దోచుకోవడానికే వాటర్‌గ్రిడ్

3 Apr, 2015 02:15 IST|Sakshi
దోచుకోవడానికే వాటర్‌గ్రిడ్

 సాక్షి, హైదరాబాద్: ప్రజల సొమ్మును దోచుకోవడానికే టీఆర్‌ఎస్ ప్రభుత్వం వాటర్‌గ్రిడ్ పథకానికి రూపకల్పన చేసినట్లు కనిపిస్తోందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ దిగ్విజయ్‌సింగ్ ఆరోపించారు. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, శాసనసభలో కాంగ్రెస్‌పక్ష నేత నేత కె.జానారెడ్డి, మండలిలో ప్రతిపక్ష నేత షబ్బీర్ అలీ, పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్కతో కలసి గాంధీభవన్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికలకు ముందు టీఆర్‌ఎస్ ఇచ్చిన హామీలను అమలు చేయడంలో పూర్తిగా విఫలమైందని దిగ్విజయ్‌సింగ్ దుయ్యబట్టారు. దళితులకు మూడెకరాల భూమి, కేజీ టు పీజీ ఉచిత విద్య, పేదలకు డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఎస్టీలు, ముస్లింలకు 12 శాతం రిజర్వేషన్ల వంటి ఎన్నో హామీలను అమలు చేయలేదన్నారు.

ఇలాంటి హామీలను విస్మరించి కేవలం వాటర్‌గ్రిడ్ పథకానికే ప్రాధాన్యత ఇస్తున్నారని మండిపడ్డారు. ముందుగా రూ. 27 వేల కోట్లతో పూర్తవుతుందని చెప్పి ఇప్పుడు వాటర్‌గ్రిడ్‌కు రూ. 40 వేల కోట్లు అవసరం అవుతుందని చెప్పడం వెనుక కారణాలు ఏమిటని ఆయన ప్రశ్నించారు. వాటర్‌గ్రిడ్‌లో అక్రమాలకు అవకాశాలున్నాయని దిగ్విజయ్‌సింగ్ వ్యాఖ్యానించారు. మొత్తం రాష్ట్ర ప్రభుత్వంలో ఒక కుటుంబమే ఆధిపత్యం చెలాయిస్తున్నదని, మంత్రివర్గంలో మిగిలిన వారంతా నామమాత్రంగా మిగిలిపోయారని విమర్శించారు. కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీపై కేంద్రమంత్రి గిరిరాజ్‌సింగ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను దిగ్విజయ్ ఖండించారు. రైతుల హక్కులు, ప్రయోజనాలను దెబ్బతీసేలా కేంద్ర ప్రభుత్వం తెచ్చిన భూసేకరణ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఈ నెల 19న ఢిల్లీలో రైతులతో ప్రదర్శన నిర్వహించనున్నట్లు దిగ్విజయ్ తెలిపారు. రాష్ట్రంలోనూ టీఆర్‌ఎస్ అనుసరిస్తున్న రైతు వ్యతిరేక విధానాలపైనా, భూసేకరణ చట్టంపైనా ప్రదర్శన నిర్వహిస్తామన్నారు. కాగా, పార్టీ ముఖ్యనేతలతో గాంధీభవన్‌లో సమావేశమైన దిగ్విజయ్ సభ్యత్వ కార్యక్రమంపై సమీక్షించారు. ఉత్తమ్ మాట్లాడుతూ ఈ నెల 30కల్లా పూర్తిస్థాయి సభ్యత్వ పుస్తకాలతోపాటు కంప్యూటర్ సీడీలను కార్యాలయంలో అందించాలనిసూచించారు.


 అసంతృప్త ఎమ్మెల్సీలతో భేటీ...
 శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా షబ్బీర్ అలీ నియామకం తీరుపై అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, రంగారెడ్డి, సంతోష్ కుమార్ తదితరులు దిగ్విజయ్‌ను కలిశారు. షబ్బీర్ అలీకి వ్యక్తిగతంగా తాము వ్యతిరేకం కాకున్నా పార్టీ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడాల్సి వస్తోందని వారు పేర్కొన్నట్లు తెలిసింది. తమను విశ్వాసంలోకి తీసుకుని నిర్ణయం తీసుకొని ఉంటే ఈ సమస్య వచ్చేది కాదని దిగ్విజయ్‌కు పొంగులేటి వివరించినట్టుగా తెలిసింది. దీనికి దిగ్విజయ్ బదులిస్తూ షబ్బీర్ అలీ నియామకం తాత్కాలిక నిర్ణయమేనని చెప్పారు. శాసనమండలిలో ఖాళీగా ఉన్న ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు పూర్తయిన తర్వాత మరోసారి అంతర్గతంగా ఎన్నికలు నిర్వహించుకుందామని హామీని ఇచ్చినట్టుగా తెలిసింది. ఈ చర్చలన్నీ ఉత్తమ్, భట్టి, షబ్బీర్ అలీ సమక్షంలోనేజరిగినట్లు సమాచారం.

మరిన్ని వార్తలు