పిల్లలు పుట్టడం లేదని నగ్నంగా పూజలు!

9 Aug, 2017 17:29 IST|Sakshi
పిల్లలు పుట్టడం లేదని నగ్నంగా పూజలు!

వరంగల్‌‌: వరంగల్‌ రూరల్ జిల్లా వర్ధన్నపేటలో క్షుద్రపూజలు కలకలం రేపాయి. సంతానం కలగడం లేదనే కారణంతో కొంత మంది మహిళలను గ్రామ శివార్లకు తీసుకెళ్లి నగ్నంగా క్షుద్రపూజలు నిర్వహిస్తున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు క్షుద్రపూజలను అడ్డుకుని ఇద్దరు మంత్రగాళ్లను సహా అయిదుగురు మహిళలను అదుపులోకి తీసుకున్నారు. వివరాల్లోకి వెళితే... మహబూబాబాద్‌ జిల్లా పెద్దవంగర మండల కేంద్రానికి చెందిన ఐదుగురు గర్భం దాల్చక పోవడంతో.. పర్వతగిరికి చెందిన ఓ మహిళను సంప్రదించగా.. పూజలు నిర్వహించాలని చెప్పింది.

దీంతో స్థానిక ఎస్సారెస్పీ కాలువ వద్దకు బాధితురాళ్లను పిలిపించి ప్రత్యేక పూజల పేరిట వారిని నగ్నంగా చేసి ఏవో మంత్రాలు చదివిస్తుండగా.. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన వర్ధన్నపేట సీఐ ఆదినారాయణ సంఘటనా స్థలానికి చేరుకొని వారిని అదుపులోకి తీసుకున్నారు. మంత్రాలు చేస్తున్న ఇద్దరిలో ఓ మహిళతో పాటు ఓ పురుషుడు ఉన్నాడు. కాగా బాధితురాళ్లలో ఓ యువతి భర్త జైళ్ల శాఖలో కానిస్టేబుల్‌గా పని చేస్తుండటం గమనార్హం. ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.