రణరంగంగా మున్సిపల్‌ సమావేశం

31 Jan, 2018 15:00 IST|Sakshi
సమావేశ మందిరంలో గొడవ పడుతున్న సభ్యులు 

     సభ్యుల బాహాబాహీ

     కుర్చీలు లేపి, చొక్కాలు పట్టుకుని

     గొడవకు దిగిన సభ్యులు 

     పోలీసు బందోబస్తు మధ్య సమావేశం 

బెల్లంపల్లి : మున్సిపల్‌ సర్వసభ్య సమావేశం మరోమారు రణరంగంగా మారింది. కొందరు సభ్యులు బాహాబాహీకి దిగారు. ఒకరి చొక్కాలను మరొకరు పట్టుకుని రసాభసా చేశారు. తీవ్ర ఉద్రిక్తత పరిస్థితుల మధ్య మంగళవారం బెల్లంపల్లి మున్సిపల్‌ సమావేశాన్ని నిర్వహించారు. మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పి.సునీతారాణి అధ్యక్షత నిర్వహించిన సర్వసభ్య సమావేశం ప్రారంభంలోనే సభ్యుడు పత్తిపాక రాజ్‌కుమార్‌ కుర్చీలోంచి లేచి అభ్యంతరం తెలిపారు.


సమావేశం నెల ప్రారంభంలో నిర్వహించాలని, దీంతో సభ్యులకు ఇబ్బంది ఉండదని రాజ్‌కుమార్‌ మాట్లాడారు. అంతలోనే మరో సభ్యుడు ఎలిగేటి శ్రీనివాస్‌ కుర్చీలోంచి లేచి సమావేశం ఎప్పుడు నిర్వహిస్తే ఏంటి, ప్రతి సారి ఏదో ఒక గొడవ చేస్తావ్‌ అంటూ ఆవేశంగా రాజ్‌కుమార్‌ వైపు వచ్చాడు. దీంతో ఈ   ఇద్దరు సభ్యులు కోపోద్రిక్తులై ఒకరి చొక్కాలు మరొకరు పట్టుకుని ఘర్షణకు దిగారు. కుర్చీలను తన్నడంతో సమావేశం ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. అంతలోనే ఇతర సభ్యులు అప్రమత్తమై ఘర్షణకు దిగిన సభ్యులను చెరో వైపుకు తీసుకెళ్లారు. దీంతో గొడవ సద్దుమణిగింది. 


ఈ ఘటన ముగిసిన తర్వాత ఎజెండా అంశాలపై వైస్‌చైర్మన్‌ నూనేటి సత్యనారాయణ మాట్లాడారు. ఒక్కో అంశాన్ని మెజార్టీ సభ్యుల అభిప్రాయం ప్రకారం మాత్రమే ఆమోదించాలని వైస్‌ చైర్మన్, సభ్యులు కమిషనర్‌కు స్పష్టం చేశారు. ఒకటో అంశం ఆమోదించిన సభ్యులు, రూ.2.34 కోట్లతో ప్రతిపాదించిన రెండో అంశంపై చర్చ ప్రారంభం కాగా వైస్‌చైర్మన్, మెజార్టీ సభ్యులు వాయిదా వేయాలని పట్టుబట్టారు. ఇంతలో సభ్యుడు రాజేశ్వర్‌ నిల్చుని రెండో అంశాన్ని ఆమోదించాల్సిందేనని సభ్యులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో మరోమారు గొడవ ప్రారంభమైంది. వైస్‌చైర్మన్‌  సత్యనారాయణ, సభ్యుడు రాజేశ్వర్‌ ఆవేశానికి గురై కుర్చీలు విసురుకున్నారు. ఒకరినొకరు తీవ్రంగా దూషించుకున్నారు. ఘర్షణ సద్దుమణిగిన కొద్దిసేపటి తర్వాత సమావేశం నిర్వహించారు. గొడవ జరుగుతున్న క్రమంలో టూటౌన్‌ ఎస్సై జె.సురేష్‌ బందోబస్తు నిర్వహించారు. 

ఏకగీవ్రంగా ఆరు అంశాలు ఆమోదం..


బెల్లంపల్లి : మున్సిపల్‌ సమావేశంలో సభ్యులు ఆరు అంశాలను ఏకగ్రీవంగా ఆమోదించినట్లు చైర్‌పర్సన్‌ సునీతారాణి, కమిషనర్‌ రాజు తెలిపారు. సమావేశ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వివరాలు వెల్లడించారు. మరో నాలుగు అంశాలను సభ్యులు వాయిదా వేసినట్లు తెలిపారు. సభా మర్యాదలు పాటించాలని సభ్యులకు పదే పదే గుర్తు చేస్తున్నా విస్మరించి ఘర్షణ పడుతున్నారని తెలిపారు. ఇకపై సమావేశంలో గొడవకు దిగితే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో సభ్యులు ఎల్‌.రాములు, కె.కవిత, సరిత, రాజేశ్వర్‌ పాల్గొన్నారు.


ఆర్‌వోను సరెండర్‌ చేస్తూ తీర్మానం.. 


మున్సిపల్‌ రెవెన్యూ అధికారి(ఆర్‌వో) మల్లారెడ్డిని ప్రభుత్వానికి సరెండర్‌ చేస్తూ మెజార్టీ సభ్యులు తీర్మానం చేసినట్లు వైస్‌చైర్మన్‌ సత్యనారాయణ, సభ్యులు తెలిపారు. సమావేశ అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సభ్యులు చేసిన తీర్మానాలను కాదని వేరే తీర్మానాలు మినిట్స్‌ బుక్‌లో రాసి తప్పుదోవ పట్టించిన ఆర్‌వోను వెంటనే ప్రభుత్వానికి సరెండర్‌ చేయాలని పట్టుబట్టి సభ్యులు తీర్మానం చేశారని వెల్లడించారు. ఈ సమావేశంలో కాంగ్రెస్‌ ఫ్లోర్‌ లీడర్‌ కటకం సతీష్, సభ్యులు వాసు, యూసుఫ్, శారద, రమ్మణమ్మ, స్రవంతి, శ్రీనివాస్, స్వప్న, రాజ్‌కుమార్, లావణ్య, భాగ్యలక్ష్మీ, సుమలత, వరలక్ష్మీ, వంశీకృష్ణారెడ్డి, అరుణ, రాజులాల్‌యాదవ్, కో– ఆప్షన్‌ సభ్యుడు నిజాముద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు.  

>
మరిన్ని వార్తలు