రెండేళ్లలోనే వాటర్ గ్రిడ్!

1 Jan, 2015 02:58 IST|Sakshi

ప్రాజెక్టును పూర్తి చేసేందుకు సన్నద్ధం కావాలి  
అధికారులను ఆదేశించిన సీఎం కేసీఆర్
 
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టును రెండేళ్లలో పూర్తి చేసేందుకు సన్నద్ధం కావాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు గ్రామీణ నీటి సరఫరా(ఆర్‌డబ్ల్యూఎస్) విభాగం అధికారులను ఆదేశించారు. పక్కా ప్రణాళికతో పాటు అధికారులు, సిబ్బంది కలసి చిత్తశుద్ధితో పనిచేస్తే గడువులోగా ఈ ప్రాజెక్టును పూర్తి చేయడం సాధ్యమేనన్నారు. రాష్ట్ర ప్రజలందరికీ సురక్షిత మంచినీరు అందించడం ద్వారా అందరి ఆరోగ్యాన్ని పరిరక్షించాలనే ఆశయం కూడా నెరవేరుతుందని పేర్కొన్నారు.
 
 తెలంగాణ వాటర్‌గ్రిడ్ నీటి వనరుల గుర్తింపు, అలైన్‌మెంట్ ఖరారు, ట్రీట్‌మెంట్ ప్లాంట్ల స్థాపన తదితర అంశాలపై బుధవారం క్యాంపు కార్యాలయంలో సీఎం అధికారులతో సమీక్షించారు. సమీక్షా సమావేశంలో మంత్రులు కె.తారక రామారావు, జగదీశ్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, పంచాయతీరాజ్ కార్యదర్శి రేమండ్ పీటర్, గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు సురేందర్‌రెడ్డి, బాబురావు, చక్రపాణి, ప్రభుత్వ సలహాదారు ఉమాకాంత్‌రావు తదితరులు పాల్గొన్నారు.
 
 భౌగోళిక స్థితి ఆధారంగా..: వివిధ జిల్లా ల్లో భౌగోళిక పరిస్థితులు, జనాభా అధారంగా ఎక్కడికక్కడే గ్రిడ్ పనుల కోసం ప్రణాళికలు తయారు చేయాలని అధికారులకు సీఎం సూచించారు. వాటర్ గ్రిడ్ మొత్తం ‘గ్రావిటీ క మ్ లిఫ్ట్’ పద్ధతిలో ఉండాలన్నారు. నీటిని శుద్ధి చేశాకే గుట్టలపైకి పంపాలని, రివర్స్ ఇంజనీరింగ్ మాదిరి.. గుట్టపైకి పంపిన నీటిని గ్రావిటీ ద్వారా మళ్లీ కిందకు పంపి జనావాసాలకు నీరందించాలన్నారు.
 
 రెండు లేదా మూడు నియోజకవర్గాలకు ఒకటి చొప్పున ట్రీట్‌మెంట్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని సూచించారు. నీటిని పంపింగ్ చేసేందుకు ఎంత విద్యుత్ అవసరం, ఎక్కడెక్కడ సబ్‌స్టేషన్లు నిర్మించాలి తదితర అంశాలపై వెంటనే అంచనాలు రూపొందించాలని ఆదేశించారు. వాటర్ గ్రిడ్ పనులకు సమాంతరంగా విద్యుత్ పనులు కూడా నిర్వహించాలన్నారు.
 
 సాగునీటి ప్రాజెక్టుల్లో 10 శాతం నీటిని మంచినీటి కోసమే కేటాయించాలని స్పష్టంచేశారు. వాటర్ గ్రిడ్‌కు నీటి కొరతగానీ, నిధుల కొరతగానీ లేదన్నారు. రిజర్వాయర్లలోని నీటిని మంచినీటి గ్రిడ్ల కోసం వాడుకోవడానికి అనుమతిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని వివరించారు. ఖమ్మం జిల్లాలో దుమ్ముగూడెం ఆనీకట్ పెంచే అవకాశాలను పరిశీలించాలని అధికారులను సీఎం ఆదేశించారు.
 
 8 గంటల పాటు సమీక్ష..: వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై కేసీఆర్ గత రెండ్రోజులుగా సుదీర్ఘం గా సమీక్ష జరిపారు. మంగళవారం కొన్ని అంశాలపై చర్చించిన సీఎం బుధవారం మిగిలిన అంశాలపై ఏకంగా ఎనిమిది గంటలపాటు సమీక్షించడం విశేషం. సమీక్షలో ప్రధానంగా.. ప్రతి జిల్లా, ప్రతి నియోజకవర్గంలో గ్రిడ్ పనులు ఎలా నిర్వహించాలి, ఎక్కడెక ్కడ ట్రీట్‌మెంట్ ప్లాంట్లు ఏర్పాటు చేయాలి, ఏఏ వనరుల నుంచి నీటిని తీసుకోవాలి, సమీపంలో ఉన్న గుట్టలు ఏంటి, ఎన్ని మీటర్ల మేర నీటిని లిఫ్టు చేయాలి తదితర అంశాలపై అధికారులకు సూచనలు చేశారు. కాంటూర్ ఎత్తులు గుర్తించి ఏవేవి వాటర్ గ్రిడ్లకు ఉపయోగ కరమో నిర్ధారించారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు