సోయి లేకనే..

15 Feb, 2015 02:24 IST|Sakshi
సోయి లేకనే..

నారింజ నుంచి నీరంతా వృథా
 
పొలాలన్నీ బీళ్లు.. తాగు నీటికీ తిప్పలు
మన నీటితో సాగు చేసుకుంటున్న పక్క రాష్ర్టం
కారంజ ప్రాజెక్ట్‌కు జలకళ..
‘సాక్షి’ విజిట్‌లో వెలుగు చూసిన వాస్తవాలు

 
పక్క రాష్ట్రానికున్న సోయి మనకు లేకుండా పోయింది. మనం వృథాగా వదిలేసిన నీటి ఆధారంగా కర్ణాటక పాలకులు ఓ ప్రాజెక్టునే నిర్మించారు. వేలాది ఎకరాల్లో సాగు చేయడమే కాదు తాగు నీటికీ వినియోగించుకుంటున్నారు. ఉమ్మడి రాష్ర్టంలో పాలకుల నిర్లక్ష్యం ఫలితంగా మన నారింజ ప్రాజెక్టు వెలవెలబోతుండగా పక్క రాష్ర్టంలోని కారంజలో జలకళ సంతరించుకుంది. మహానేత వైఎస్ హయాంలో నారింజ నీటి నిల్వ కోసం ప్రణాళిక రచించినా ఆ తరువాత జరిగిన పరిణామ క్రమంలో గద్దెనెక్కిన పాలకులు పట్టించుకోలేదు. ఫలితంగా ఇక్కడి రైతులు కన్నీటి సాగు చేస్తుండగా.. జనం తాగు నీటికోసం పరితపిస్తున్నారు. శనివారం ‘సాక్షి’ బృందం నారింజ.. కారంజ ప్రాజెక్టులను సందర్శించగా ఈ భయంకరమైన నిజాలు వెలుగు చూశాయి.

సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి/జహీరాబాద్ టౌన్ : మనం దాచుకోలేక వృథాగా వదిలేసిన వాగు వరద నీటిని పక్క రాష్ట్రం ఒడిసిపట్టుకుంది. పక్కా ప్రణాళికతో కారంజ ప్రాజెక్టు కట్టింది. వేల ఎకరాలకు సాగునీరు... రెండు పెద్ద పట్టణాలకు తాగు నీటిని అందిస్తోంది. ఏడాదికి సగటున 6 టీఎంసీల నీరు మెతుకు సీమ నుంచి కారంజ  ప్రాజెక్టులో చేరుతున్నాయి. కర్ణాటక ప్రభుత్వం చొరవ ఫలితంగా ఆ ప్రాజెక్టు నీటితో కళకళలాడుతోంది. వేసవి రాకముందే పల్లెల గొంతు ఎండిపోతున్న వేళ వాస్తవ పరిస్థితిని అంచనా వేసేందకు ‘సాక్షి’ బృందం శనివారం జహీరాబాద్‌లోని నారింజ వాగు పరీవాహక ప్రాంతంలో పర్యటించింది. కొత్తూరు వద్ద నారింజ ప్రాజెక్టును, కర్ణాటక రాష్ట్రం బీదర్ జిల్లాలోని కారంజ  ప్రాజెక్టులను పరిశీలించింది.

నారింజ నుంచే కారంజకు..

కోహీర్ మండలం బిలాల్‌పూర్‌లో పుట్టిన నారింజ వాగు వర్షాకాలంలో ఉధృతంగా ప్రవహిస్తుంది. ఈ నీరంతా నేరుగా కర్ణాటక రాష్ట్రంలోకి వెళ్లిపోయి తిరిగి మళ్లీ తెలంగాణలోకే వస్తుంది. చిరాగ్‌పల్లి వద్ద మన రాష్ట్ర సరిహద్దును దాటి దాదాపు 25 నుంచి 30 కిలో మీటర్లు ప్రవహించి కర్ణాటకలోని కారంజ ప్రాజెక్టును నింపుతుంది. ప్రాజెక్టు నిండిన తరువాతమళ్లీ తిరిగి జహీరాబాద్‌కే వచ్చి మంజీరలో కలుస్తుంది. వర్షాల ఉధృతిని బట్టి ఏడాదికి కనీసం 5 నుంచి 7 టీఎంసీల నీళ్లు వృథాగా పోయి ఇందులో కలుస్తున్నాయి. ఇరిగేషన్ అధికారుల అంచనా ప్రకారం.. జహీరాబాద్, ఝరాసంగం నేలలు ఎర్ర నేలలు అయినందున ఇక్కడ ఒక్క టీఏంసీ నీటితో 8 వేల ఎకరాలు సాగు చేయవచ్చు. వృథాగా పోతున్న నీటిలో కనీసం సగమైనా అంటే 3 టీఎంసీల నీటినైనా ఆపలిగితే 24 వేల ఎకరాలకు సాగు నీరు అందే అవకాశం ఉంది.

కొత్తూరు రెగ్యులేటరీ..
1970లో జహీరాబాద్ మండలం కొత్తూరు వద్ద రూ.కోటి వ్యయంతో నారింజ వాగుపై రెగ్యులేటరీ బ్రిడ్జిని నిర్మించారు. కనీసం దీన్ని ఆధునికీకరించినా ఎడమ కాలువ కింద ఉన్న కొత్తూరు, బూర్ధిపాడు, బూచినెల్లి, చిరాగ్‌పల్లి, సత్వార్, మిర్జాపూర్, మల్కాపూర్, తదితర గ్రామాలకు రెండు కాలాలకు తాగు, సాగు నీరు అందేది. ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఈ చిన్ననీటి వనరు పూర్తిగా ఎండిపోయింది. పశువులు కూడా నీళ్లు తాగే పరిస్థితి లేదు. చుట్టు పక్కల గ్రామాల ప్రజలు నీటికోసం వ్యవసాయ బావుల వద్దకు వెళ్తున్నారు. ఇంకొన్ని రోజులు పోతే ప్రతి కుటుంబంలో ఒకరికి పూర్తిగా తాగు నీరు మోయడానికే సరిపోతుంది. నాణ్యమైన అల్లం, ఉల్లిగడ్డ, వెల్లుల్లి వంటి వాణిజ్య పంటలు పండే భూములు నీళ్లు లేక బీడుగా మారాయి. సేద్యం మీద మమకారం చంపుకోలేని రైతులు అక్కడక్కడా కంది, మొక్కజొన్న పంటలతో నెట్టుకొస్తున్నారు.

కారంజ కింద పచ్చని పొలాలు..

నారింజ వాగు వరద మీద ఆధార పడే కర్ణాటక ప్రభుత్వం బీదర్ జిల్లా హల్‌హళ్లి ప్రాంతంలో కారంజ ప్రాజెక్టును కట్టింది. మొత్తం 13 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టును నిర్మించారు. అవసరమైతే 0.374 టీఎంసీ డెడ్ స్టోరేజీ వరకు నీటిని వినియోగించుకునే విధంగా డిజైన్ చేశారు. ప్రాజెక్టు డ్యాం గరిష్ట ఎత్తు: 589.15 మీటర్లు కాగా ప్రస్తుతం 578.55 మీటర్ల వద్ద నీటి మట్టం ఉంది. ప్రాజెక్టులో ఏడాది పొడవునా నీళ్లు ఉంటాయి. దీంతో అక్కడ భూగర్భ జలాలు పుష్కలంగా ఉన్నాయి.

అక్కడి రైతులు చెరుకుతోపాటు అల్లం, ఉల్లి, వెల్లుల్లి పంటలు వేశారు. రబీ సీజన్‌కు 14 వేల హెక్టార్లకు సాగు నీటిని అందించాలని అక్కడి ప్రభుత్వం సంకల్పించినా ఈ ఏడాది నారింజ వాగుకు సరిగా వరద నీరు చేరక పోవడంతో కారంజ పూర్తిగా నిండలేదు. అయినప్పటికీ ప్రాజెక్టు కింద  20 వేల ఎకరాల్లో సాగు చేశారు. ప్రాజెక్టు పరీవాహక ప్రాంతంలో చెరుకు, ఉల్లి తోటలు విస్తారంగా కనిపించాయి. భూగర్భ జలాలు పుష్కలంగా ఉండటంతో రైతులు బోర్లు వేసుకొని పంటలు సాగు చేసుకుంటున్నారు. అక్కడి ప్రభుత్వం సాగు కోసం నిరంతరాయంగా ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తోంది.
 
నారింజ నీరు కర్ణాటక రాష్ట్రానికి చేరక ముందే ఒడిసిపట్టుకోవాలని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి 2009లోనే సంకల్పించారు. సర్వే చేసి, వెంటనే ప్రతిపాదనలు పంపాలని ఇరిగేషన్ శాఖ అధికారులను అప్పట్లోనే ఆదేశించారు. పాలన పరమైన సమస్యలు తలెత్తకుండా ఉండేందుకు వైఎస్సార్ అప్పటికప్పుడు నారింజ వాగును మైనర్ ఇరిగేషన్ విభాగం నుంచి మేజర్ ఇరిగేషన్ విభాగానికి బదలాయించారు.

వాగు వద్ద వరద ప్రాంత వైశాల్యం 143.8 స్క్వేర్ మైల్స్, గరిష్ట వరద ప్రవాహం 41.800 క్యూసెక్కులుగా గుర్తించారు.  ఈ లెక్కన నారింజ వాగు నుంచి ఏడాదికి 5 టీఎంసీలకు పైగా నీరు వృథాగా కర్ణాటకకు తరలిపోతోంది.వాగు కర్ణాటకలోకి ప్రవేశించడానికంటే ముందే సింగూరుకు మళ్లిస్తే కనీసం ఒక టీఎంసీ నీటిని జహీరాబాద్ నియోజకవర్గం రైతులకు అందించవచ్చని గుర్తించారు.

వాగును మళ్లించడానికి జహీరాబాద్ మండ లం అల్గోల్ గ్రామం అనువైన ప్రాంతంగా గుర్తించారు. అల్గోల్ గ్రామం నుంచి కాలువ తవ్వకాలు మొదలు పెట్టి ఝరాసంగం మండలం మేదపల్లిలోని కొత్త చెరువులకు కలపాలి. అక్కడి నుంచి జీర్లపల్లి చెరువు మీదుగా దుబ్బ వాగుకు కలపాలి. అక్కడి నుంచి నీటిని సింగూరులోకి మళ్లించాలని ఇంజినీరింగ్ నిపుణులు సూచించారు.

ఈ మొత్తం కాలువ దూరం కేవలం 15.35 కిలోమీటర్లు మాత్రమే ఉంటుందని నిర్ధారించారు.  
     ప్రాజెక్టు పనులు, కాలువ నిర్మాణం కోసం రూ 67.66 కోట్లు వ్యయం అవుతోందని అంచనా వేశారు. ఇలా సిద్ధం చేసిన ప్రతిపాదనలను ఇరిగేషన్ శాఖ అధికారులు వైఎస్సార్ ప్రభుత్వానికి పంపారు. ఆ తరువాత జరిగిన పరిణామంతో ఈ ప్రతిపాదనల ఫైల్ అటకెక్కింది. ఆ తరువాత గద్దెనెక్కిన వారెవరూ నారింజ వాగు వైపు చూడకపోవడంతో ఇక్కడి రైతులు గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు. ఇప్పటికైనా టీఆర్‌ఎస్ సర్కార్ నారింజపై దృష్టిసారించాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు.
 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా