వరంగల్‌ కేయూలో విద్యార్థుల ఆందోళన

30 Nov, 2018 10:51 IST|Sakshi
కేయూ పరిపాలనా భవనం ఎదుట బైఠాయించిన విద్యార్థులు

నాణ్యమైన భోజనం అందించాలని ర్యాలీ, ధర్నా

హాస్టళ్ల డైరెక్టర్‌ను సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ 

పోలీసుల రాకతో ఉద్రిక్తత

సాక్షి, వరంగల్‌ : కాకతీయ యూనివర్సిటీలోని హాస్టళ్ల విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, నాణ్యమైన భోజనం అందించాలని డిమాండ్‌ చేస్తూ కామన్‌మెస్‌ విద్యార్థులు గురువారం క్యాంపస్‌లో ర్యాలీ నిర్వహించి, పరిపాలనాభవనం ఎదుట బైఠాయించి ధర్నా చేపట్టారు. కేయూ హాస్టళ్ల డైరెక్టర్‌ ఇస్తారి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ అతడిని సస్పెండ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. మెనూచార్టును సక్రమంగా అమలు చేయటంలేదని విమర్శించారు. మెనూకు సంబంధించిన అవకతకవలపై ఆడిట్‌ అ«ధికారులతో అందరి సమక్షంలో సమగ్ర విచారణ జరిపించాలని, కామన్‌మెస్‌ను డివైడ్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. కేయూ వీసీ అనుమతి లేకుండా యూనివర్సిటీలో పోలీసుల జోక్యం సరికాదన్నారు. స్టీమర్‌ రైస్‌ను తొలగించాలని కోరారు.

హాస్టళ్లకు వెళ్లేదారిలో పూర్తిస్థాయిలో విద్యుద్ధీపాలు ఏర్పాటు చేయాలన్నారు. దివ్యాంగ విద్యార్థులకు ప్రత్యేకంగా మెస్‌ను ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. వంకాయకూరలో పురుగులు వచ్చాయని రెండురోజుల క్రితం రాత్రివేళ వీసీ లాడ్జ్‌ వద్దకు వెళ్లేయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు. అక్కడికి వచ్చిన రిజిస్ట్రార్‌ కె.పురుషోత్తమ్‌ కామన్‌మెస్‌లోని విద్యార్థుల సమస్యలపై చర్చిద్దామని సర్దిచెప్పారు. గురువారం మళ్లీ విద్యార్థులు ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని లేనిఎడల పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. ఆందోళన చేస్తున్న విద్యార్థుల్లో ఓ విద్యార్థి అస్వస్థతకు గురై కిందపడిపోవడంతో ఆసుపత్రికి తరలించారు. 

రిజిస్ట్రార్‌ సమక్షంలో విద్యార్థులతో చర్చలు..
కాకతీయ యూనివర్సిటీ కామర్స్‌ అండ్‌బిజినెస్‌ మేనేజ్‌మెంట్‌ కళాశాల సెమినార్‌హాల్‌లో సాయంత్రం కామన్‌ మెస్, హాస్టళ్ల విద్యార్థులతో రిజిస్ట్రార్‌ కె.పురుషోత్తమ్‌ సమక్షంలో క్యాంపస్‌ కళాశాల ప్రిన్సిపాల్‌ టి.రవీందర్‌రెడ్డి, హాస్టళ్ల డైరెక్టర్‌ డాక్టర్‌ ఎం.ఇస్తారి, దూరవిద్యాకేంద్రం డైరెక్టర్‌ జి.వీరన్న, కేయూ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌ ఆచార్య వి.రాంచంద్రం చర్చలు జరిపారు. ఈ సందర్భంగా పలువురు విద్యారులు మాట్లాడుతూ ఒకే మెస్‌లో ఎక్కువమంది కాకుండా ఏ హాస్టల్‌కు అక్కడే మెస్‌ను విడివిడిగా ఏర్పాటు చేయాలని, మెస్‌లలో బయోమెట్రిక్‌ను ప్రవేశపెట్టాలని కోరారు. ప్రతివిద్యార్థి ఎన్నిరో జులు తింటే అన్ని రోజులకు మాత్రమే  బిల్లు వేయాలన్నారు. ఇలా అనేక సమస్యలను వారి దృష్టికి తీసుకెళ్లారు. అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, నాణ్యమైన భోజనం అందించాలని కోరారు. అయితే విడివిడిగా మెస్‌లను వచ్చే విద్యాసంవత్సరంలో ఏర్పాటుకు పరిశీలిస్తామని ఆచార్యులు తెలిపారు. బయోమెట్రిక్‌ సాధ్యసాధ్యాలను పరిశీలిస్తామని పేర్కొంటూ ఒక మెస్‌లో ప్రయోగాత్మకంగా పెట్టి పరిశీలించాక మిగితా వాటిల్లో ప్రవేశపెట్టేందుకు యత్నిస్తామని సమాధానం ఇచ్చారు.

మరిన్ని వార్తలు