హే‘కృష్ణా’.. పానీ పరేషానీ

18 Apr, 2019 02:24 IST|Sakshi
నాగార్జునసాగర్‌ బ్యాక్‌వాటర్‌ వద్ద అత్యవసర పంపింగ్‌ (ఫైల్‌)

మే నెలలో గ్రేటర్‌కు కృష్ణా జలాల ఎమర్జెన్సీ పంపింగ్‌ 

రూ. 2.8 కోట్లతో పంపింగ్‌ ఏర్పాట్లు 

నాగార్జున సాగర్‌ మట్టం 510 దిగువకు తగ్గితే నీటి కష్టాలు 

సాక్షి, హైదరాబాద్‌: మండువేసవిలో నాగార్జున సాగర్‌(కృష్ణా) నీటిమట్టాలు శరవేగంగా పడిపోతుండటంతో అత్యవసర పంపింగ్‌ చేయక తప్పని పరిస్థితి కనిపిస్తోంది. నాగార్జున సాగర్‌ గరిష్ట నీటిమట్టం 590 అడుగులు కాగా..ప్రస్తుతం సాగర్‌లో 513 అడుగుల మేర నీటినిల్వలున్నాయి. మరో నెలరోజుల్లో నీటినిల్వలు 510 అడుగుల దిగువకు చేరుకున్న పక్షంలో అత్యవసర పంపింగ్‌ చేయక తప్పదని జలమండలి అధికారులు స్పష్టం చేస్తున్నారు.

గతంలో జూన్‌ నెలాఖరువరకు సాగర్‌లో 510 అడుగుల మేర నీటినిల్వలను నిర్వహిస్తామని ఇరిగేషన్‌ శాఖ అధికారులు చెప్పినప్పటికీ..ప్రస్తుతం మండుటెండలకు నీటిమట్టాలు శరవేగంగా పడిపోతుండటంతో అత్యవసర పంపింగ్‌కు ఏర్పాట్లు చేసుకోవాలని జలమండలికి తాజాగా లేఖ రాయడంతో అధికారులు పంపింగ్‌ ఏర్పాట్లు చేస్తున్నారు. ఇందుకోసం రూ.2.8 కోట్ల అంచనా వ్యయంతో పుట్టంగండి  (సాగర్‌బ్యాక్‌వాటర్‌)వద్ద పది భారీ మోటార్లు, షెడ్లు, ట్రాన్స్‌ఫార్మర్లు, ప్రత్యేక పైపులైన్లు ఏర్పాటు చేసే పనులు మొదలు పెట్టేందుకు రంగం సిద్ధంచేయడం గమనార్హం. ఈ మేరకు త్వరలో పంపింగ్‌ ఏర్పాట్లకు టెండర్ల ప్రక్రియను పూర్తిచేయనున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. 

ప్రస్తుతం నీటి సరఫరా పరిస్థితి ఇదీ 
ప్రస్తుతం కృష్ణా మూడుదశల నుంచి 250 మిలియన్‌ గ్యాలన్లు, గోదావరి మొదటిదశ ద్వారా 172 ఎంజీడీలతోపాటు గండిపేట్‌(ఉస్మాన్‌సాగర్‌) నుంచి 25 ఎంజీడీలు, హిమాయత్‌సాగర్‌ నుంచి 18 ఎంజీడీలు మొత్తంగా 465 ఎంజీడీల నీటిని నిత్యం జలమండలి నగర తాగునీటి అవసరాలకు తరలిస్తోంది. అయితే సింగూరు సరఫరా వ్యవస్థ నుంచి నీటిసరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో గోదావరి రింగ్‌మెయిన్‌–3 పైపులైన్‌ ద్వారా సింగూరు సరఫరా వ్యవస్థ నెలకొన్న పటాన్‌చెరు, లింగంపల్లి తదితర ప్రాంతాలకు గోదావరి జలాలను అందిస్తున్నారు.

రివర్స్‌పంపింగ్‌కావడంతో ఆయా ప్రాంతాలకు తాగునీటి సమస్య తప్పడంలేదు. కాగా ప్రస్తుతం జంటజలాశయాల నీటిని వినియోగిస్తున్నప్పటికీ మరింత నీటిని తోడి పాతనగరంతోపాటు నారాయణగూడ,రెడ్‌హిల్స్‌ తదితర డివిజన్లకు నీటిసరఫరా పెంచే అవకాశాలున్నట్లు జలమండలి వర్గాలు తెలిపాయి. ఈ వేసవిలో గోదావరి జలాలకు ఎలాంటి ఇబ్బందుల్లేవని..ఎల్లంపల్లి జలాశయంలో గరిష్ట నీటిమట్టం 485 అడుగులకు ప్రస్తుతం 468 అడుగుల మేర నీటినిల్వలున్నట్లు అధికారులు పేర్కొన్నారు. 

మరిన్ని వార్తలు