నీటి భద్రతకు చట్టం కావాలి: సుజనా

24 Mar, 2017 03:22 IST|Sakshi
నీటి భద్రతకు చట్టం కావాలి: సుజనా

సాక్షి, హైదరాబాద్‌: ఆహార భద్రతకు చట్టమున్నట్లే దేశంలోని రైతులు పంటలు పండించేందుకు నీరు అందుబాటులో ఉంచేలా ప్రత్యేక చట్టం అవసరమని కేంద్ర మంత్రి సుజనాచౌదరి అన్నారు. రైతులు తమ శ్రమ శక్తికి, పంటలు పండించే భూమికి తగిన విలువ సంపాదించుకునే ఆలోచన చేయాలని, ఇందుకోసం వారు ఆర్థిక వ్యవహారాలనూ ఆకళింపు చేసుకునేందుకు ప్రయత్నించాలన్నారు.

 గురువారం హైదరాబాద్‌లో ప్రారంభమైన ‘రూరల్‌ ఇన్నోవేటర్స్‌ స్టార్టప్‌ కాన్‌క్లేవ్‌’లో ఆయన మాట్లాడుతూ... రైతులు తమ శ్రమ, పంటలు పండించే నేల నుంచి అత్యధిక విలువను పొందడంలో విఫలమవుతున్నారని, వారికి కాస్ట్‌ అకౌంటెన్సీ, లాభ నష్టాలను ఎలా లెక్కిస్తారో.. వేటిని పెట్టుబడులుగా పరిగణిస్తారో తెలియ జేయాల్సిన అవసరముందన్నారు. దీంతోపాటే కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాలు రైతుల కోసం చేపట్టే కార్యక్రమాలను వివరించి, వారికి సాయపడేలా స్వచ్ఛంద కార్యకర్తలను సిద్ధం చేయాలన్నారు.

ఆటోడెస్క్‌తో ఒప్పందం...
గ్రామీణ సృజనలను వాణిజ్య స్థాయికి తీసుకొచ్చేందుకు వీలుగా ఎన్‌ఐఆర్‌డీ...అంతర్జాతీయ సంస్థ ఆటోడెస్క్‌తో అవగాహన ఒప్పం దం కుదుర్చుకుంది. ఇందులో భాగంగా డిజైనింగ్, ప్రొటో టైపింగ్‌ లకు ఉపయోగపడే ఆటోడెస్క్‌ సాఫ్ట్‌వేర్‌ను ఎన్‌ఐఆర్‌డీకి ఉచితంగా అందజేస్తామని ఆటోడెస్క్‌ ససై్టనబిలిటీ ఫౌండేషన్‌ అధికారి జేక్‌ లేస్‌ తెలిపారు. గ్రామీణ స్థాయి ఇన్నోవేటర్స్, స్టార్టప్‌ కంపెనీలు వీటిద్వారా మెరుగైన ఉత్పత్తులను సిద్ధం చేయవచ్చన్నారు. సామాజిక ప్రభావం చూపగల ఆవిష్కరణలు, సేవల విషయంలో తాము ప్రపంచవ్యాప్తంగా అనేక స్టార్టప్‌ కంపెనీలకు చేయూత అందిస్తున్నామన్నారు. ఏటా దాదాపు 1.5 లక్షల డాలర్ల విలువైన సాఫ్ట్‌వేర్‌ ఉత్పత్తులను స్వచ్ఛంద సంస్థలు, స్టార్టప్స్, ఇన్నొవేటర్లకు ఉచితంగా అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఎన్‌ఐఆర్‌డీ డైరెక్టర్‌ జనరల్‌ డబ్ల్యూ.ఆర్‌.రెడ్డి తదితరులు పాల్గొన్నారు.  
 

మరిన్ని వార్తలు