రబీలో పూర్తి ఆయకట్టుకు నీరు

3 Nov, 2017 01:53 IST|Sakshi

ఎస్సారెస్పీ కింద ఇస్తాం: మంత్రి హరీశ్‌ రావు

తాగు నీటి అవసరాలకే మిడ్‌ మానేరుకు 5 టీఎంసీల నీరు  

2, 3 నెలల్లో మిడ్‌మానేరును జాతికి అంకితం చేస్తామని ప్రకటన

మిడ్‌మానేరుకు నీటిని తరలిస్తే ఎస్సారెస్పీలో కొరత: టి.జీవన్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: శ్రీరాంసాగర్‌ కింది ఆయకట్టుకు ఈ ఏడాది రబీలో పూర్తి స్థాయిలో నీరందించేందుకు నిర్ణయించామని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. సింగూరులో పూర్తి స్థాయిలో నీటి లభ్యత ఉందని, ఈ ప్రాజెక్టు నుంచి నిజాంసాగర్‌ ద్వారా ఎస్సారెస్పీకి నీటిని విడుదల చేస్తామన్నారు. గురువారం శాసనసభలో కాంగ్రెస్‌ సభ్యుడు టి.జీవన్‌రెడ్డి ప్రశ్నోత్తరాల సమయంలో ఎస్సారెస్పీ అంశాన్ని ప్రస్తావించారు.

ఎస్సారెస్పీలో అదనపు నీరు ఉంటేనే వరద కాల్వ ద్వారా మిడ్‌మానేరుకు నీటిని తరలించాలని, కానీ ప్రభుత్వం ఎస్సారెస్పీ నిండకుండానే 12 టీఎంసీల నీటిని మిడ్‌మానేరుకు తరలిస్తుండటంతో ఎస్సారెస్పీకి కొరత ఏర్పడుతోందని, ఈ నేపథ్యంలో రబీకి నీరెలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. దీనికి మంత్రి సమాధానమిస్తూ, మిడ్‌మానేరు ద్వారా సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి నియోజకవర్గాలలో 18 మండలాల్లో 466 గ్రామాలకు తాగునీరు అందించనున్నామని, అందుకు వీలుగానే 5 టీఎంసీల నీటిని తరలించామని తెలిపారు. సాగు, పారిశ్రామిక తదితర అవసరాలకన్నా తాగునీటి అవసరాలకే అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని అంతర్జాతీయ సూత్రాలు చెబుతున్నాయని గుర్తు చేశారు.  

మిడ్‌మానేరుకోసం రూ.461 కోట్లు ఖర్చు చేశాం..  
ఈ సందర్భంగా మిడ్‌మానేరు ప్రాజెక్టు పరిధిలో గత, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో జరిగిన పనులపై మంత్రి హరీశ్‌ వివరణ ఇచ్చారు. ‘మిడ్‌ మానేరు ప్రాజెక్టు తెలంగాణకు గుండె కాయ. ఈ ప్రాజెక్టుకు 2006లో టెండర్లు పిలిచారు. కానీ ఎనిమిదిన్నర ఏళ్లలో రూ.106 కోట్లు మాత్రమే ఖర్చు చేశారు. ఈ మూడేళ్ళలో మేము రూ.461 కోట్లు ఖర్చు చేసి యుద్ధ ప్రాతిపదికన పనులు పూర్తయ్యేలా చర్యలు తీసుకున్నాం.

ప్రాజెక్టులో మొత్తం కాంక్రీటు వర్కు 4.8 లక్షల క్యూబిక్‌ మీటర్లు కాగా 2006 నుంచి 50 వేల క్యూబిక్‌ మీటర్లు పని చేశారు. తెలంగాణ వచ్చిన తర్వాత 4.10 లక్షల క్యూబిక్‌ మీటర్ల పనిచేశాం. ప్రాజెక్టు కోసం 25 గేట్లు కూడా సిద్ధమయ్యాయి. రెండు, మూడు నెలల్లో గేట్లు బిగించి ప్రాజెక్టును జాతికి అంకితం చేస్తాం. ప్రాజెక్టును సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ నిత్యం పర్యవేక్షిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2లక్షల ఎకరాలకు సాగునీరందిస్తాం’అని మంత్రి తెలిపారు.

పర్యాటకరంగం అభివృద్ధికి చర్యలు
రాష్ట్రంలో పర్యాటక రంగాభివృద్ధికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక దృష్టి సారించారని మంత్రి ఈటల రాజేందర్‌ తెలిపారు. అసెంబ్లీలో సభ్యులు దాస్యం వినయ్‌భాస్కర్, జి.చిన్నారెడ్డి, గీతారెడ్డిలు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చారు. పర్యాటక రంగంలో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా తీర్చిదిద్దుతామన్నారు.

రూ.140 కోట్లతో మహబూబ్‌నగర్‌ జిల్లాలో టూరి జం అభివృద్ధి చర్యలు చేపట్టినట్లు చెప్పారు. విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. బతుకమ్మ పండుగలో విదేశీయులు కూడా పెద్ద ఎత్తున పాల్గొంటున్నారన్నారు. భారీ వ్యయంతో యాదాద్రి అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి సభకు వివరించారు.

సరోగసీపై చట్టం చేయండి
రాష్ట్రంలో సరోగసీపై ప్రత్యేకచట్టం తేవాలని కాంగ్రెస్‌ సభ్యులు జి.చిన్నారెడ్డి, గీతారెడ్డి, పద్మావతిలు డిమాండ్‌ చేశారు. అద్దెగర్భాల ద్వారా కొన్ని ఆస్పత్రులు చేస్తున్న అక్రమ వ్యాపారాన్ని నిలువరించాలని వారు ప్రశ్నోత్తరాల సందర్భంగా ప్రభుత్వాన్ని కోరారు.

దీనిపై వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి స్పందిస్తూ, సరోగసిపై నిబంధనలు రూపొందించడం కోసం రిటైర్డ్‌ జడ్జి గోపాల్‌రెడ్డి నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా వాణిజ్య సరోగసి నిర్వహించినందుకు బంజారాహిల్స్‌ సాయికిరణ్‌ ఆస్పత్రిపై క్రిమినల్‌ కేసు పెట్టినట్లు మంత్రి వెల్లడించారు. కాగా, రాష్ట్రంలో ప్రైవేటు డెయిరీ వ్యాపారులు పాల కల్తీకి పాల్పడుతున్నారని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్‌ సభ దృష్టికి తెచ్చారు. 

మరిన్ని వార్తలు