నీటి కోసం బిందెలతో రోడ్డెక్కిన మహిళలు

14 May, 2019 08:02 IST|Sakshi
గోపన్‌పల్లిలోని ప్రధాన రహదారిపై బిందెలు, బకెట్లతో రోడ్డుపై నిరసన తెలిపిన రాజీవ్‌నగర్‌ మహిళలు

గోపన్‌పల్లిలో గంటన్నరపాటు ట్రాఫిక్‌ జామ్‌

పోలీసులు, జలమండలి అధికారుల జోక్యంతో విరమణ

రాయదుర్గం: నీటి సమస్య తీర్చాలని కోరుతూ గోపన్‌పల్లి రాజీవ్‌నగర్‌ మహిళలు బిందెలతో రోడ్డెక్కిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. రోడ్డుపై బిందెలు, బకెట్లు వరుసగా పెట్టి నిరసన తెలుపడంతో ఇరువైపులా గంటన్నరపాటు వాహనాలు నిలిచిపోవడంతో ట్రాఫిక్‌ జామ్‌ అయింది. విషయం తెలియడంతో చందానగర్‌ పోలీసులు, గచ్చిబౌలి జలమండలి అధికారులు జోక్యం చేసుకోవడంతో వివాదం సద్దుమణిగింది. ఇందుకు సంబధించిన వివరాలు ఇలా ఉన్నాయి. గోపన్‌పల్లిలోని రాజీవ్‌నగర్‌లో నాలుగు నెలల క్రితం తాగునీటి పైప్‌లైన్లు వేసి ఇంటింటికి కుళాయి కనెక్షన్‌ ఇవ్వడంతో కేవలం 30 ఇళ్లకు మాత్రమే నీటి కుళాయి కనెక్షన్లు తీసుకున్నారు. మిగతావారు ఇప్పటి వరకు తీసుకోలేదు.

కాగా ఇటీవలి వరకు బోరు పని చేసినా అది కూడా వట్టిపోవడంతో నీటి సమస్య ఎదురైంది. దీంతో మహిళలు బిందెలు, బకెట్లు పట్టుకొని ప్రధాన రోడ్డుపైకి వచ్చి రోడ్డుకు అడ్డంగా బిందెలు, బకెట్లు పెట్టి వాహనాలను నిలిపివేశారు. దీంతో గంటన్నరపాటు ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడింది. ఈ విషయం తెలుసుకున్న చందానగర్‌ పోలీసులు అక్కడికి చేరుకొని స్థానికులతో చర్చించారు. అనంతరం జలమండలి గచ్చిబౌలి సెక్షన్‌ మేనేజర్‌ వెంకట్‌రెడ్డి కూడా జోక్యం చేసుకోవడంతో స్థానికులు శాంతించారు. అనంతరం అరగంటపాటు తాటునీటి సరఫరా చేశారు. కాగా బోరునుబాగు చేసి నీటి సరఫరా జరిగేలా చూడాలని స్థానికులు కోరుతున్నారు.గోపన్‌పల్లిరాజీవ్‌నగర్‌లో దరఖాస్తు చేసుకున్న వారందరికీ మంచినీటి కనెక్షన్లు ఇస్తామని జలమండలి గచ్చిబౌలి మేనేజర్‌ వెంకట్‌రెడ్డి తెలిపారు. గోపన్‌పల్లి ప్రాంతంలో రోజువిడిచి రోజు గంటా ఇరవై నిమిషాలపాటు నీటి సరఫరా చేస్తున్నామన్నారు. 

మరిన్ని వార్తలు