పార్లమెంటులో ఓరుగల్లు దిగ్గజాలు..

14 Mar, 2019 19:21 IST|Sakshi
పీవీ నర్సింహారావు ,  కడియం శ్రీహరి ,  పోరిక బలరాం నాయక్‌

ఉమ్మడి జిల్లా నుంచి మహామహులు    

కేంద్ర, రాష్ట్రాల్లో చక్రం తిప్పిన నేతలు 

ఉమ్మడి వరంగల్‌ జిల్లా నుంచి లోక్‌సభ సభ్యులుగా దిగ్గజాలు ప్రాతినిధ్యం వహించారు. కేంద్ర మంత్రి నుంచి దేశ ప్రధాని వరకు ఉన్నత పదవులు అధిష్టించి, వాటికి వన్నె తెచ్చారు. ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వరంగల్, మహబూబాబాద్, హన్మకొండ, భద్రాచలం లోక్‌సభ నియోజకవర్గాలుండేవి. వరంగల్‌ లోక్‌సభ స్థానం 1952 సంవత్సరంలో ఏర్పాటైంది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాలకు వారిధిగా ఉండే భద్రాచలం నియోజకవర్గం 2009లో రద్దయింది. ఓరుగల్లుకు చెందిన పీవీ నర్సింహారావు భారత ప్రధానిగా సేవలందించి మన్ననలు పొందారు. గిరిజన ఎంపీగా ఎన్నికైన పోరిక బలరాంనాయక్‌ కేంద్ర మంత్రిగా పనిచేశారు. మైనార్టీ వర్గానికి చెందిన కమాలోద్దీన్‌ అహ్మద్‌ మూడుసార్లు హన్మకొండ, ఒకసారి వరంగల్‌ నుంచి ఎన్నికై కేంద్ర మంత్రిగా సేవలందించారు. 

పీవీ.. మన ఠీవి.. 
హన్మకొండ నుంచి 1977, 1980లో రెండుసార్లు ఎంపీగా గెలుపొందిన పీవీ.నర్సింహారావు ఆ తర్వాత భారత దేశానికి ప్రధానమంత్రిగా ప్రాతినిధ్యం వహించారు. ఆయన నంద్యాల నుంచి రెండుసార్లు, రామ్‌టెక్, బరంపురల నుంచి కూడా గెలుపొందారు. మూడు రాష్ట్రాలలో ఎంపీగా ఉన్న తెలుగు నేతగా రికార్డుకు ఎక్కారు. అయన రాష్ట్ర మంత్రిగా, ముఖ్యమంత్రిగా, కేంద్రమంత్రిగా, ప్రధానమంత్రిగా పనిచేసి రాష్ట్రానికి గొప్ప పేరు తెచ్చారు. 1980–1989 మధ్యకాలంలో కేంద్ర హోం, విదేశీ వ్యవహారాల మంత్రిగా పని చేశారు. 1957లో మంథని నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి అడుగు పెట్టారు. 1962లో తొలిసారిగా రాష్ట్ర మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఇలా 1971 వరకు మంత్రిగా కొనసాగారు. 1971 సెప్టెంబర్‌ 30న ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా పీవీ.నరసింహరావు బాధ్యతలు చేపట్టారు. 1973వ సంవత్సరం వరకు 
ముఖ్యమంత్రిగా రాష్ట్రానికి సేవలందించారు.

కడియం ఎంపీగా...
మాజీ ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి సైతం వరంగల్‌ ఎంపీగా పని చేశారు. వరంగల్‌ ఎంపీ ఎస్సీకి రిజర్వ్‌ కావడంతో 2014లో కడియం శ్రీహరి టీఆర్‌ఎస్‌ పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఎంపీగా ఎన్నికైన ఆరు నెలల తరువాత రాష్ట్ర ఉపముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. తర్వాత ఆయన ఎంపీ పదవికి రాజీనామా చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీ అధికారంలో ఉన్న సమయంలో ఎన్‌టీఆర్,
చంద్రబాబు మంత్రివర్గాల్లో మంత్రిగా పని చేశారు.

కేంద్ర మంత్రిగా కమాలోద్దిన్‌ అహ్మద్‌
వరంగల్‌కు చెందిన హన్మకొండ లోక్‌సభ స్థానం నుంచి మూడుసార్లు, వరంగల్‌ నుంచి ఒకసారి ఎంపీగా గెలుపొంది కమాలోద్దిన్‌ అహ్మద్‌ చరిత్ర సృష్టించారు. 1980లో వరంగల్‌ ఎంపీగా, 1989, 1991, 1996 సంవత్సరాల్లో హన్మకొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వర్తించారు. ఒక్కసారి ఎమ్మెల్యేగా సైతం గెలుపొందారు. పీసీసీ అధ్యక్షుడిగా సైతం బాధ్యతలు నిర్వర్తించారు. 

నాలుగుసార్లు గెలుపొందిన సురేందర్‌రెడ్డి
రామసహాయం సురేందర్‌రెడ్డి నాలుగుసార్లు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఎంపీగా గెలుపొందారు. 1967, 1989, 1991లలో వరంగల్‌ ఎంపీగా, 1965లో ఉప ఎన్నికల్లో మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి విజయం సాధించారు. 1996లో వరంగల్‌ లోక్‌సభ సభ్యునిగా పోటీ చేసి ఓటమి చెందారు. జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ పటిష్టతకు ఎంతగానో కృషి చేశారు. 

మంత్రిగా కమలకుమారి
భద్రాచలం నుంచి లోక్‌సభ సభ్యురాలుగా కాంగ్రెస్‌ పార్టీ నుంచి రెండుసార్లు కమలకుమారి గెలుపొందారు. 1989లో సోడే రామయ్యపై, 1991లోనూ ఆయనపైనే విజయం సాధించారు. ఒక్కసారి కేంద్ర మంత్రిగా సైతం పని చేశారు.

కేంద్ర మంత్రిగా బలరాం నాయక్‌
ములుగు మండలం మదనపల్లికి చెందిన పోరిక బలరాం నాయక్‌ మహబూబాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం నుంచి 2009లో ఎంపీగా గెలుపొందారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌ మంత్రివర్గంలో కేంద్ర న్యాయశాఖ మంత్రిగా పనిచేశారు. 2014 లోకసభ ఎన్నికల్లో ఎంపీగా, 2018లో అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓటమి చెందారు. 

ప్రస్తుత మంత్రి... ఒకప్పటి ఎంపీనే... 
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, ఆర్‌డబ్ల్యూఎస్‌ శాఖల మంత్రిగా పనిచేస్తున్న ఎర్రబెల్లి దయాకర్‌రావు గతంలో వరంగల్‌ ఎంపీగా పనిచేశారు. 2008లో ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి సమీప ప్రత్యర్థి రామేశ్వర్‌రెడ్డిపై గెలుపొందారు. ఎమ్మెల్యేగా ఆరుసార్లు గెలుపొంది, చంద్రబాబు కెబినేట్‌లో ప్రభుత్వ విప్‌గా పని చేశారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా