మాక్‌ పోలింగ్‌

30 Sep, 2018 13:05 IST|Sakshi
ఏనుమాముల మార్కెట్‌లో ఈవీఎంలు, వీవీ ప్యాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌ హరిత(ఫైల్‌)

సాక్షి, వరంగల్‌ రూరల్‌: రాష్ట్ర అసెంబ్లీ రద్దయ్యింది.. జిల్లాలో ఎన్నికల సందడి మొదలైంది. ఓ వైపు కొందరు అభ్యర్థులు ఇప్పటికే ప్రచారం నిర్వహిస్తుండగా.. మరికొందరు అశావహులు టికెట్ల వేటలో ఉన్నారు. జిల్లా అధికారులు ఎన్నికల ఏర్పాట్లలో తలమునకలవుతున్నారు. జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ ముండ్రాతి హరిత నిత్యం అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. మరోవైపు ఓటరు ముసాయిదాను ప్రకటించేం దుకు ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు ఇప్పటికే ఈవీఎంలు, వీవీ ప్యాట్లు చేరుకున్నాయి. ఏనుమామూల మార్కెట్‌లోని గోదాంలో వాటిని భద్రపరిచారు. వాటికి ఇప్పటికే టెస్టింగ్‌ సైతం చేపట్టారు. పోలింగ్‌ కేంద్రాలను పరిశీలించారు.

తొలిసారిగా వీవీ ప్యాట్లు
ఈసారి తొలిసారిగా వీవీ ప్యాట్ల ద్వారా ఎన్నికలు నిర్వహించనున్నారు. ఈవీఎంలకు వీవీ ప్యాట్లను అనుసంధానం చేశారు. ఓటరు ఏ గుర్తుకు ఓటు వేశారో ఏడు సెకన్లపాటు వీటిపై కనిపిస్తుంది. వీవీ ప్యాట్లపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు అధికారులు కార్యచరణను రూపొందిస్తున్నారు. ఓటర్లకు, రాజకీయ నాయకులకు అనుమానాలు  తలెత్తకుండా ఉండేందుకు మూడు దశల్లో మాక్‌ పోలింగ్‌ను నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నేతలు, రెవెన్యూ అధికారుల సమక్షంలో ఇంజనీరింగ్‌ నిపుణులతో కొత్త ఈవీఎంలు, వీవీ ప్యాట్ల మొదటి దశ తనిఖీని పూర్తి చేశారు. జిల్లాలో నర్సంపేట, పరకాల రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకుగాను 810 బ్యాలెట్‌ యూనిట్లు, 630 కంట్రోల్‌ యూనిట్లు,  680 వీవీ ప్యాట్లు వచ్చాయి. జిల్లాలో 504 పోలింగ్‌ స్టేషన్లు ఉన్నాయి.
 
మూడు దశల్లో.. 
పోలింగ్‌ కేంద్రాల పరిధిలో మాక్‌ పోలింగ్‌ను మూడు దశల్లో నిర్వహించనున్నారు. మొదటి దశలో నియోజకవర్గ కేంద్రాల్లో వివిధ రంగాల నిపుణులు, అధికారులు, మహిళా సంఘాలు, విద్యావేత్తలకు కొత్త ఈవీఎంల పనితీరుతోపాటు ఓటు హక్కు వినియోగంపై వివరించనున్నారు. రెండో దశలో మండల కేంద్రాల్లో మహిళ సంఘాలు, వివిధ విభాగాల అధికారులు, రాజకీయ నాయకులకు అవగాహన కల్పించనున్నారు. మూడో దశలో ప్రతి గ్రామంలో ఉన్న పోలింగ్‌ కేంద్రాల్లో రెవెన్యూ, పంచాయతీ సిబ్బంది, మహిళా సంఘాలకు, యువజన సంఘాలు, స్వచ్ఛంద సంస్థల సహకారంతో మాక్‌ పోలింగ్‌ నిర్వహించనున్నారు.

ఒకటో తేదీ నుంచి.. 
అక్టోబర్‌ 1 నుంచి నియోజకవర్గ స్థాయిలో, 3న మండల స్థాయిలో, నాలుగు నుంచి గ్రామ స్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తాం. అన్ని గ్రామాలు పూర్తయ్యే వరకు 15 రోజులపాటు సదస్సులు నిర్వహిస్తాం. కార్యక్రమంలో ఓటర్లంతా పాల్గొని సహకరించాలి. – ముండ్రాతి హరిత, జిల్లా కలెక్టర్‌ 

మరిన్ని వార్తలు