వాటర్‌గ్రిడ్ మాస్టర్‌ప్లాన్ రెడీ!.

24 Nov, 2014 01:05 IST|Sakshi
వాటర్‌గ్రిడ్ మాస్టర్‌ప్లాన్ రెడీ!.

సాక్షి, హైదరాబాద్: గ్రేటర్‌లో రాబోయే నాలుగేళ్లలో ఇంటింటికీ నల్లా కనెక్షన్ మంజూరుకు ఉద్దేశించిన వాటర్‌గ్రిడ్ పథకం అంచనాలు సిద్ధమయ్యాయి. సుమారు కోటి జనాభాకు చేరువైన మహానగర దాహార్తిని తీర్చేందుకు వెయ్యి చదరపు కిలోమీటర్ల పరిధిలో మంచినీటి సరఫరా పైప్‌లైన్ గ్రిడ్ ఏర్పాటుకు రూ.13,495 కోట్ల అంచనా వ్యయంతో జలమండలి సమగ్ర ప్రతిపాదనలు సిద్ధంచేసింది. వీటికి సీఎం కేసీఆర్ ఆమోదం తెలిపితే పథకం పనులు మొదలుకానున్నాయి. గ్రిడ్‌కు సంబంధించిన ప్రాథమిక కసరత్తును జలమండలి పూర్తిచేసింది.

ఇందుకోసం ఓ మాస్టర్‌ప్లాన్ ప్రణాళిక చిత్రపటాన్ని కూడా రూపొందించింది. గ్రిడ్ పరిధిలో ఏర్పాటు చేయాల్సిన పైప్‌లైన్లు, స్టోరేజీ రిజర్వాయర్లు, పంపింగ్ స్టేషన్లు, గ్రావిటీ ఆధారంగా నీటిసరఫరా తదితర అంశాలపై సమగ్ర డిజైనింగ్, డ్రాయింగ్‌లు పూర్తిచేసే సాంకేతిక పనులను ప్రముఖ సివిల్ ఇంజినీరింగ్ కన్సల్టెన్సీకి అప్పగించాలని నిర్ణయించింది. అయితే గ్రేటర్ వాటర్‌గ్రిడ్ ముఖచిత్రంపై త్వరలో ముఖ్యమంత్రి సమక్షంలో ఉన్నతస్థాయి సమీక్షాసమావేశం జరగనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ సమావేశంలో గ్రిడ్ కార్యాచరణకు శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం.

తీరనున్న శివార్ల దాహార్తి ...
గ్రేటర్‌లో విలీనమైన పలు శివారు మున్సిపాల్టీల్లో ప్రస్తుతం మంచినీటి సరఫరా తీరును పరిశీలిస్తే...శేరిలింగంపల్లిలో కేవలం 30 శాతం ప్రాంతాలకే నీటి సరఫరా పైప్‌లైన్ నెట్‌వర్క్ ఉంది. రాజేంద్రనగర్‌లో 45 శాతం, కుత్భుల్లాపూర్‌లో 50 శాతం, మల్కాజ్‌గిరిలో 65 శాతం, కూకట్‌పల్లిలో 70 శాతం, ఉప్పల్‌లో 82.5 శాతం, ఎల్బీనగర్‌లో 85 శాతం, కాప్రాలో 85 శాతం, అల్వాల్‌లో 90 శాతం ప్రాంతాలకే మంచినీటి సరఫరా నెట్‌వర్క్ ఉంది. ఈనేపథ్యంలో మిగతా ప్రాంతాల్లో పైప్‌లైన్ నెట్‌వర్క్ విస్తరణ, స్టోరేజి రిజర్వాయర్లు, పంప్‌హౌజ్‌ల నిర్మాణానికి ఈ గ్రిడ్ పథకంలో స్థానం కల్పించడం విశేషం.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు