ఎల్లంపల్లి ఎండుతోంది .!

1 May, 2018 01:48 IST|Sakshi
ఎల్లంపల్లిలో తగ్గిన నీటి మట్టం

     6.9 టీఎంసీలకు పడిపోయిన నీటి మట్టం

     గత సంవత్సరం ఇదేరోజు 10 టీఎంసీల కెపాసిటీ 

     హైదరాబాద్‌కు 248 క్యూసెక్కులు 

     ఎన్టీపీసీకి 242 క్యూసెక్కుల నీటి సరఫరా

     సింగరేణికి సోమవారం 400 క్యూసెక్కుల నీరు విడుదల 

     గూడెం లిఫ్ట్‌కు 290, వేమునూరుకు 250 క్యూసెక్కులు నిలిపివేత

     మరో 60 రోజుల వరకు ఈ నీటితోనే గడపాల్సిన పరిస్థితి

సాక్షి ప్రతినిధి, మంచిర్యాల: సాగునీటితో పాటు హైదరాబాద్‌కు తాగునీరు అందిస్తున్న శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టులో నీటి మట్టం రోజురోజుకు తగ్గుతోంది. 20.175 టీఎంసీల పూర్తి సామర్థ్యం గల ఈ ప్రాజెక్టులో సోమవారం ఉదయం 8 గంటలకు 6.980 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రతిరోజు 1,300 క్యూసెక్కుల నీరు ఈ ప్రాజెక్టు నుంచి బయటకు వెళుతుండటంతో వేగంగా నీటి మట్టం తగ్గుతోంది. దీంతో ఇప్పటికే గూడెం లిఫ్ట్‌కు సరఫరా చేసే 290 క్యూసెక్కుల నీటిని ఈనెల 26 నుంచి నిలిపివేసిన ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు సోమవారం పెద్దపల్లి జిల్లా పాలకుర్తి మండలం వేమునూరు పంప్‌హౌస్‌కు నీటి సరఫరాను ఆపేశారు. ఈ పంప్‌హౌస్‌కు ప్రతిరోజు 500 క్యూసెక్కుల వరకు నీటిని సరఫరా చేసే అధికారులు 26వ తేదీ నుంచి 250 క్యూసెక్కులకు తగ్గించి సోమవారం పూర్తిగా నిలిపివేశారు. హైదరాబాద్, ఎన్టీపీసీ, సింగరేణికి నీటి సరఫరాలో ఆటంకం కలగకుండా ఉండేందుకే గూడెం, వేమునూరులకు నీటిని నిలిపివేసినట్లు అధికారులు చెబుతున్నారు.  

హైదరాబాద్‌కు నీటి కష్టాలు తప్పవా..? 
ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా వ్యవసాయానికన్నా హైదరాబాద్‌ తాగునీటి అవసరాలు తీర్చేందుకే అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. నేరుగా ఎల్లంపల్లి నుంచి హైదరాబాద్‌ మెట్రో వాటర్‌బోర్డుకు ప్రతిరోజు 248 క్యూసెక్కుల నీటిని సరఫరా చేస్తున్నారు. ఎన్టీపీసీకి 242 క్యూసెక్కులు, సింగరేణికి అవసరాన్ని బట్టి 225 క్యూసెక్కుల నుంచి 400 క్యూసెక్కుల వరకు విడుదల చేస్తున్నారు. కొద్దిరోజులుగా 90 క్యూసెక్కుల నీటిని విడుదల చేసిన అధికారులు ఆదివారం 400 క్యూసెక్కులు రిలీజ్‌ చేయడం గమనార్హం. ఈ పరిస్థితుల్లో ఎల్లంపల్లిలో గోదావరి నీటిమట్టం అతివేగంగా తగ్గే అవకాశం ఉంది. ఎగువన మహారాష్ట్రలో వర్షాలు కురిసి ఎల్లంపల్లికి నీరు రావడం జూన్‌ నెలాఖరు వరకు గానీ ప్రారంభమయ్యే పరిస్థితి లేదు. అంటే ఇంకా రెండు నెలల పాటు ఈ 6.8 టీఎంసీల నీటిని కాపాడుకోవలసి ఉంది. హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ బోర్డుకు కృష్ణా, ఎల్లంపల్లితో పాటు అక్కంపల్లి (కృష్ణా), మంజీరా, సింగూరు, హిమాయత్‌సాగర్, ఉస్మాన్‌సాగర్‌ నుంచి ప్రతిరోజు 516 మిలియన్‌ గ్యాలన్ల నీరు (ఎంజీడీ) అవసరం కాగా ప్రస్తుతం 387 ఎంజీడీలు మాత్రమే సరఫరా అవుతోంది. అందులో 86 ఎంజీడీ ఎల్లంపల్లి నుంచే సరఫరా కావలసి ఉంది. ఎల్లంపల్లి నీటి మట్టం ఇదే వేగంతో తగ్గితే హైదరాబాద్‌కు నీటి కష్టాలు తప్పవని ప్రాజెక్టు అధికారులు చెపుతున్నారు.

భగీరథకు తప్పని తిప్పలు
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేయాలని భావిస్తున్న మిషన్‌ భగీరథకు ఎల్లంపల్లి ప్రాజెక్టు ద్వారా సరఫరా అయ్యే నీరే ప్రధానం. మంచిర్యాల, పెద్దపల్లి, జగిత్యాల, భూపాలపల్లి, సిరిసిల్ల, సిద్ధిపేట జిల్లాలలోని అనేక గ్రామాలకు మిషన్‌ భగీరథ కింద ఎల్లంపల్లి నీటిని సరఫరా చేయనున్నారు. ఈ మేరకు ఫిల్టర్‌బెడ్స్, పంప్‌హౌస్‌లు ఏర్పాటు చేశారు కూడా. మంచిర్యాల జిల్లాలోని మూడు నియోజకవర్గాలకు మిషన్‌ భగీరథ పథకం కింద ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచే నీటి సరఫరా చేస్తున్నారు. ఈ మేరకు ట్రయల్‌ రన్‌ కూడా పూర్తయింది. అయితే ఇప్పుడు నీటి కొరత ఏర్పడి పాత పంప్‌హౌస్‌ నుంచి మంచిర్యాల మునిసిపాలిటీకి కూడా నీళ్లు ఇవ్వలేని పరిస్థితి నెలకొంది. ఎల్లంపల్లి బ్యాక్‌ వాటర్‌ ద్వారా వేమునూరు గ్రామం వద్ద పంప్‌హౌస్‌ ఏర్పాటు చేశారు. ఇక్కడి నుంచి సాగునీరుతో పాటు సమీప గ్రామాలకు మిషన్‌ భగీరథ నీటి సరఫరా కూడా జరగనుంది. సోమవారం నుంచి వేమనూరుకు కూడా నీటిని నిలిపివేశారు.

గత ఏడాదితో పోలిస్తే వేగంగా తగ్గిన నీటి మట్టం
ఎల్లంపల్లి ప్రాజెక్టులో గత సంవత్సరం ఏప్రిల్‌ 30వ తేదీకి 10.860 టీఎంసీల నీరు నిల్వ ఉండగా సరిగ్గా ఏడాదికి సోమవారం నాడు 6.980 టీఎంసీలకు పడిపోయింది. అంటే గత ఏడాది కన్నా 4 టీఎంసీల లోటు. ఇప్పటి వరకు రెండు నెలలుగా ప్రతి రెండు వారాలకు 3 టీఎంసీల చొప్పున నీటి మట్టం తగ్గుతూ రావడంతో జగిత్యాల జిల్లా ధర్మపురి ఎగువ వరకు నిల్వ ఉన్న గోదావరి నీరు వెనక్కు వెళ్లిపోయింది. ప్రాజెక్టు వద్ద నీటి మట్టం 148 మీటర్ల నుంచి 141 మీటర్లు తగ్గింది. మంచిర్యాలకు నీటి సరఫరా చేసే పంప్‌హౌస్‌ కూడా బయటకు తేలిపోయింది. దీంతో మంచిర్యాల మునిసిపాలిటీకి నీటి సరఫరా రెండు రోజులకోసారి జరుగుతోంది. ఈ పరిస్థితుల్లో ఎల్లంపల్లి నుంచి నీటిని పొదుపుగా విడుదల చేయాలని ఎల్లంపల్లి ప్రాజెక్టు అధికారులు భావిస్తున్నారు.

మరిన్ని వార్తలు