రబీ ఆశలు ఆవిరి!

13 Nov, 2014 02:56 IST|Sakshi
సింగూరు ప్రాజెక్టు

ఒక్క నాగార్జునసాగర్‌లోనే కొద్దిపాటి నిల్వలు
మిగతా ప్రాజెక్టుల్లో ఎక్కడా అందుబాటులో లేని నీరు
సాగర్‌లోనూ ఎక్కువ వాటా తాగునీటి అవసరాలకే
గత ఏడాదితో పోలిస్తే 141 టీఎంసీల నీటి కొరత  

 
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో రబీ సీజన్‌కు ఇప్పటికే నెలకొన్న కరెంట్ కష్టాలకు, తోడు నీటి కష్టాలూ జతకానున్నాయి. రాష్ట్రంలోని ప్రధాన ప్రాజెక్టుల్లో సాగు నీటి అవసరాలకు సరిపోయే నీటి నిల్వలు ఎక్కడా అందుబాటులో లేకపోవడంతో వాటిపై పూర్తిగా ఆశలు వదులుకోక తప్పేలాలేదు. ఈ ఏడాది వర్షాలు సరిగా కురవకపోవడంతో ఖరీఫ్ పంటల విస్తీర్ణమే గణనీయంగా తగ్గగా, రబీలో మరింత క్షీణించే అవకాశముంద ని ప్రభుత్వ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ప్రస్తు తం ఒక్క నాగార్జునసాగర్ నుంచి మాత్రమే కొద్దిపాటి నీటి కేటాయింపులకు అవకాశం ఉంటుం దని, అందులోనూ సింహభాగం తాగునీటి అవసరాలకే కేటాయించే అవకాశాలుంటాయని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. మిగతా ప్రాజెక్టుల్లోని నీటిని సైతం వచ్చే జూన్ వరకు కాపాడుకుని బొట్టుబొట్టునూ జాగ్రత్తగా వాడుకోవాలని సూచనలు చేస్తున్నాయి.
 
 వర్షాలులేక ఇక్కట్లు
 తీవ్ర వర్షాభావ పరిస్థితులు రాష్ట్ర ప్రాజెక్టుల్లో నీటి నిల్వపై ప్రభావాన్ని చూపాయి. కృష్ణా బేసిన్ పరిధిలో కొంత ఆలస్యంగానైనా వర్షాలు కురిసినా, గోదావరి  బేసిన్‌లో మాత్రం సరిపోని రీతిలో వర్షాలు లేక ప్రాజెక్టుల్లోకి నీరు చేరలేదు. దీంతో శ్రీరాంసాగర్, కడెం, లోయర్ మానేరు, నిజాంసాగర్, సింగూరు తదితర ప్రాజెక్టుల్లో ఎక్కడా నీరు చేరలేదు. గత ఏడాది ఇదే సమయంలో ప్రధాన ప్రాజెక్టుల్లో నీటి నిల్వలు సుమారు 470 టీఎంసీల మేర ఉండగా, ఈ ఏడాది ప్రస్తుతానికి కేవలం 329 టీఎంసీల నీరు మాత్రమే అందుబాటులో ఉంది. మరో 141 టీఎంసీల నీటి కొరత ఉంది. ఈ సీజన్‌లో ఆయా ప్రాజెక్టుల కింద సాగు అవసరాలకు సరిపడా నీటి కేటాయింపులు జరుపలేదు. శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో మాత్రం స్థానిక ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చిన ఒత్తిడి మేరకు ప్రాజెక్టు నుంచి 6 టీఎంసీల నీటిని మాత్రమే వదిలారు. నిజానికి ఈ ప్రాజెక్టు కింద 9.68 లక్షల ఎకరాల ఆయకట్టు ఉన్నా లక్ష ఎకరాలకు మించి నీరివ్వలేదు.
 
  ఇక నిజాంసాగర్, సింగూరు పరిధిలో సాగు అవసరాల్లో 40 శాతానికి తక్కువగానే నీటి కేటాయింపులు చేశారు. ఒక్క నాగార్జునసాగర్ పరిధిలో మాత్రం నల్లగొండ జిల్లాలోని  కెనాల్‌ల కింద 2.80 లక్షల ఎకరాలు, లిఫ్ట్‌ల కింద 47వేల ఎకరాలకు సాగు నీరందింది. ఇదే ప్రాజెక్టు కింద ఖమ్మం జిల్లా పరిధిలోని 2.82 లక్షల ఎకరాల ఆయకట్టుకు పూర్తి స్థాయిలో నీరందింది. అయితే ప్రస్తుత రబీ సీజన్‌లో ఈ ఆయకట్టుకు సుమారు 40 శాతం సాగునీరు తగ్గే అవకాశం ఉంటుందని నీటి పారుదల శాఖ వర్గాలు తెలిపాయి. నాగార్జునసాగర్ ప్రాజెక్టులో 271 టీఎంసీల మేర నీరు ఉన్నప్పటికీ కనీస నీటి మట్టం 510 అడుగులకి లెక్కవేస్తే ప్రస్తుతం అందుబాటులో ఉన్న నీరు 165 టీఎంసీలు మాత్రమే. ఇందులో ఏఎంఆర్‌పీ (ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు)కింద తాగునీటికి 5 టీఎంసీలు, సాగర్ కింద మరో 8 టీఎంసీల తాగునీరు, హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 11 టీఎంసీల మేర నీటిని సరఫరా చేయాల్సి ఉంటుంది.
 
  వీటికి తోడు వేసవిలో మరో 7 నుంచి 8 టీఎంసీల మేర ఆవిరి నష్టాలు ఉంటా యి. అన్నీపోనూ మిగిలిన నీటితో ప్రాజెక్టు పరిధిలోని మొత్తం ఆయకట్టు 22 లక్షల ఎకరాల్లో సగానికి తక్కువే నీటిని అందించే అవకాశం ఉం టుందని చెబుతున్నారు. అయితే డిసెంబర్ 15 తర్వాత ప్రాజెక్టులో నీటి నిల్వ, రబీ సాగు గణాం కాలను దృష్టిలో పెట్టుకొని నీటి కేటాయింపులపై ఓ అంచనాకు వస్తామని అధికారులు చెబుతున్నారు.

ఇక శ్రీరాంసాగర్ ప్రాజెక్టు పరిధిలో ప్రస్తుతం ఉన్న 23.26 టీఎంసీల నీటిలో 6 టీఎంసీల మేర నీటి ఆవిరి నష్టాలు పోనూ మిగిలిన నీటిలో 12.5 టీఎంసీల నీటిని ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల తాగునీటి అవసరాలకు వాడతామని, ఇక్కడినుంచి సాగు అవసరాలకు నీరిచ్చే అవకాశమే లేదని చెబుతున్నారు. ఇక సింగూరు ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న 11 టీఎంసీల నీటిలో 3 నుంచి 4 టీఎంసీలు హైదరాబాద్ తాగునీటి అవసరాలకు మళ్లిస్తే, కింద ఉన్న ఘనపూర్ ప్రాజెక్టు పరిధిలో ఆయకట్టుకు నీరు ఇవ్వడం గగనమే కానుంది.
 
  సింగూరు నుంచి నీరు విడుదల కాకుంటే దిగువన ఉన్న నిజాంసాగర్ పరిస్థితి మరింత దారుణంగా మారనుంది. ఇక్కడున్న కేవలం 1.66 టీఎంసీల నీటితో ప్రాజెక్టు పరిసర ప్రాంతాల పశువుల దాహార్తిని తీర్చే పరిస్థితి కూడా లేదు. ఈ దృష్ట్యా ప్రస్తుతం ఉన్న నీటిని జాగ్రత్తగా వచ్చే జూన్ వరకు వాడుకోవాల్సి ఉంటుందని, రైతులకు సైతం ఈ అంశంపై అవగాహన కల్పించాలని నీటి పారుదల శాఖ కింది స్థాయి అధికారులకు సూచనలు చేస్తోంది.

>
మరిన్ని వార్తలు