అక్కడ కళకళ.. ఇక్కడ వెలవెల..

7 Jul, 2017 04:58 IST|Sakshi
అక్కడ కళకళ.. ఇక్కడ వెలవెల..

ఆల్మట్టి, తుంగభద్రకు భారీ ఇన్‌ఫ్లో.. రాష్ట్ర ప్రాజెక్టులకు మాత్రం ఇంకా కరువే
సాక్షి, హైదరాబాద్‌: కృష్ణా బేసిన్‌ ప్రాజెక్టుల్లో నీటి ప్రవాహాలు మొదలయ్యాయి. ఎగువన కర్ణాటకలో భారీగా కురుస్తున్న వర్షాలతో ఆల్మట్టి, తుంగభద్ర ప్రాజెక్టుల్లోకి కొత్త నీరు వచ్చి చేరుతోంది. ఆల్మట్టిలోకి ఏకంగా 29వేల క్యూసెక్కుల పైచిలుకు ప్రవాహం వస్తోంది. అయితే రాష్ట్ర ప్రాజెక్టుల్లో మాత్రం ఎక్కడా పెద్దగా ప్రవాహాలు కానరావడం లేదు. కృష్ణా పరివాహకంలో గడిచిన పదిహేను రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఎగువన ఉన్న ఆల్మట్టికి భారీ ఇన్‌ఫ్లో వస్తోంది. ఆల్మట్టి వాస్తవ నీటి మట్టం 1,705 అడుగులు కాగా ప్రస్తుతం 1,675.2 అడుగుల్లో నీటి లభ్యత ఉంది. ఈ ప్రాజెక్టులో 129.7 టీఎంసీలకు గాను గురువారం ఉదయానికి 33.7 టీఎంసీల నిల్వ ఉంది.

ఇక తుంగభద్ర ప్రాజెక్టులో 11,506 క్యూసెక్కుల నీటి ప్రవాహం నమోదైంది. ఇక్కడ ప్రాజెక్టు నిల్వ సామర్థ్యం 100 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 8.64 టీఎంసీల నీటి లభ్యత ఉంది. కాగా, ఆల్మట్టికి ప్రవాహం మరింత పెరిగి, ప్రాజెక్టునిండితేనే దిగువ నారాయణఫూర్‌కు ఇన్‌ఫ్లో ఉంటుంది. ఈ ప్రాజెక్టులో 37.64 టీఎంసీల నిల్వ సామర్థ్యానికి గానూ 14.87 టీఎంసీల లభ్యత ఉంది. ఈ ప్రాజెక్టు నిండితేనే దిగువ జూరాలకు ప్రవాహం మొదలవుతుంది. కాగా రాష్ట్ర పరిధిలోని జూరాల, శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో ఎక్కడా ప్రవాహాలు లేవు. జూరాలకు రెండు రోజుల కిందటి వరకు ప్రవాహాలున్నా అవి గురువారానికి తగ్గిపోయాయి.

మరిన్ని వార్తలు