కలెక్టర్‌ అమ్రపాలి సాహసం..

3 Sep, 2017 18:24 IST|Sakshi
సాక్షి, వరంగల్: ఇటీవల కాలంలో తన పనితీరుతో వార్తల్లో నిలుస్తున్న వరంగల్‌ అర్బన్‌ జిల్లా కలెక్టర్‌ అమ్రపాలి మరోసారి తన ధైర్య సాహసాలను ప్రదర్శించి ఔరా అనిపించారు. ఆదివారం జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం పాండువుల గుట్టలలో నిర్వహిస్తున్న రాక్‌ క్లైంబింగ్‌ ఫెస్టీవల్‌లో రెండో రోజు ఆమె పాల్గొని సందడి చేశారు. ఈ సందర్భంగా ఆమె సేఫ్టీ హెల్మెట్‌ ధరించి కొండపైకి ట్రెక్కింగ్‌ చేస్తూ ధైర్య సాహసాలు ప్రదర్శించారు.
ఈ సమాచారం తెలుసుకున్న స్థానిక మహిళలు అక్కడికి చేరుకొని కలెక్టర్‌ సాహసాలను చూసి ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ మెచ్చుకున్నారు. గతంలో మరో కలెక్టర్‌తో కలిసి అడవిలో దాదాపు 15 కిలో మీటర్లు నడిచి కలెక్టర్‌ అమ్రపాలి ప్రశంసలు అందుకున్న విషయం తెలిసిందే. ఈ ఫెస్టీవల్‌ను శనివారం స్పీకర్‌ మధుసూధనాచారి ప్రారంభించగా ఫెస్టీవల్‌లో పాల్గొన్న విద్యార్థులు హిమాలయ పర్వతాన్ని అధిరోహించిన శేఖర్ బాబు ఆధ్వర్యంలో శిక్షణ పొందుతున్నారు. ఈ ఫెస్టీవల్‌కు వరంగల్ అర్బన్ జిల్లా అటవీశాఖ అధికారి అర్పణ, జయశంకర్ భూపాలపెల్లి జిల్లా అటవీశాఖ అధికారి  రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు.