ఎట్లయినా ఎస్సారెస్పీకే నష్టం

2 Jul, 2014 05:37 IST|Sakshi

బాల్కొండ: ‘బాబ్లీ’.. అంటూ ముద్దుగా పేరుపెట్టి.. గోదావరిపై ఆనకట్ట కట్టిన మహారాష్ట్ర ప్రభుత్వం మనకచ్చే నీళ్లనూ దోచేస్తోంది. అసలు ఈ ప్రాజెక్టు కట్టడంలోనే మాయ చేసింది. తన నీళ్లు తనకే.. మన నీళ్లూ తనకే వచ్చేలా కనికట్టు ప్రదర్శించింది. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తినా.. దించినా మనకేం ప్రయోజనం లేదు.. సరికదా మన నీళ్లూ వాళ్లకే వెళ్లిపోతాయి. ఇలా నిర్మించిన ‘బాబ్లీ అడ్డుకట్ట’ వల్ల ఉత్తర తెలంగాణ కల్పతరువు శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి నీళ్లు రాకపోవడంతో.. ‘ఆయకట్టు’ కన్నీళ్లు పెడుతోంది.

 ఎస్సారెస్పీకి నీటి గండమే
 ఎగువన మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా ధర్మాబాద్ తాలూకాలో గోదావరిపై నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ వల్ల
 శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్(ఎస్సారెస్పీ)కు నీటిగండం తప్పదు. బాబ్లీ గేట్లు ఎత్తిన, దించిన ఎస్సారెస్పీ నీటికి గండమే. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం జూలై నుంచి అక్టోబర్ 28 వరకు బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తిఉంచాలి. అయితే గేట్లు ఎత్తితే ఎస్సారెస్పీలోని నికర జలాలు వెనక్కు వెళ్తాయి. దించితే ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి వచ్చే నీరు నిలిచి పోతుంది. ఇలా ఎత్తినా.. దించినా.. బాబ్లీలోకే నీరు వచ్చేలా ఈ ప్రాజెక్టును నిర్మించారు.

 ఎగువన నిండిన తర్వాతే
 శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్‌కు ప్రధానంగా మహారాష్ట్రలోని ఎగువ ప్రాంతాల నుంచే  వరద వస్తుంది. ఈ నీటితోనే ప్రాజెక్ట్ నిండు కుండలా మారుతుంది. జూలై వరకు బాబ్లీ గేట్లు మూసి వేయడం వల్ల ఎగువ ప్రాంతాల నుంచి వచ్చే నీటికి ఆటంకం కలుగుతోంది. అనంతరం అక్టోబర్ వరకే గేట్లు తెరిచి ఉంచితే...  ఎస్సారెస్పీలోకి వచ్చే వరద నీటికి గండం తప్పదు. గత పదేళ్లుగా వర్షపాతం చూస్తే.. సకాలంలో వర్షాలు కురిసింది చాలా తక్కువ. అలాంటప్పుడు ఎస్సారెస్పీ ఎగువన ఉన్న బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు అక్టోబర్ వరకు మాత్రమే తెరిచి ఉంచితే లాభం లేదు. వరదలు వచ్చినా మహారాష్ట్ర ప్రభుత్వం బాబ్లీ లాంటి ప్రాజెక్ట్‌తో పాటు ఎగువ ప్రాంతంలో నిర్మించిన 16 చెక్‌డ్యాంలు నిండిన తర్వాతనే మిగులు జలాలను వదులుతోంది.

 గేట్లు ఎత్తితే
 బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లు ఎత్తితే మనకు నీళ్లు వస్తాయని ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులు సంబురపడ్డారు. తీరా ఆ ప్రాజెక్ట్ నిర్మాణశైలి తెలుసుకున్న తర్వాత లబోదిబోమంటున్నారు. బాబ్లీ ప్రాజెక్టు గేట్లు ఎత్తితే ఎస్సారెస్పీలోని నీళ్లు సైతం వెనక్కి వెళ్తాయి. నీటిని వెనక్కు లాక్కునే విధంగా బాబ్లీ ప్రాజెక్ట్‌కు రివర్స్ గేట్లను నిర్మించారు. శ్రీరాంసాగర్ ప్రాజెక్ట్ నీటిమట్టం 1072 అడుగులకు చేరిన తర్వాత ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు నిలిచి పోతే నికర జలాలను వారు దోచేసుకోవచ్చు.

 అక్టోబర్‌లోనే గేట్లు దించితే
 శ్రీరాంసాగ ర్ ప్రాజెక్ట్ ఎగువ భాగన నిర్మించిన బాబ్లీ ప్రాజెక్ట్ గేట్లను అక్టోబర్‌లోనే కిందికి దించితే.. ఎగువ ప్రాంతాల నుంచి ఎస్సారెస్పీలోకి వచ్చే నీరు నిలిచిపోతుంది. దీంతో ఖరీఫ్‌లో ఎస్సారెస్పీ నిండుకుండలా ఉన్నప్పటికీ.. రబీపై మాత్రం తీవ్ర ప్రభావం పడుతుంది. బాబ్లీ ప్రాజెక్ట్ 2.74 టీఎంసీల సామర్థ్యం అయినప్పటికీ అందులో నుంచి పంపింగ్ ద్వారా ఇతర జలాశయాలకు నీటిని సరఫరా చేసే అవకాశం ఉంది. ఒకవేళ ఎగువ నుంచి తమకు వరదనీరు రాకపోతే శ్రీరాంసాగర్‌లో నుంచి దాదాపు 56టీఎంసీల నీటిని రివర్స్‌గేట్ల ద్వారా బాబ్లీలోకి మళ్లించుకోవచ్చు. ఇలా ఎస్సారెస్పీ మొత్తం 90టీఎంసీల్లో 56టీఎంసీల వర కు బాబ్లీ గండం ఉంటుంది. దీంతో ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఎస్సారెస్పీపై ఆధారపడిన 18 లక్షల ఎకరాలు ఎడారిగా మారే ప్రమాదం ఉందని రైతులు వాపోతున్నారు.

 10.50లక్షల ఎకరాలు ప్రశ్నార్థకం
 బాబ్లీ ప్రాజెక్ట్ వల్ల ఎస్సారెస్పీ ఆయకట్టులో సాగవుతున్న 10.50 లక్షల ఎకరాల భవిష్యత్తు ప్రశ్నార్థకమవుతోంది. ఒక్క టీఎంసీ నీటితో 20వేల ఎకరాల పంటకు నీరందించవచ్చని అధికారుల లెక్కలే తెలుపుతున్నాయి. అంటే 56 టీఎంసీల నీటితో 10.50 లక్షల ఎకరాల ఆయకట్టుకు నీరందించవచ్చు. ఉత్తర తెలంగాణలోని నల్గొండ,ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాలో 18 లక్షల ఎకరాలకు ఎస్సారెస్పీ నీటిని అందిస్తుంది. బాబ్లీ ప్రాజెక్ట్ నిర్మాణం వలన ఎస్సారెస్పీ ఆయకట్టులో 60 శాతం ఎడారిగా మారే ప్రమాదముంది. పాలకులు స్పందించి శ్రీరాంసాగర్ ఆయకట్టును కాపాడాలని రైతులు కోరుతున్నారు.

మరిన్ని వార్తలు