ఓరుగల్లుకు హైబీపీ

18 Mar, 2016 01:30 IST|Sakshi
ఓరుగల్లుకు హైబీపీ

హైదరాబాద్: రాష్ట్రంలో వరంగల్ జిల్లావాసులు హైబీపీ సమస్యతో బాధపడుతున్నారు! ఈ జిల్లాలో అత్యధికంగా పురుషుల్లో 28 శాతం మందికి అధిక రక్తపోటు(హైపర్‌టెన్షన్) ఉన్నట్టు తేలింది. అతి తక్కువగా ఆదిలాబాద్ జిల్లాలో 18 శాతం మంది హైబీపీ బారిన పడ్డారు. వైద్యారోగ్య శాఖ రెండేళ్ల కిందట చేపట్టిన జిల్లా స్థాయి ఇంటింటి సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. అయిదేళ్లకోసారి ఆరోగ్య విభాగం నిర్వహించే జిల్లా స్థాయి ఇంటింటి, ఆరోగ్య సర్వే(డీఎల్‌హెచ్‌ఎస్) వివరాలను రాష్ట్ర ప్రభుత్వం తాజాగా విడుదల చేసిన సామాజిక ఆర్థిక సర్వేలో పొందుపరిచింది. 18 ఏళ్లు, ఆపై వయసున్న వారిలో మహిళల కంటే పురుషులే ఎక్కువగా అధిక రక్తపోటుకు గురవుతున్నట్టు స్పష్టమైంది.

పురుషుల్లో 22 శాతం మందికి హైపర్ టెన్షన్ ఉంటే మహిళల్లో అది 16 శాతం ఉన్నట్లు తేలింది. పురుషులకు సంబంధించి వరంగల్ జిల్లాలో అత్యధికంగా 28 శాతం, హైదరాబాద్‌లో 24 శాతం మందికి హైబీపీ ఉంది. మహిళల్లో వరంగల్‌లో అత్యధికంగా 18.2 శాతం, మెదక్‌లో 18.4 శాతం మందికి ఈ సమస్య ఉండగా... అత్యల్పంగా నల్లగొండలో 14 శాతం, ఆదిలాబాద్‌లో 14.2 శాతం మందికి అధిక రక్తపోటు ఉన్నట్టు సర్వే ద్వారా వెల్లడైంది.
 
చిన్నారులను పీడిస్తున్న రక్త హీనత
రాష్ట్రంలో చిన్నారులను రక్త హీనత(ఎనీమియా) పీడిస్తోంది. ఆరు నెలల వయసు నుంచి అయిదేళ్లలోపు చిన్నారుల్లో ప్రతి ముగ్గురిలో ఇద్దరు రక్తహీనతతో ఉన్నారు. ఈ వయసున్నవారిలో ఏకంగా 71 శాతం మందికి ఎనీమియా ఉన్నట్టు సర్వేలో తేలింది. 6-19 ఏళ్ల వయసు వారిలో 61 శాతం మందికి, 20 ఏళ్లకు మించిన వారిలో  50 శాతం మందికి రక్తహీనత ఉంది. ఖమ్మంలో అత్యధికంగా 80 శాతం, వరంగల్‌లో 75.5 శాతం, నిజామాబాద్‌లో 75 శాతం, కరీంనగర్‌లో 72 శాతం మంది రక్తహీనత బారినపడ్డారు.
 
పిల్లలకు పౌష్టికాహారం లేదు
పౌష్టికాహార లోపం చిన్నారుల ఎదుగుదలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. చాలామంది పిల్లలు వయసుకు తగ్గ ఎత్తు, బరువుతో లేనట్టు సర్వేలో తేలింది. 0-5 ఏళ్ల పిల్లల్లో.. నిజామాబాద్ జిల్లాలో అత్యధికంగా 33.2 శాతం, మహబూబ్‌నగర్‌లో 33.6 శాతం మంది వయసుకు తగ్గ ఎత్తు లేరు. నిజామాబాద్ జిల్లాలోనే 45.1 శాతం మంది పిల్లలు వయసుకు తగ్గ బరువు లేరు. ఎత్తుకు తగ్గ బరువు లేని పిల్లలు వరంగల్‌లో అత్యధికంగా 42.1 శాతం, మెదక్‌లో 37.3, కరీంనగర్‌లో 36.8 శాతం మంది ఉన్నారు.
 
ఆరోగ్య సూచీలో అట్టడుగునే
రాష్ట్రంలోని అన్ని జిల్లాలు ఆరోగ్య సూచీలో సగటు స్థాయిని దాటలేకపోయాయి. శిశు జనన, మరణాల రేటు, మాతృ మరణాల రేటు, పిల్లల పౌష్టికాహారం, సాధారణ ఆరోగ్యానికి సంబంధించిన మొత్తం 23 అంశాలవారీగా జిల్లాల ప్రగతి సూచీని అంచనా వేశారు. మొత్తం 23 అంశాల్లో కనీసం 11 అంశాల్లో మెరుగ్గా ఉన్న జిల్లా రాష్ట్రంలో ఒక్కటి కూడా లేకపోవడం గమనార్హం. ఆరు అంశాల్లో మెరుగ్గా ఉన్న ఆదిలాబాద్ జిల్లా శిశు, మాతృ మరణాలు, సురక్షిత ప్రసూతి అంశాల్లో అట్టడుగున ఉంది. అత్యధికంగా 9 అంశాల్లో హైదరాబాద్ జిల్లా ముందంజలో ఉంది.
 

మరిన్ని వార్తలు