ట్రైబల్ టైలర్లు కావలెను..!

19 Jul, 2014 00:58 IST|Sakshi
ట్రైబల్ టైలర్లు కావలెను..!

* ఎస్టీ విద్యార్థుల దుస్తులు కుట్టేందుకు దర్జీల కొరత
* సంక్షేమ హాస్టళ్లలో పక్కన పడేసిన క్లాత్
* ప్రత్యామ్నాయ చర్యలపై దృష్టిపెట్టని వైనం
* మధ్యవర్తుల పైరవీలతో అధికారుల ఇబ్బందులు
నీలగిరి: జిల్లాలో ట్రైబల్ టైలర్లు (గిరిజన దర్జీలు) కరువయ్యారు. దీంతో ఎస్టీ సంక్షేమ వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు దుస్తులు కుట్టే నాథుడే లేకుండాపోయాడు. దర్జీలు లేరన్న కారణాన్ని సాకుగా చూపి వేల మీటర్ల క్లాత్‌ను పక్కన పడేశారు. జిల్లా మొత్తంగా 39 ఎస్టీ సంక్షేమ వసతిగృహాలు, 11 ఆశ్రమ పాఠశాలలు ఉన్నాయి. వీటిలో 13,000 మంది విద్యార్థులు వసతి పొందుతున్నారు. విద్యాసంవత్సర ప్రారంభంలోనే జిల్లాకు 1,6,226 మీటర్ల క్లాత్ చేరింది. ఒక్కో విద్యార్థికి మూడు జతల దుస్తులు కుట్టించి ఇవ్వాలి. గతంలో క్లాత్‌ను బ్లాక్‌మార్కెట్‌కు తరలించడం, విద్యార్థులకు ఒకటిరెండు జతలు ఇవ్వడం లాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో ప్రభుత్వం గత ఏడాది నుంచే నిబంధనల్లో మార్పులు తీసుకొచ్చింది.

గిరిజన టైలర్లకు ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం దుస్తులు కుట్టే బాధ్యతను వారికే అప్పగించాలని పేర్కొంది. వసతి గృహాల వద్దనే కుట్టుమిషన్లు ఏర్పాటు చేసి విద్యార్థులకు దుస్తులు కుట్టించాలనే నిబంధన విధించింది. ఆ మేరకు జిల్లా వ్యాప్తంగా 16 హాస్టళ్లను దుస్తులు కుట్టించే కేంద్రాలుగా ఎంపిక చేశారు. ఈ కేంద్రాల వద్దనే మిగిలిన 34 హాస్టళ్లకు చెందిన దుస్తులు కుట్టించాలి. దీంతో ఒక్కో హాస్టల్‌కు ఎంతలేదన్నా పది నుంచి 20 కుట్టుమిషన్లు అవసరం. ఈ స్థాయిలో కుట్టుమిషన్లు ఏర్పాటు చేసేంత శక్తిసామర్థ్యాలు కలిగిన గిరిజన టైలర్లు తమకు దొరకడం లేదని వార్డెన్లు రాతపూర్వకంగా జిల్లా అధికారులకు లేఖ రాశారు.

వసతి గృహాల వద్ద దుస్తుల కుట్టేందుకు అంతగా ఆసక్తి చూపడం లేదని, క్లాత్ ఇస్తే, బయట కుట్టి హాస్టళ్లకు పంపిస్తామని కొందరు గిరిజన టైలర్లు సంప్రదించినట్లుగా వార్డెన్లు  అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఇప్పటి వరకు దుస్తులు కుట్టే వ్యవహారం ఓ కొలిక్కి రాకపోవడంతో వసతి గృహాలకు చేరిన క్లాత్ నిరుపయోగంగా ఉండిపోయింది. ఆగస్టు 15వ తేదీ నాటికి విద్యార్థులకు  కొత్త దుస్తులు అందించాలి. కానీ ఇప్పటి వరకూ అధికారులు ఆ దిశగా ఏ ప్రయత్నమూ చేయలేదు. గతేడాది కూడా గిరిజన దర్జీలు లేరన్న కారణాన్ని సాకుగా చూపిన వార్డెన్లు దుస్తులు కుట్టే బాధ్యతను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించారు. దీంతో పలుచోట్ల క్లాత్ దుర్వినియోగం కావడంతోపాటు శాఖాపరంగా అనేక విమర్శలు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ ఏడు  పక్కదారి పట్టకుండా ఉండేందుకు, గిరిజన దర్జీలకు ఉపాధి కల్పించాలన్న పట్టుదలతో జిల్లా యంత్రాంగం ఉన్నట్లు తెలుస్తోంది.
 
దళారుల ప్రమేయంతోనే ఇబ్బందులు : వి.సర్వేశ్వరరెడ్డి, మాడా పీఓ
దుస్తులు కుట్టేందుకు గిరిజన దర్జీలను రానివ్వకుండా దళారులు అడ్డుకుంటున్నారు. అంతేకాదు.. పలుచోట్ల బెదిరింపులకు పాల్పపడుతున్నట్లు ఫిర్యాదులు కూడా వచ్చాయి. గతంలో కూడా ఈ విధమైన సంఘటనలు చోటుచేసుకున్నాయి. దుస్తులు కుట్టినందుకుగాను టైలర్లకు ఒక్కో జతకు రూ.40 చొప్పున చెల్లిస్తాం. దీంట్లో కమీషన్లు రాబట్టుకునేందుకు దళారులు ప్రవేశించి గిరిజన టైలర్లను రానివ్వడం లేదు. ఇద్దరు, ముగ్గు రు దర్జీలు ఒక గ్రూపుగా ఏర్పడి దుస్తులు కుట్టేందుకు ముందుకొచ్చారు. ఇదే విషయమై కలెక్టర్‌కు ఫైల్‌కూడా పెట్టాం. కానీ వ్యక్తిగతంగా ముందుకొచ్చి హాస్టళ్ల వద్ద దుస్తులు కుట్టేవారికే మాత్రమే ఆ బాధ్యతను అప్పగించాలన్నారు. దీంతో దర్జీలను ఎంపిక చేసే పనిలో ఉన్నాం. త్వరలో దుస్తులు కుట్టించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం.

మరిన్ని వార్తలు