లైంగిక వేధింపులపై కమిటీ వేయాలి

12 Apr, 2018 10:23 IST|Sakshi
నటి శ్రీరెడ్డి (ఫైల్‌ ఫోటో)

పంజగుట్ట: సినీరంగంలోని పెద్దలను కాపాడేందుకు మహిళలను పణంగా పెట్టడం దారుణమని  మహిళా సంఘాల నేతలు అన్నారు. శ్రీరెడ్డి తనకు అన్యాయం చేసినవారి వివరాలు పూర్తి ఆధారాలతో బయటపెట్టిన నేపథ్యంలో వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో స్పష్టం చేయాలని డిమాండ్‌ చేశారు. సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులకు గురైన మహిళలు ఫిర్యాదు చేసేందుకు అంతర్గత కమిటీ వేయాలని, ప్రభుత్వం ప్రత్యేకంగా హెల్ప్‌లైన్‌ ఏర్పాటు చేయాలని  కోరారు. సినీపరిశ్రమలో లైంగిక దాడులను అరికట్టాలని కోరుతూ బుధవారం రాష్ట్ర సినిమాటోగ్రాఫీ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.

అనంతరం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో మహిళా సంఘాల నేతలు సంధ్య, జ్యోతి, దేవి, జాన్సీ, సజయ, రత్న, ఆశాలత, అపూర్వ, సత్యవతి, లక్ష్మి మాట్లాడుతూ ..సినిమారంగంలో విపరీతమైన లైంగిక దోపిడీ జరుగుతుందని, చిన్నచిన్న అవకాశాలు ఇచ్చేందుకు కూడా మహిళలను   వేధిస్తున్నారని ఆరోపించారు. శ్రీరెడ్డి ధైర్యం చేసి బయటకు వచ్చిందని, బాధితులు ఎంతోమంది ఉన్నారన్నారు. నిజంగా వారు కళామ్మతల్లి బిడ్డలే అయితే అదే కళామ్మతల్లికి చెందిన ఆడబిడ్డలను ఎందుకు వేధిస్తున్నారని ప్రశ్నించారు.

ఇది తెలుగు చిత్ర పరిశ్రమ కాదని, తెలుగు ఫ్యూడల్, తెలుగు రేప్‌ ఇండస్ట్రీగా పేర్కొన్నారు. ఇంత జరుగుతున్నా పెద్ద హీరోలు మౌనంగా ఎందుకు ఉన్నారని ప్రశ్నించారు. ఫిలిం చాంబర్‌ ఆఫ్‌ కామర్స్, మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌లో లైంగిక వేధింపుల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని, సినీ పరిశ్రమలో లైంగిక వేధింపులు నిరోధించడానికి ప్రభుత్వ అధికారులు, పోలీసులు, మహిళా సంఘాలతో కూడిన హైలెవల్‌ కమిటీని ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. శ్రీరెడ్డిపై నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలని, ఆమె ఆరోపించినట్లుగా హింసాపూరిత చర్యలపై దర్యాప్తు చేపట్టాలని కోరారు. కార్యక్రమంలో వివిధ మహిళా సంఘాల నాయకులు పాల్గొన్నారు.

మాట్లాడుతున్న మహిళా సంఘాల ప్రతినిధులు

>
మరిన్ని వార్తలు