డిండి ప్రాజెక్ట్‌ నుంచి నీటి విడుదల

21 Mar, 2017 01:54 IST|Sakshi

డిండి :  ఎంజీకేఎల్‌ఐ పథకం ద్వారా డిండి ప్రాజెక్ట్‌లోకి నీటిని ఇటివలే విడుదల చేశారు. ఈ క్రమంలో ప్రాజెక్ట్‌లో ప్రస్తుతం నీటిమట్టం 13 అడుగులకు చేరింది. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని నల్లగొండ జిల్లా డిండి మండల పరిధిలోని గ్రామాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా ఉండేందుకు దాని పరిధిలోని కుంటలను నింపాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు  సంబంధిత అధికారులు.. రాష్ట్ర æనీటిపారుదల శాఖ  మంత్రి హరీష్‌రావు ఆదేశాల మేరకు సోమవారం మండల పరిధిలోని పలు కుంటలకు డిండి ప్రాజెక్ట్‌ నుంచి కాలువ ద్వారా నీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా డీఈ రూప్లా నాయక్‌ మాట్లాతడుతూ బాపన్‌కుంట, ఎనకుంట, కాంట్రోన్‌ కుంట, నడివి కుంటలకు నీటిని విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఎంపీటీసీ సభ్యులు పర్వతాలు, తిర్పతయ్య, విష్ణువర్దన్‌రెడ్డి, వీరకారి రాంకిరణ్, వెంకట్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, వెంకట్‌నారాయణ తదితరులు పాల్గొన్నారు.

కొన్ని గంటల్లోపే..
డిండి ప్రాజెక్ట్‌ నుంచి ఆయకట్లు కింద ఉన్న కుంటలను నింపడానికి నీటిని విడుదల చేసిన కొన్ని గంటల్లోపే నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాల్‌రాజు అడ్డుకున్నారు. 13 అడుగుల నీరు మాత్రమే ఉన్న ఈ  ప్రాజెక్ట్‌ నుంచి నీటిని విడుదల చేస్తే.. ప్రాజెక్టు పూర్తిగా ఎండిపోయి సమీప మండలాలైన వంగూర, ఉప్పునుంతల మండలాల్లో భూగర్బ జలాలు అడుగంటిపోతాయని ఆయన పేర్కొన్నారు. తాగు నీటి సమస్య జటిలమవుతుందన్న  ప్రజల ఒత్తిడి మేరకే నీటి విడుదలను అడ్డుకున్నట్లు వెల్లడించారు. డిండి ప్రాజెక్ట్‌ను పూర్తి స్థాయిలో నింపిన తర్వాతనే మండల పరిధిలోని కుంటలకు నీటిని వదలాలని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు