నట్టింట్లోకి నల్లా

25 Sep, 2014 23:27 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి : గుక్కనీటికోసం తండ్లాడుతున్న మెతుకుసీమ వాసుల కష్టాలు తీర్చేందుకు సర్కార్ సన్నద్ధమైంది. ప్రతి పల్లెకు రక్షిత మంచినీరు అందించాలన్న సీఎం కేసీఆర్ సంకల్పానికి అనుగుణంగా జిల్లాలోని అన్ని ప్రాంతాలకు రక్షిత మంచినీటిని అందించేందుకు వీలుగా జిల్లా వాటర్‌గ్రిడ్ ఏర్పాటుకు అధికారులు ప్రణాళిక తయారు చేస్తున్నారు. ఆర్‌డబ్ల్యూఎస్ ఎస్‌ఈ విజయ్ ప్రకాశ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో తయారవుతున్న జిల్లా వాటర్‌గ్రిడ్  డీపీఆర్ (డిటెల్డ్ ప్రాజెక్టు రిపోర్టు) మరో వారంరోజుల్లో సిద్ధం కానుంది.

 ప్రతి వ్యక్తికి రోజుకు 100 నుంచి 70 లీటర్ల నీటిని సరఫరా చేసేందుకు వీలుగా సుమారు రూ.3,500 కోట్ల
 వ్యయంతో జిల్లా వాటర్ గ్రిడ్ ప్రణాళికను అధికారులు రూపొందిస్తున్నారు. మెదక్ జిల్లాలోని పది నియోజవకర్గాలతోపాటు రంగారెడ్డి జిల్లాలోని చేవెళ్ల, వికారాబాద్ నియోజకవర్గాలకు సైతం తాగునీటి సరఫరా అందించేందుకు వీలుగా వాటర్‌గ్రిడ్ ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. మొత్తం మూడు దశల్లో వాటర్ గ్రిడ్‌ను ఏర్పాటు చేసేందుకు అధికారులు సమాయత్తమవుతున్నారు. వాటర్‌గ్రిడ్ కోసం సింగూరు నుంచి సుమారు 9 టీఎంసీల మంజీర జలాలు అవసరమవుతాయని అంచనా.

సింగూరు ప్రాజెక్టు నుంచి మంజీరా జలాల కేటాయింపుపై ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు త్వరలో నీటిపారుదలశాఖ అధికారులతో సమావేశం కానున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సొంత జిల్లా కావటం, భారీనీటిపారుదల శాఖా మంత్రి హరీష్‌రావు సైతం మెదక్ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహిస్తుండటంతో వాటర్‌గ్రిడ్‌కు మంజీర జలాల కేటాయింపులో సమస్యలు తలెత్తకపోవచ్చని అధికారులు చెబుతున్నారు.

 మూడు దశల్లో వాటర్‌గ్రిడ్
 జిల్లాలో మూడు దశల్లో వాటర్‌గ్రిడ్ ఏర్పాటు కానుంది. మొదట మెయిన్ గ్రిడ్ ఆ తర్వాత మండలాల్లో సబ్‌గ్రిడ్‌ను ఏర్పాటు చేస్తారు. సబ్‌గ్రిడ్ నుంచి గ్రామాలకు పైప్‌లైన్‌లు వేసి ఆతర్వాత పల్లెల్లో ఇంటింటికి తాగునీటి కనెక్షన్‌లు ఇస్తారు. వాటర్‌గ్రిడ్ ద్వారా జిల్లాలోని 2,456 గ్రామాలు, ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలకు తాగునీటిని సరఫరా చేసేందుకు అధికారులు ప్రణాళికను రూపొందిస్తున్నారు.

జిల్లాలో ప్రస్తుతం 28 తాగునీటి పథకాల ద్వారా 822 గ్రామాల్లోని 10.71 లక్షలకుపైగా జనాభాకు తాగునీటి సరఫరా చేస్తున్నారు. మరో 842 గ్రామాలకు తాగునీరు అందించేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ పథకాలను సిద్ధం చేస్తోంది. ఇంకా 792 గ్రామాలకు తాగునీరు సరఫరా చేయాల్సి ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న తాగునీటి పథకాలు, నిర్మాణంలో ఉన్న పథకాలతోపాటు మొత్తం జిల్లాలోని 2,456 గ్రామాల్లోని 26.95 లక్షల మంది జనాభాకు వాటర్‌గ్రిడ్ ద్వారా రక్షిత మంచినీటి సరఫరా చేయనున్నారు.

 ప్రత్యేక అధికార వ్యవస్థ  
 జిల్లా వాటర్‌గ్రిడ్ నిర్మాణం, నిర్వహణ నిర్వహణ పనుల కోసం ప్రత్యేకంగా జిల్లా స్థాయిలో సూపరింటెండెంట్ ఇంజనీరును నియమించటంతోపాటు ఐదుగురు ఈఈలు, రెండు మండలాలకు ఒకరు చొప్పున డిప్యూటీ డీఈలు మండలానికి ఒకరు చొప్పున ఏఈ, ఇద్దరు వర్క్‌ఇన్‌స్పెక్టర్లు ఏర్పాటు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రభుత్వానికి సూచించనున్నారు.

మరిన్ని వార్తలు