కేశవాపూర్‌ కుదింపు!

18 Oct, 2019 02:43 IST|Sakshi

భూసేకరణ నేపథ్యంలో రిజర్వాయర్‌ సామర్థ్యం తగ్గింపు

ప్రభుత్వానికి వ్యాప్కోస్‌ నివేదిక..రూ.3,363 కోట్లతో కొత్త అంచనా

హైదరాబాద్‌ తాగునీటి అవసరాల కోసం గతంలో అనుమతులు ఇచ్చిన ప్రభుత్వం

ఘణపూర్‌ వద్ద రూ.వెయ్యి కోట్లతో వాటర్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌

సాక్షి, హైదరాబాద్‌:మేడ్చల్‌ జిల్లా శామీర్‌పేట్‌ సమీపంలో చేపట్టదలిచిన కేశవాపూర్‌ రిజర్వాయర్‌ సామర్థ్యాన్ని కుదించాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. రిజర్వాయర్‌ నిర్మాణానికి అవసరమైన భూసేకరణ అంశంలో చిక్కు ముళ్లు కొలిక్కి వచ్చే అవకాశాలు సన్నగిల్లిన నేపథ్యంలో దీని సామర్థ్యాన్ని సగానికి తగ్గించాలని భావిస్తోంది. ప్రస్తుతం 10 టీఎంసీల సామర్థ్యంతో దీనికి ఇప్పటికే పరిపాలనా అనుమతులు ఇవ్వగా, తాజాగా 5.04 టీఎంసీలకే దీన్ని పరిమితం చేసేలా వ్యాప్కోస్‌ సంస్థతో సర్వే చేయించింది. 5 టీఎంసీలతో రిజర్వాయర్‌ నిర్మాణం చేపడితే దాని నిర్మాణానికి రూ.3,363 కోట్ల మేర వ్యయం అవుతుందని వ్యాప్కోస్‌ నీటిపారుదల శాఖకు, మున్సిపల్‌ శాఖకు నివేదించింది.

భూసేకరణ జాప్యంతోనే.. 
కాళేశ్వరం ఎత్తిపోతలలో భాగంగా ఉన్న కొండపోచమ్మ సాగర్‌ నుంచి గోదావరి జలాలను గ్రావిటీ ద్వారా తరలించి హైదరాబాద్‌ తాగునీటి అవసరాలను చేపట్టేలా కేశవాపూర్‌ రిజర్వాయర్‌ను 10 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టాలని నిర్ణయిం చారు. రిజర్వాయర్‌ నిర్మాణానికి 13 కి.మీ. కట్ట నిర్మాణం చేయాల్సి ఉంటుందని తేల్చగా, కొండపోచమ్మ సాగర్‌ మీదుగా కేశవాపూర్‌ రిజర్వాయర్‌కు మూడు 3,600 ఎంఎం డయా గ్రావిటీ పైప్‌ లైన్ల ద్వారా నీటిని తరలించేలా ప్రణాళిక సిద్ధం చేశారు.

రిజర్వాయర్‌ నుంచి వచ్చే రా వాటర్‌ను ఘణపూర్‌లో నీటి శుద్ధి కేంద్రంలో (డబ్ల్యూటీపీ) శుద్ధి చేసి శామీర్‌పేట్, సైనిక్‌పురి మీదుగా ఉన్న గోదావరి రింగ్‌ మెయిన్‌ పైప్‌ లైన్లకు స్వచ్ఛమైన జలాలను పంపింగ్‌ చేయాల్సి ఉంటుంది. కేశవాపూర్‌ రిజర్వాయర్‌ నిర్మాణానికి 3,822 ఎకరాల భూమి అవసరం ఉండగా, మొత్తంగా రూ.4,777.59 కోట్లతో పరిపాలనా అనుమతులు ఇచ్చారు. భూసేకరణ, పరిహారం చెల్లింపునకు రూ.518.7 కోట్ల అంచనా వ్యయం అవుతుందని ప్రాథమికంగా అంచనా వేశారు.

ఇవి పోనూ రిజర్వాయర్‌ పనులకు రూ.3,918 కోట్లతో టెండర్ల ప్రక్రియ సైతం పూర్తికాగా, పనులు మాత్రం మొదలు కాలేదు. ఈ పనులు చేపట్టేందుకు బొంరాస్‌పేట, పొన్నాల గ్రామాల్లో భూసేకరణ చేయాల్సి ఉంది. ఇక్కడి రైతులు భూసేకరణకు సహకరించడం లేదు. భూసేకరణ కోసం రెవెన్యూ అధికారులు సమావేశాలు నిర్వహించినా ముంపు గ్రామాల ప్రజల నుంచి అభ్యంతరాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై సమీక్షించిన ప్రభుత్వం 5 టీఎంసీలు కుదించి, దానికనుగుణంగా ప్రాజెక్టు నివేదికతతయారు చేసి ఇవ్వాలని వ్యాప్కోస్‌ను ఆదేశించింది. దీనిపై కసరత్తు చేసి న వ్యాప్కోస్‌ ప్రభుత్వ భూమి 918.84 ఎకరాల మేర అటవీ భూమి ప్రాం తంలోనే నిర్మాణం చేసేలా 5.04 టీఎంసీలతో కేశవాపూర్‌ను నిర్మించే అవకాశం ఉందని తేల్చింది.

రూ.3,363 కోట్లు అవసరం.. 
రా వాటర్‌ తరలించేందుకు ఏర్పాటు చేయనున్న రెండు వరుసల ప్రధాన పైప్‌ లైన్‌ పొడవు గతంలో 18.2 కి.మీ. ఉండగా, ప్రస్తుతం దాన్ని ఒకటే వరుసలో 34.85 కి.మీ.లకు ప్రతిపాదించింది. దీనికి మొత్తంగా రూ.3,363 కోట్లు అవుతుందని లెక్కగట్టింది. ఇందులో భూసేకరణ అవసరాలకు రూ.75 కోట్లు అవసరం ఉంటుందని తేల్చింది. దీంతో పాటే కొండపోచమ్మ సాగర్‌ నుంచి 10 టీఎంసీల నీటిని శుద్ధి చేసేందుకు డబ్ల్యూటీపీ నిర్మాణం చేయాల్సి ఉండగా, దానికి రూ.1,006 కోట్లు అంచనా కట్టింది. ఇందులో పైప్‌ లైన్‌ నిర్మాణానికే రూ.385 కోట్లు ఖర్చవుతుందని లెక్కగట్టింది.  

మరిన్ని వార్తలు