల్లాకు చెందిన అధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ.. గ్రామాల్లో రహదారుల వెంట చెత్తా చెదారం పేరుకుపోతోందని అన్నారు. ఉపాధి హామీ పథకం కింద గ్రామాల్లో డంపింగ్‌ యార్డులు నిర్మించి.. చెత్త నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు. హరితహారంలో భాగంగా పంపిణీ చేస్తున్న మల్బరీ, వేప మొక్కలు నాసిరకంగా ఉంటున్నాయని.. మొక్కలు ఎదగడం లేదని సభ్యులు అన్నారు. ఐకేపీ కేంద్రాల్లో ధాన్యం తూకం వేయడానికి కాంటాలు సరిపోవడం లేదని, అధనంగా కాంటాలు ఏర్పాటు చేయాలని కోరారు.

జిల్లాలో ఎమ్మార్పీకి మించి మద్యం విక్రయాలు జరుగుతున్నాయని, చింతపల్లి, మాడ్గులపల్లి ఏరియాల్లో కల్తీ మద్యం విక్రయిస్తున్నారని, జాతర్లు, పండుగలప్పుడు వ్యాపారులు అధిక ధరలకు మద్యం విక్రయిస్తున్నారని సభ్యులు తెలిపారు. దీనిపై ఎక్సైజ్‌ శాఖ స్పందిచకపోతే.. ప్రజాప్రతినిధులుగా తామే జోక్యం చేసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. గురువారం జరిగిన సమావేశాలకు పలువురు అధికారులు హాజరు కాకపోవడంపై జెడ్పీ చైర్మన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతి లేకుండా గైర్హాజరైన అధికారులకు నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. గత సమావేశాల్లో సభ్యులు కోరిన వివిధ అభివృద్ధి పనులను అధికారులు వీలైనంత త్వరగా పూర్తిచేయాలని చైర్మన్‌ సూచించారు. సమావేశంలో సభ్యులు, జెడ్పీ సీఈఓ హనుమానాయక్, డీఆర్డీఓ రింగు అంజయ్య, డీఈఓ జగిని చైతన్య, ఎక్సైజ్‌ అధికారులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు