ఐటీలో మేటి

16 Apr, 2016 01:20 IST|Sakshi

‘వరంగల్ యాజ్ ఐటీ డెస్టినేషన్’  పేరుతో పాలసీ 
మడికొండ, రాంపూర్‌లో 100 ఎకరాల స్థలం గుర్తింపు
కొత్త కంపెనీలకు  రాయితీలు, ప్రోత్సాహకాలు
అందుబాటులో  ఇంక్యుబేషన్ సెంటర్

 

హన్మకొండ : ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ పరిశ్రమకు వరంగల్ నగరం సరికొత్త కేంద్రంగా మారనుంది. రాబోయే రోజుల్లో పలు అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ తమ యూనిట్లను నెలకొల్పనున్నాయి. ఇటీవల రాష్ట్ర ఐటీ పాలసీని ప్రకటించిన ప్రభుత్వం తాజాగా వరంగల్ పై దృష్టి సారించింది. ఐటీ పరిశ్రమలకు అనుకూలంగా ఉన్న అంశాలు, ప్రభుత్వం తరఫున ఇవ్వబోతున్న ప్రోత్సాహకాలను వివరిస్తూ ‘వరంగల్ యాజ్ ఐటీ డెస్టినేషన్’ పేరుతో 3:22 నిమిషాల నిడివి కలిగిన వీడియో ఫేస్‌బుక్‌లో ఈ నెల 13న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి పేరుతో పోస్ట్ అయ్యింది.

 
వరంగల్ ఐటీ పాలసీ ఇదీ..

కొత్త ఐటీ పాలసీని ప్రభుత్వం ఈ నెల 6న ప్రకటించింది. ఇందులో హైదరాబాద్‌కు సంబంధించిన అంశాలే ఎక్కువగా ఉన్నాయి. తాజాగా ద్వితీయ శ్రేణి నగరాలకు సంబంధించి ముఖ్యంగా వరంగల్‌లో ఐటీ పరిశ్రమకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున తీసుకుంటున్న చర్యలు, ఇక్కడున్న సానుకూల అంశాలను వివరిస్తూ రాష్ట్ర ఐటీ శాఖ తరఫున ఈ నెల 13న  ‘వరంగల్ యాజ్ ఐటీ డెస్టినేషన్’ పేరుతో ఫేస్‌బుక్‌లో వీడియోను పోస్టు చేశారు. దీనిలో పేర్కొన్న అంశాల ప్రకారం.... మడికొండలో రెండు ఎకరాల విస్తీర్ణంలో ఐటీ ఇంక్యుబేషన్ సెంటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించింది. 1500 చదరపు అడుగుల విస్తీర్ణం గల ఆఫీస్‌స్పేస్ ఇక్కడ ఉంది. స్టార్ట్‌అప్ కంపెనీలు ఇక్కడ ప్లగ్ అండ్ ప్లే పద్ధతిలో కంపెనీలు ప్రారంభివచ్చు. ఇదే చోట ఐటీ ప్రత్యేక ఆర్థిక మండలికి 45 ఎకరాలు కేటాయించారు. తాజాగా రాంపూర్ వద్ద ఐటీ పరిశ్రమల కోసం 60 ఎకరాల స్థలాన్ని ఎంపిక చేశారు. అంతేకాకుండా వరంగల్ నగరంలో నెలకొల్పే ఐటీ పరిశ్రమలకు మున్సిపల్ కార్పొరేషన్ విధించే పన్నుల నుంచి మినహాయింపు ఇస్తామని పేర్కొన్నారు. ఎగ్బిబిషన్ రెంటల్ కాస్ట్‌లో 50 శాతం రాయితీ, ఐటీ నిపుణులను వృద్ధి చేయడం, నియామకాల్లో సహాయ సహకారాలు, టాస్క్ ద్వారా ప్రత్యేకంగా మానవ వనరులను వృద్ధి చేయడం వంటి కార్యక్రమాల్లో రాష్ట్ర ఐటీ శాఖ తరఫున ప్రోత్సాహం ఉంటుంది. నిరంతరం కరెంట్, ఇంటర్నెట్ వంటి సౌకర్యాలు కల్పిస్తారు.

 
అనుకూలమైన నగరం

హైదరాబాద్ తర్వాత రాష్ట్రంలో ఐటీ పరిశ్రమకు రెండో గమ్యస్థానంగా నిలవడంలో వరంగల్‌కు అనేక సానుకూల అంశాలు ఉన్నాయి.  విస్తీర్ణం, జనాభా పరంగా రాష్ట్రంలో రెండో పెద్ద నగరంగా వరంగల్‌కు గుర్తింపు ఉంది. చారిత్రక వారసత్వం, కట్టడాలతో అలరారుతోంది. పర్యాట రంగంలో మంచి వృద్ధి కనబరుస్తోంది. దేశంలోని అన్ని ప్రాంతాలను కలిపే విధంగా రోడ్డు, రైలు సౌకర్యం ఉంది. హైదరాబాద్ రింగు రోడ్డు నుంచి కేవలం 100 కిలోమీటర్ల దూరంలో వరంగల్ నగరం ఉంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్), కాకతీయ యూనివర్సిటీ, కిట్స్ వంటి పేరెన్నికగల కాలేజీలు ఇక్కడ ఉన్నాయి. అంతేకాకుండా హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, ఢిల్లీ పబ్లిక్ స్కూల్ వంటి ప్రతిష్టాత్మక విద్యాసంస్థలు ఇటీవల నెలకొల్పారు. ఫలితంగా నాణ్యమైన మానవ వనరుల లభ్యతకు కొదువలేదు. ఆతిథ్యానికి సంబంధించి పదుల సంఖ్యలో త్రీస్టార్ హోటళ్లు ఉన్నాయి. జీవన ప్రమాణాల పరంగా వరంగల్‌లో మాల్స్, ఫుడ్‌కోర్టులు ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చొరవ తీసుకుంటే మామునూరు ఎయిర్‌పోర్టును సైతం పునరుద్ధరించుకునే అవకాశం ఉంది. నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వరంగల్,  తెలంగాణ అకాడమీ ఆఫ్ స్కిల్ అండ్ నాలెడ్జ్‌లు (టాస్క్) సంయుక్తంగా ప్రతీఏడు వేయి మందిని ఐటీ ప్రొఫెషనల్స్‌గా మారుస్తున్నారు. దీంతో ఐటీ పరిశ్రమను విస్తరించేందుకు ద్వితీయ శ్రేణి నగరాల్లో వరంగల్‌ను ప్రథమ ప్రాధాన్యత నగరంగా రాష్ట్ర ప్రభుత్వం ఎన్నుకుంది.

 

స్పందన..
రాష్ట్ర ఇన్మర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వశాఖ రూపొందించిన ఈ ప్రచార వీడియోకు అమితమైన స్పందన లభిస్తోంది. ఈ నెల 13న  3:22 నిమిషాల నిడివి కలిగిన ఈ వీడియోను పోస్టు చేయగా రెండు రోజుల వ్యవధిలోనే రెండు లక్షల ఇరవై వేలకు పైగా లైక్స్ వచ్చాయి. ఇప్పటికే 91 వేల మంది వీక్షించారు. దాదాపు పదహారు వేల మంది ఈ వీడియోను షేర్ చేశారు. వరంగల్‌లో ఐటీ పరిశ్రమ నెలకొల్పేందుకు తాము సిద్ధంగా ఉన్నామని, త్వరలో ప్రభుత్వంతో సంప్రదింపులు చేస్తామంటూ కొందరు కామెంట్లు సైతం చేశారు.

 

మరిన్ని వార్తలు