జల గండం

5 Jan, 2015 04:38 IST|Sakshi

వేసవికి ముందే జిల్లావాసులకు తాగునీటి తిప్పలు తప్పడం లేదు. తీవ్ర వర్షాభావంతో భూగర్భజలమట్టాలు పాతాళానికి పడిపోవడం...ప్రధాన జలాశయాల్లోనూ నీటినిల్వలు రోజురోజుకూ తగ్గిపోతుండడం.. జలగండానికి సంకేతంగా నిలుస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలోని నారాయణఖేడ్‌తోపాటు గిరిజన తండాలు, మారుమూల గ్రామాల్లో  తాగునీటి సమస్య ఉత్పన్నమవుతోంది. వేసవి నాటికి ఇది తీవ్రరూపం దాల్చి జిల్లాలోని 1099 ఆవాస ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొనవచ్చని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి.  
 
 
 సాక్షి, సంగారెడ్డి:  ఈ ఏడాది జిల్లాలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. జిల్లాలో 50 శాతం మేర  వర్షపాతంలోటు ఉంది. వర్షాభావం కారణంగా జిల్లాలో ఎక్కడా చెరువులు, బావులు ఇతర నీటి వనరులు నిండలేదు.మంజీరా ఎగువ ప్రాంతంలో వర్షాలు కురవకపోవడంతో సింగూరు, మంజీరా జలాశయాల్లో తగినంత నీరు వచ్చి చేరలేదు. సింగూరు, మంజీరా జలాశయాల నుంచే జిల్లా ప్రజలకు, హైదరాబాద్ మహానగర తాగునీటి అవసరాలు తీర్చటం జరుగుతోంది.

అయితే ప్రస్తుతం సింగూరు, మంజీరా జలాశయాల్లో నీటి మట్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. జంటనగరాలతోపాటు జిల్లాలోని పలు రక్షిత మంచినీటి పథకాలకు తాగునీరు అందించే సింగూరు పూర్తి నీటి నిల్వ సామర్థ్యం  30 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 11 టీఎంసీ జలాలు మాత్రమే ఉన్నాయి. రాబోయే రోజుల్లో సింగూరు ప్రాజెక్టులో నీటి మట్టం మరింత తగ్గే అవకాశం ఉంది. దీంతో సింగూరు ద్వారా తాగునీరు సరఫరా అయ్యే ప్రాంతాల్లో నీటి ఇబ్బంది తప్పకవపోచ్చు.

సంగారెడ్డి సమీపంలోని మంజీరా రిజర్వాయర్‌లో 1.56 టీఎంసీల జలాలు ఉండాల్సి ఉండగా, ప్రస్తుతం 0.36 టీఎంసీల నీటి నిల్వలు మాత్రమే ఉన్నాయి. మంజీరా రిజర్వాయర్‌లో జలమట్టాలు క్రమంగా పడిపోతున్నాయి. ఇదే పరిస్థితి మరో పదిరోజులపాటు కొనసాగితే సంగారెడ్డి మున్సిపాలిటీ, ఇతర రక్షిత మంచినీటి పథకాలు, జంటనగరాలకు తాగునీటి సరఫరాల్లో ఇబ్బందులు తలెత్తవచ్చని అధికారులు చెబుతున్నారు.

 పాతాళంలోకి గంగ....
 తాగునీటి కోసం అత్యధిక శాతం ప్రజలు జిల్లాలో ప్రధానంగా బోర్లు, బావులుపైనే ఆధారపడుతున్నారు. ఈ ఏడాది వర్షాలు కురవకపోవటంతో భూగర్భ జలమట్టాలు పెరగలేదు. దీంతో బోరుబావులు, బావుల్లోకి ఆశించిన స్థాయిలో నీళ్లు రాలేదు. వర్షాభావానికి తోడు అవసరానికి మించి నీళ్లు తోడుతుండటంతో బోరుబావుల్లో జలమట్టాలు తగ్గుముఖం పడుతున్నాయి. వర్షాభావం కారణంగా బావుల్లో సైతం క్రమంగా నీళ్లు అడుగంటుతున్నాయి.

వేసవి నాటికి చాలా ప్రాంతాల్లో బోర్లు, బావులు ఎండిపోయే పరిస్థితి నెలకొంది. అధికారుల తెలిపిన వివరాల మేరకు జిల్లాలో ప్రస్తుతం భూగ ర్భ జలాలు 15.57 మీటర్ల లోతులో ఉన్నాయి. గత ఏడాదితో పోలిస్తే భూగర్భ జలమట్టాలు 5.26 మీటర్ల మేర తగ్గిపోయాయి. ములుగులో భూగర్భ జలమట్టాలు అత్యధికంగా 33.65 మీటర్లకు పడిపోయాయి. తూప్రాన్, కొల్చారం, టేక్మాల్, చిన్నశంకరంపేట, రామచంద్రాపురం, నారాయణఖేడ్ ప్రాంతంలో భూగర్భ జలమట్టాలు తగ్గుముఖం పడుతున్నాయి.

 1,099 ఆవాస ప్రాంతాల్లో నీటి ఎద్దడి
 రానున్న వేసవి దృష్ట్యా ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు తాగు నీటి సమస్యను ఎదుర్కొనేందుకు ముందస్తుగానే సన్నద్ధమవుతున్నారు. వేసవిలో నీటి ఎద్దడిని అంచనా వేయటంతోపాటు సమస్య పరిష్కారం కోసం ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రాథమిక ప్రత్యామ్నాయ ప్రణాళికను సిద్ధం చేశారు. ప్రత్యామ్నాయ ప్రణాళికను అనుసరించి వేసవిలో 44 మండలాల్లోని  1,099 ఆవాస ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి తలెత్తవచ్చని అంచనా వేస్తున్నారు.

మెదక్ డివిజన్‌లో 540, సిద్దిపేట డివిజన్‌లో 444, సంగారెడ్డి డివిజన్‌లో 115 గ్రామాల్లో నీటి  సమస్య ఉత్పన్నమయ్యే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. వీటిలో 624 గ్రామాల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. అలాగే 354 గ్రామాలకు తాగునీటిని రవాణా చేయక తప్పదని అధికారులు ఓ నిర్ణయానికి వచ్చేశారు.

నీటి  ఎద్దడిని ఎదుర్కొనేందుకు ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు రూ.41 కోట్లతో ప్రత్యామ్నాయ ప్రణాళిక రూపొందించారు. నీటి ఎద్దడి తలెత్తే గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేయటంతోపాటు బోరుబావులు మరమ్మతులు, వ్యవసాయబోర్లు అద్దెకు తీసుకోవటం, రక్షితనీటి పథకాల మరమ్మతులు చేయాలని ఆర్‌డబ్ల్యూఎస్ అధికారులు ప్రత్యామ్నాయ ప్రణాళికలో ప్రతిపాదించారు. వేసవినాటికి తాగునీటి సమస్య నెలకొనే గ్రామాల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నందున ప్రత్యామ్నాయ ప్రణాళిక వ్యయం పెరిగే అవకాశం ఉంది. 

మరిన్ని వార్తలు