నల్లగొండ గుండె చెరువు

28 Apr, 2016 00:36 IST|Sakshi
నల్లగొండ గుండె చెరువు

నల్లగొండ జిల్లా కరువు క(వ్య)థ ఇదీ! జిల్లా మొత్తం కరువు కోరల్లో చిక్కుకుపోయింది. మూసీ ప్రాజెక్టు, ఉదయ సముద్రం, ఏఎమ్మార్పీ, ఎస్‌ఎల్‌బీసీ, బ్రాహ్మణవెల్లెంల... ఇలా ఎన్ని ప్రాజెక్టులున్నా ఏం లాభం? కొన్ని ప్రాజెక్టులు పూర్తికాక, పూర్తయిన ప్రాజెక్టుల్లో నీళ్లు లేక జిల్లా గొంతెండుతోంది. తాగునీటిని అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న అరకొర యత్నాలు కష్టాలను తీర్చడం లేదు. ఎన్ని ట్యాంకర్లు పెట్టినా.. ఎన్ని బోర్లు లీజుకు తీసుకున్నా ఫలితం లేకుండా పోతోంది. జిల్లాలో కరువుపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం..
 - మేకల కల్యాణ్ చక్రవర్తి, సాక్షి ప్రతినిధి, నల్లగొండ
 
 నాడు..
 నాగార్జునసాగర్ ఆయకట్టు కింద కళకళలాడే పచ్చని పొలాలు.. కాలువల నిండా పారే నీళ్లు.. పాల పొంగుల పాడి సంపద.. ఏడాదికి మూడు పంటలతో రైతన్న ముఖం నిండా సంతోషం.. చేతి నిండా పనితో కూలన్న కుటుంబం..!
 
 నేడు..
వెలవెలబోతున్న సాగర్.. ఎటు చూసినా ఎండిపోయిన చెరువులు.. గుక్కెడు నీటి కోసం అల్లాడుతున్న జనం.. పనుల్లేక పల్లెల వలసబాట.. గడ్డి లేక పశువులను అమ్ముకుంటున్న దైన్యం.. నీళ్లు లేక పొలాల్ని బీళ్లుగా వదిలేసిన దుస్థితి..!!
 
 చతికిలపడిన సాగు..

 జిల్లాలో వ్యవసాయం పూర్తిగా చతికిలపడింది. రబీ సీజన్‌లో వరి 60 శాతం మేర సాగుచేసినా.. అందులోనూ 10 శాతానికి పైగా నీ ళ్లు లేక ఎండిపోయింది. మొత్తం 84 వేల హెక్టార్లలో వరి సాగు చే య గా ఎకరానికి సగటున 6 క్వింటాళ్ల ధాన్యం కూడా రాలేదు. వచ్చిన ధా న్యాన్ని అమ్ముకునేందుకు కూడా సరైన మార్కెటింగ్ సౌకర్యాలు లేవు. రోజుల తరబడి ఎదురుచూసినా కాంటాలు కావడం లేదు. రబీ సీజన్‌లో జిల్లాలో అన్ని పంటలు కలిపి 1.78 లక్షల హెక్టార్లలో సాగవుతుందని అంచనా వేసినా... 1.02 లక్ష ల హెక్టార్లలోనే సాగైంది.
 
 ఛిధ్రమైన అనుబంధ రంగాలు..
 వ్యవసాయం కుదేలవడంతో అనుబంధ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. పాడి, చేపలు, కోళ్ల పరిశ్రమలు దారుణంగా దెబ్బతింటున్నాయి. ఎండలకు వందల సంఖ్యలో కోళ్లు, చేపలు చనిపోతున్నాయి. నీళ్లు లేక, మేత కనిపించక జీవాలను భువనగిరి ప్రాంతం నుంచి వరంగల్ జిల్లా ఏటూరు నాగారం వైపు తీసుకెళ్లి మేపుకుంటున్నారు. జిల్లాలో డిసెంబర్ నెలలో రోజుకు 16 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి జరిగితే ఏప్రిల్ చివరి వారంలో అది కేవలం 7 లక్షల లీటర్లకు చేరింది. డిసెంబర్ నుంచి క్రమంగా పాల ఉత్పత్తి తగ్గుతూ గతంలో ఎన్నడూ లేని విధంగా తక్కువ స్థాయికి చేరింది.
 
 ‘సాగర’ ఘోష..
 జిల్లాకు ప్రాణాధారమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టు నీటి మట్టం కనిష్టస్థాయికి పడిపోయింది. ఈ ప్రాజెక్టు కనీస నీటి మట్టం 510 అడుగులు కాగా, ప్రస్తుతం ఉన్న నీటి మట్టం 507.40 అడుగులే! గతంలో కూడా సాగర్ ప్రాజెక్టు పలుసార్లు కనిష్ట నీటి మట్టానికి వెళ్లింది. 2004 ఆగస్టు 2న 494.30 అడుగులు, 1995 జూలై8న 494.40 అడుగులు, 2003 సెప్టెంబర్ 4న 494.90 అడుగుల కనిష్ట మట్టానికి సాగర్ ప్రాజెక్టు చేరుకుంది. ఈ ప్రాజెక్టు నుంచి ఖరీఫ్, రబీ సీజన్‌లలో పుష్కలంగా నీరు తెచ్చుకునే పరిస్థితుల నుంచి కేవలం జిల్లాలోని తాగునీటి అవసరాల కోసం నీటిని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అది కూడా వరి పంటలన్నీ అయిపోయాక, ఖమ్మం జిల్లా అవసరాలను కూడా తీర్చేందుకు గాను కృష్ణాబోర్డు ప్రత్యేక అనుమతినిచ్చింది. ఈ నీళ్లు కూడా మరో 15 రోజుల వరకే వస్తాయని, ఈసారి తాగునీటి విడుదలకు కూడా బోర్డు అనుమతినిస్తుందో, ఇవ్వదో తెలియని పరిస్థితి ఉందని డ్యాం అధికారులు చెపుతున్నారు. 15 రోజుల తర్వాత సాగర్ నుంచి తాగునీరు రాకపోతే జిల్లా దాహార్తితో అల్లాడాల్సిందే!
 
 నీటి కష్టాలు కోటి
 నల్లగొండ జిల్లా ప్రజలు నీళ్ల కోసం పడరాని పాట్లు పడుతున్నారు. సాగర్ ఆయకట్టు ప్రాంతంలో సైతం తీవ్ర నీటి ఎద్దడి నెలకొంది. ఇక గిరిజన తం డాలు, ఆవాస గ్రామాల సంగతి చెప్పనక్కర్లేదు. అ నుముల మండలం ఎల్లాపురం గ్రామపంచాయతీ పరిధిలోని చిక్కోలం తండాను ‘సాక్షి’ సందర్శిం చగా.. ప్రజలంతా సమస్యలను ఏకరువు పెట్టుకున్నారు. ఊళ్లో సోలార్ ద్వారా నడుస్తున్న బోరు నీళ్లు గొంతు దిగడం లేదని, త్రీ ఫేజ్ కరెంటు ఉన్నప్పుడు సన్నగా ఇంకో బోరు పోస్తున్నా అవి కూడా సరిపోవడం లేదన్నారు. చండూరు మండలం గుండ్రపల్లిలో మరీ దారుణం. ఓ పెద్దాయన చనిపోతే స్నానాలకు నీళ్లు లేక వేరే ఊళ్లో దహనం చేయాల్సి వచ్చిందని గ్రామస్తులు చెప్పారు. బోజ్యా తండావాసులకు బురదతో కూడిన చెలిమ నీరే దిక్కుగా మారింది. అర లీటర్ నీళ్లను మరిగిస్తే అందులో పిడికెడు సున్నం వస్తోందని చెబుతున్నారు.
 
 పాతాళానికి చేరిన గంగమ్మ..
 జిల్లాలోని పది మండలాల్లో భూగర్భ జల నీటిమట్టం దారుణంగా పడిపోయింది. గత ఏడాది మార్చి నెలాఖరుకు మేళ్లచెరువు మండలంలో 13.36 అడుగుల లోతులో నీళ్లుంటే... ఇప్పుడు 31.98 అడుగుల లోతుకు వెళ్లిపోయాయి. కోదాడ, మునగాల, త్రిపురారం, హుజూర్‌నగర్, దామరచర్ల, మఠంపల్లి, కనగల్, పెదవూర, నేరేడుచర్ల మండలాల్లోనూ ఇదే పరిస్థితి. గుట్టలో 21.63 అడుగులకు, భువనగిరిలో 22.87, బీబీనగర్ లో 20.78, మఠంపల్లిలో 21.49, చిట్యాల 23.89, మర్రిగూడలో 21.11 అడుగులకు భూగర్భ జలమట్టం పడిపోయింది.
 
 ఉపాధి పనులెక్కడ?
 కరువు రక్కసి కూలీల పొట్టగొట్టింది. ఉపాధి హామీ పనుల్లేక ఇబ్బందులు పడుతున్నారు. ఈ పథకం కింద కేవలం ఇంకుడు గుంతల కార్యక్రమమే నిర్వహిస్తుండడం, రెండు నెలలుగా వేతనాలు లేకపోవడంతో రోజు వారీ ఉపాధి కూలీల సంఖ్య లక్షకు చేరింది. అదే రెండు నెలల క్రితం 1.80 లక్షల వరకు ఉండేది. ఈ విషయమై బోజ్యా తండాకు చెందిన శైలి అనే మహిళ మాట్లాడుతూ... ఉపాధి పనుల్లేక అందరూ వలసపోతున్నారని, తమకు కరువు పనులు కల్పించాలని చెప్పింది. చేసిన పనులకు జీతాల్లేక మానేశామని, జీతాలు ఇస్తేనే పనికి వెళ్తామని నేరేడుచర్ల మండలం కొత్తతండాకు చెందిన గిరిజనులు ‘సాక్షి’తో చెప్పారు. ఇక ఉపాధి కూలీకి వెళ్లే వారికి కూడా సరైన రక్షణ సౌక ర్యాలు కల్పించడం లేదు. నీడ కోసం టెంట్లు, దాహార్తి తీర్చేందుకు నీళ్లు సమకూర్చలేని పరిస్థితి ఉంది. టెంట్లు కొనుగోళ్ల కోసం ఇటీవలే హైదరాబాద్ నుంచి అనుమతి వచ్చిందని, త్వరలోనే కొనుగోళ్లు చేస్తామని ఉపాధి హామీ అధికారులు చెపుతుంటే... ఎండాకాలం అయిపోయిన తర్వాత టెంట్లు కొనుక్కుని ఏం చేస్తారని ఉపాధి కూలీలు ప్రశ్నిస్తున్నారు.
 
 పనుల్లేక పల్లెకు తాళం
 పనుల్లేక జనం వలసబాట పట్టడంతో చాలా తండాలు, గ్రామాల్లో  ఇళ్లను తాళాలు కనిపిస్తున్నాయి. ఈ పక్క చిత్రం నిడమనూరు మండలం జోజ్యా తండాలోనిది! నునావత్ ధనుకు కుమారులకు చెందిన ఈ ఇల్లు ఇలా తాళం వేసి కనిపించింది. ధనుకు 70 ఏళ్లు ముదుసలి. నలుగురు కొడుకులు. ఇద్దరు చనిపోయారు. మరో ఇద్దరు కొడుకులు, కోడళ్లు తండాలోనే ఉండేవారు. కానీ ఇప్పుడు పనుల్లేక వారంతా గుంటూరు జిల్లా తెనాలికి వలస వెళ్లారు. దామరచర్ల మండలం తిమ్మాపురం గ్రామంలో కూడా సగం కుటుంబాలు గుంటూరు, అమరావతికి వలస వెళ్లాయి. ఈ ఊరి నుంచి వలస వెళ్లి బియ్యం కోసం స్వగ్రామానికి వచ్చిన ధనావత్ మోతీరాంను పలకరించగా.. ‘అక్కడ రోజుకు రూ.400 జీతం ఇస్తున్నారు. మా వాళ్ల గుడిసెలు ఉంటే అందులోనే నేనూ ఉంటున్నా’ అని చెప్పాడు. ఒక్క మోతీరాం, ధనుకు కుటుంబాలే కాదు జిల్లాలోని సగానికిపైగా మండలాల ప్రజలు వలస బాట పట్టారు.
 
 ఎద్దు ఏడ్చిన ఎవుసం..
 
జిల్లాలో ఒక ట్రాక్టర్ గడ్డి రూ.4,000 పలుకుతోంది. అందులో సుమారు ఎకరన్నర గడ్డి పడుతుంది. కూలీల ఖర్చులకు రూ. 1,950 అవుతుంది. దూరాన్ని బట్టి ట్రాక్టర్ కిరాయి రూ. 2,000పైనే ఉంది. మొత్తంగా కనీసం ట్రాక్టర్ గడ్డికి రూ.9200 నుంచి రూ.9500 వరకు అవుతుంది. ఇది భువనగిరి, ఆలేరు నియోజవర్గాల లెక్క. అదే ఆయకట్టులో అయితే మిషన్ కోత కాకుండా మామూలుగా కోసిన గడ్డి అయితే ఎకరా రూ.15వేల వరకు పడుతోంది. గడ్డి విషయమై భువనగిరి మండలం హుస్నాబాద్‌కు చెందిన తుమ్మెటి జమ్మయ్యను పలకరిస్తే ‘ మాకు సుమారు 20 వరకు గేదెలు, ఆవులు ఉన్నాయి. గడ్డి లభించక పోవడంతో వలిగొండ, పరిసర గ్రామాలలో 6 ట్రాక్టర్ల గడ్డి కొన్నాను. ఒక్కొక్క ట్రాక్టర్ గడ్డి ఇంటికి చేరే సరికి రూ.10వేల వరకు ఖర్చయింది’’ అని చె ప్పారు.
 
 చెరువుల్లో చుక్కనీరు లేదు
 గొలుసుకట్టు వ్యవసాయానికి మూలాధారమైన చెరువులు జిల్లాలో ఎండిపోయాయి. గతంలో ఎన్నడూ ఎండిపోని చెరువులు కూడా చుక్క నీరు లేకుండా నెర్రెలు బారి కనిపిస్తున్నాయి.  జిల్లాలో మైలసముద్రం, జి.యెడవల్లి, చేపూరు, మాదారం, వాయలసింగారం, అయిటిపాముల, కొమరబండ, దోరకుంట, అమ్మగూడెం, బొమ్మేపల్లి, రేగెట్ట, తిమ్మాజిగూడెం, తుర్కపల్లి, ఇరుగంటిపల్లి, పొనుగోడు, శేరిలింగోటం, జి. చెన్నారం, తుమ్మడం పెద్ద చెరువులు ఎండిపోయాయి. వల్లభాపురం చెరువు, నల్లకుంట, పలుగు చెరువు, రాళ్లకుంట, లింగగిరి పెద్దచెరువు, గరిడేపల్లి తాళ్లచెరువు, ఉదయసముద్రం రిజర్వాయర్, పెద్దదేవులపల్లి రిజర్వాయర్, దామరచర్ల మండలంలోని చెరువులది కూడా ఇదే పరిస్థితి. వీటిలో కొన్ని చెరువులను సాగర్‌నీటితో నింపి తాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నారు.

 రోజుకు రూ.అరకోటి వ్యాపారం
 జిల్లాలో పల్లె, పట్నం తేడా లేకుండా గుక్కెడు నీటికోసం అల్లాడుతున్నాయి. సూర్యాపేటలో మూడు రోజులకోసారి నీటిని విడుదల చేస్తుండగా, మిగిలిన చోట్ల రెండు రోజులకోసారి ఇస్తున్నారు. తాగునీటి కొరతతో జిల్లాలో రోజుకు రూ.అరకోటికిపైగా వాటర్ వ్యాపారం జరుగుతోంది. జిల్లా వ్యాప్తంగా సుమారు 900 వాటర్‌ప్లాంట్లు ఉన్నాయి. క్యాన్‌కు ప్రాంతాన్ని బట్టి రూ.10 నుంచి రూ.25 వరకు వసూలు చేస్తున్నారు. రైతులు కూడా తాగునీరు, సాగునీరు కోసం ఇటీవలి వరకు పెద్ద ఎత్తున బోర్లు వేశారు. చనిపోతున్న బత్తాయి తోటలను కాపాడుకునేందుకు ఒక్కో రైతు 2-5 వరకు బోర్లు వేశారు. దాదాపు 600-700 ఫీట్లు వేసినా నీళ్లు పడలేదు. దీంతో రైతులు లక్షల రూపాయల్లో నష్టపోతున్నారు. బత్తాయి తోటలను రైతులే నరికేసుకుంటుండగా, కొందరు ఈ సీజన్ వరకే లక్షల రూపాయలు వెచ్చించి బోర్లు లీజుకు తీసుకుని పంటలను కాపాడుకుంటున్నారు.
 
 కరువు సాయం మహాప్రభో..
 జిల్లాలో 22 మండలాలను కరువు మండలాలుగా ప్రకటించారు. కానీ, ఇప్పటివరకు కరువు సాయం చేయలేదు. మొత్తం 22 మండలాల్లో 1.25లక్షల హెక్టార్లలో, 1.29లక్షల మంది రైతులకు రూ.86 కోట్ల మేర పంట నష్టం జరిగిందని అధికారులు అంచనా వేశారు. ఈ ప్రతిపాదనలు వెళ్లాయి కానీ ఇంతవరకు ఒక్క రూపాయి కూడా ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరు చేయలేదు. జిల్లా మొత్తం కరువు ఉంటే అశాస్త్రీయంగా కేవలం 22 మండలాలనే కరువు మండలాలుగా ప్రకటించారని రైతు సంఘాలు గగ్గోలు పెడుతుంటే, కరువు మండలాలను ప్రకటించి రెండు నెలలవుతున్నా ఇంతవరకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వలేదని, కరువు కాలంలో కూడా అటు కేంద్రానికి గానీ, ఇటు రాష్ట్రానికి గానీ రైతులపై కనికరం రావడం లేదని రైతులు వాపోతున్నారు.
 
 తాగునీటి లెక్కలివి
 59 జిల్లాలో మొత్తం మండలాలు
 3,341 నివాస ప్రాంతాలు
 1592 రక్షిత మంచినీటి సరఫరా ఉన్నవి
 492 రోజూ నీళ్లు ఇస్తున్నవి
 508 రోజుమార్చి రోజు ఇస్తున్నవి
 4 వారానికి ఓసారి ఇస్తున్నవి
 182 అసలు నీటి సరఫరా లేనివి
 22 నల్లగొండ నియోజకవర్గంలో నీళ్లందని గ్రామాలు
 
 వెయ్యికిపైగా బోర్లు అద్దెకు తీసుకున్నాం
 కరువు సహాయక చర్యల విషయంలో ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను తు.చ. తప్పకుండా పాటిస్తున్నాం. ముఖ్యంగా తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తున్నాం. జిల్లాలో వెయ్యికి పైగా బోర్లను అద్దెకు తీసుకుని ప్రజలకు తాగునీరు అందించే ప్రయత్నం చేస్తున్నాం. నిధుల కొరత రాకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అధికారులతో తాగునీరు, ఎండల తీవ్రతలపై సమీక్ష నిర్వహించి తగు సూచనలిస్తున్నాం. పశువుల కోసం ప్రత్యేక తొట్లు ఏర్పాటు చేయిస్తున్నాం. సుమారు 3వేల పశువుల తొట్లు ఉపాధి హామీ కింద చేపడుతున్నాం.
 - పి. సత్యనారాయణరెడ్డి, కలెక్టర్, నల్లగొండ.

మరిన్ని వార్తలు