కాపలాదారే హంతకుడు

8 May, 2014 07:45 IST|Sakshi
కాపలాదారే హంతకుడు

 నగల కోసమే దారుణం

 మహిళ హత్య కేసును 24 గంటల్లోనే ఛేదించిన పోలీసులు

 మెహిదీపట్నం, న్యూస్‌లైన్: మహిళ అదృశ్యం...హత్య కేసును పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. అపార్ట్‌మెంటు వాచ్‌మన్‌ను హంతకుడిగా తేల్చారు. బుధవారం వెస్ట్‌జోన్ డీసీపీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం... విశాఖ జిల్లా నర్సీపట్నం సమీపంలోని రోలుగుంటకు చెందిన దుర్గాలమ్మ(58) మధురానగర్ ఎఫ్-బ్లాక్‌లోని సమ్రీనాహైస్ అపార్ట్‌మెంట్ ఉంటూ.. జీటీఎస్ కాలనీలోని ఏపీసీపీడీసీఎల్ ట్రైనింగ్ సెంటర్‌లో స్వీపర్‌గా పనిచేస్తోంది. ఆమె రోజూ మెడలో నగలు ధరించి విధులకు వెళ్తుంటుంది.  దుర్గాలమ్మ నివాసముండే అపార్ట్‌మెంటు వద్ద విశాఖ జిల్లాకు చెందిన పి.సన్యాసిరావు(32) వాచ్‌మన్‌గా పని చేస్తున్నారు. ఇతనికి ఇటీవల సులువుగా డబ్బులు సంపాదించాలనే ఆలోచన వచ్చింది.

ఈనెల 6న ఉదయం 11 గంటలకు దుర్గాలమ్మ విధులు ముగించుకొని తానుండే అపార్ట్‌మెంటు వద్దకు వచ్చింది. మొదటి అంతస్తుకు వెళ్లేందుకు ఆమె లిఫ్ట్‌లోకి వెళ్లగా.. సన్యాసిరావు కూడా వెళ్లాడు. ఆమెను మాటల్లో పెట్టి లిఫ్ట్ 3వ అంతస్తు బటన్ నొక్కాడు. 3వ అంతస్తుకు వెళ్లగానే ఆమె చీరతోనే నొరు నొక్కి.. అదే అంతస్తులో ఖాళీ ఉన్న 301 ఫ్లాట్‌లోకి తీసుకెళ్లాడు. ఒంటిపై ఉన్న 12 తులాల బంగారు నగలు లాక్కొని.. ఆ తర్వాత చీరతో గొంతు బిగించి చంపేశాడు.

మృతదేహాన్ని అదే ఫ్లాట్‌లోని బాత్‌రూంలో దాచాడు. తర్వాత కిందకు వెళ్లి వాచ్‌మన్ విధులు నిర్వహించాడు. విధులకు వెళ్లిన దుర్గాలమ్మ రాత్రి అయినా ఇంటికి తిరిగి రాకపోవడంతో ఆమె కుమారు నూకరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇది గమనించిన నిందితుడు సన్యాసిరావు అర్ధరాత్రి 1 గంటకు దుర్గాలమ్మ మృతదేహాన్ని లిఫ్ట్‌లో 3వ అంతస్తు నుంచి తీసుకెళ్లి అపార్ట్‌మెంటు వెనుక గేటు వద్ద వేశారు.

బుధవారం ఉదయం 5.30కి దుర్గాలమ్మ మృతదేహం వెనుక గేటు వద్ద ఉందని కుటుంబ సభ్యులకు తెలిపాడు. కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు వాచ్‌మన్ సన్యాసిరావుపై అనుమానం వచ్చి విచారించగా నేరం ఒప్పుకున్నాడు. నగలను స్వాధీనం చేసుకొని, అతడిని రిమాండ్‌కు తరలించామన్నారు.

>
మరిన్ని వార్తలు