కమలంలో కోల్డ్‌వార్‌ 

29 Jul, 2019 10:57 IST|Sakshi

పాయల్‌ శంకర్‌ వర్సెస్‌ సుహాసినిరెడ్డి

మున్సిపల్‌ ఎన్నికల ముందు రాజుకుంటున్న వివాదం

సాక్షి, ఆదిలాబాద్‌ : కమలంలో కోల్డ్‌ వార్‌ మొదలైంది.. మున్సిపల్‌ ఎన్నికలకు ముం దు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పాయల్‌ శంకర్, రాష్ట్ర  కార్యనిర్వాహక సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డిల మధ్య వివాదం రాజుకుంటోంది. ఇన్ని రోజుల పాటు పార్టీలో స్తబ్ధంగా ఉన్న ఆమె రాజకీయ భవిష్యత్‌ను దృష్టిలో పెట్టుకుని అడుగులు వేస్తున్నారన్న అభిప్రాయం పార్టీలో వ్యక్తమవుతోంది. గతంలో ఉమ్మడి జిల్లా జెడ్పీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన సుహాసిని రెడ్డి మరింత ఉన్నత పదవులు చేపట్టేందుకు ఇప్పటినుంచే పార్టీలో పట్టు సాధించడం ద్వారా తన ఉనికిని గట్టిగా చాటుకోవాలనే ప్రయత్నాలు ప్రారంభించారని పార్టీలో విస్తృతంగా చర్చ సాగుతోంది. 

ప్రధాన మంత్రితో భేటీ..
గతేడాది అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి. గతంలో ఉమ్మడి జిల్లాలో జెడ్పీ చైర్‌పర్సన్‌గా వ్యవహరించిన సుహాసినిరెడ్డి గడిచిన శాసనసభ ఎన్నికల సమయంలోనూ ఆదిలాబాద్‌ నియోజకవర్గం నుంచి బీజేపీ పార్టీ టిక్కెట్‌ సాధించేందుకు బీజేపీ రాష్ట్ర నాయకుల వద్ద ప్రయత్నాలు చేశారనే ప్రచారం జరిగింది. అప్పట్లో ఆదిలాబాద్‌ అసెంబ్లీ నుంచి పాయల శంకర్‌కే మరోసారి టిక్కెట్‌ దక్కింది. అయినప్పటికీ ఎక్కడ నిరాశ నిస్పృహలు కనిపించకుండా ఆమె ప్రచారంలో పాల్గొన్నారు. ఆ తర్వాత పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ ఆదిలాబాద్‌ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన సోయం బాపురావు గెలుపు కోసం విస్తృతంగా ప్రచారం చేశారు. ఇప్పుడు మున్సిపల్‌ ఎన్నికలు మినహా మరే ఎన్నికలు లేనందునా సుహాసిని రెడ్డి తనకంటూ ఒక వర్గం ఏర్పాటు చేసుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారనే ప్రచారం పార్టీలో జరుగుతుంది. పాయల శంకర్‌తో విభేదాలు ఉన్నప్పటికీ అవి ఎక్కడ కానరానివ్వకుండా అంతా సఖ్యతగా ఉన్నట్టుగా వ్యవహారం నడుపుతూ వస్తున్నారు.

ఆది నుంచి ఈ ఇరువురు నేతలు తమ మధ్య సఖ్యత ఉన్నట్టు బయటకు ప్రదర్శిస్తున్నప్పటికీ మండలాల్లో తమ తమ వర్గాలను ప్రోత్సహిస్తూ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. రానున్న రోజుల్లో తనకంటూ పార్టీలో ఒక ప్రత్యేకత సాధించకపోతే ముందుకు పోలేమన్న అభిప్రాయం సుహాసిని వర్గంలో వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఇటీవల కాలంలో ఆమె కొంత పార్టీ వ్యవహారాల్లో దూకుడు పెంచడం కనిపిస్తోంది. తాజాగా ఇటీవల ఆమె దేశ రాజధాని ఢిల్లీకి వెళ్లి ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌లను కలవడం పార్టీలో విస్తృత చర్చకు దారి తీసింది. రాష్ట్ర, జాతీయ నేతలను కలిసి జిల్లా సమస్యలను చర్చించడం ద్వారా రానున్న రోజుల్లో రాజకీయంగా ఉన్నతి కోసం ఆమె తన ప్రయత్నాలను మొదలు పెట్టారన్న ప్రచారం జరుగుతోంది. సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే సుహాసిని రెడ్డి పార్టీ కార్యక్రమాల పరంగా కూడా కొంతమంది తీరుపై బాహాటంగానే ఎండగడుతున్నారు. గతంలో జిల్లాలో కొన్ని సంఘటనలు జరిగినప్పుడు జిల్లా నేత పార్టీ సిద్ధాంతాల ప్రకారం దూకుడుగా వ్యవహరించకుండా మిన్నకుండటంపై పార్టీలో విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అలాంటి సమయంలో సుహాసిని రెడ్డి ముందుండడం ద్వారా పార్టీ కార్యకర్తల మన్ననలు పొందేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

టిక్కెట్ల లొల్లి..
ప్రధానంగా మున్సిపల్‌ ఎన్నికలు ప్రస్తుతం ముందున్నాయి. ఆదిలాబాద్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించడంతో ఆ పార్టీలో నూతన ఉత్సాహం ఉంది. మున్సిపాలిటీ ఎన్నికల్లోనూ ప్రభావం చూపి బల్దియాను కైవసం చేసుకోవాలన్న ధీమా కనిపిస్తోంది. వార్డుల వారీగా ఇంకా రిజర్వేషన్‌ ఇంకా ఖరారు కాలేదు. అయితే కమలం పార్టీ నుంచి సమరోత్సాహం కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నేతల మధ్య తమ అనుచరులకు టిక్కెట్లు ఇప్పించే విషయంలో విభేదాలు బయటకొస్తున్నాయి. ఓ ముఖ్య నేత తాను సూచించిన వారికే టిక్కెట్లు అనే ధోరణిలో పోతుండటంతో ఇతర నేతలకు మింగుడుపడటం లేదు. దీంతో కొన్ని టిక్కెట్లు తాము సూచించిన వారికి ఇవ్వాలనే విషయంలో విభేదాలు మరింత పొడసూపినట్లు తెలుస్తోంది.

ఇప్పటివరకు అంతర్గతంగా ఉన్న విభేదాలు ఒక్కసారిగా బహిర్గతమయ్యే అవకాశాలు లేకపోలేదన్న ప్రచారం పార్టీలో జరుగుతుంది. ఎంపీ సోయం బాపురావు ప్రస్తుతం జిల్లాలోనే ఉన్నప్పటికీ పార్లమెంట్‌ సెషన్స్‌ సమావేశాల దృష్ట్యా ఢిల్లీకి రాకపోకలు సాగిస్తుండడంతో కొంత పార్టీ వ్యవహారాల్లో దృష్టి పెట్టలేకపోతున్నారు. ఇద్దరు ముఖ్య నేతల మధ్య ఈ వివాదం మున్సిపల్‌ ఎన్నికల్లో మరింత తీవ్రమయ్యే అవకాశాలు లేకపోలేదు. అదే సమయంలో పార్టీలో కొంతమంది సీనియర్‌ నేతలు కూడా ముఖ్య నేత తీరుపై అసంతృప్తితో ఉన్నారు. దీంతో బీజేపీలో ఏ సమయంలోనైనా విభేదాలు ప్రస్పుటమయ్యే పరిస్థితి ఉంది.  

>
మరిన్ని వార్తలు